- ఏఏపీసీ కింద డెవలప్ చేసేందుకు సర్కారు చర్యలు
- మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు రూ.30.60 కోట్లు మంజూరు
- గత ప్రభుత్వం హయాంలో పాలమూరు జిల్లాలో 48 స్కూళ్లకు తాళాలు
మహబూబ్‌నగర్, వెలుగు: పాఠశాల విద్యపై రాష్ట్ర సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రతి గ్రామంలో ఒక బడిని ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న స్కూళ్లను బలోపేతం చేసేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ(ఏఏపీసీ)ని అమల్లోకి తెచ్చింది. ఈ కమిటీ ద్వారా బడుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు జిల్లాల్లో విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీలతో చర్చించి, నిర్ణయాలు తీసుకోనుంది.
ఫేస్–1లో 958 స్కూల్స్..
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో 1,500 సర్కారు బడులు ఉండగా, ఇందులో ఏఏపీసీ ఫేస్–1లో 958 బడులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన బడులను ఐదు కాంపోనెంట్లుగా డివైడ్ చేసి పనులు ప్రారంభించారు. మొదటి కాంపోనెంట్లో తాగునీటి సౌకర్యం, రెండో కాంపోనెంట్లో బడుల్లో మైనర్ రిపేర్లు, మూడో దాంట్లో టాయిలెట్ల రిపేర్లు, నాల్గో దాంట్లో కరెంట్ పనులు, ఐదో కాంపోనెంట్లో కొత్త టాయిలెట్ల నిర్మాణాలు చేపడతారు. రెండు జిల్లాలకు ఫేస్–1 కింద సర్కారు ఇటీవల రూ.30.60 కోట్లు శాంక్షన్ చేసింది. ఇందులో పాలమూరు జిల్లాకు రూ.18.30 కోట్లు, నారాయణపేటకు రూ.12.30 కోట్లు కేటాయించారు.
ఈ నిధులతో పాలమూరు జిల్లాలోని 490 బడులను, నారాయణపేటలో 468 బడులను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నుంచే పనులు మొదలు కాగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ బై పోల్ కోడ్ కారణంగా, గత నెల 10న ఈ స్కీం కింద డెవలప్మెంట్ పనులు స్టార్ట్ అయ్యాయి. జూన్ 12 నాటికి గుర్తించిన బడుల్లో అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వం అమలు చేసి, గాలికొదిలేసిన ‘మన ఊరు–-మన బడి’ స్కీం కింద మిగిలిన పనులను చేయడానికి కూడా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ‘మనఊరు–-మన బడి’ స్కీం కింద ఎంపికైన బడుల్లో ఇప్పటి వరకు వంద శాతం పనులు పూర్తి కాలేదు. కొన్ని చోట్ల అసలు పనులు కూడా స్టార్ట్ కాలేదు. ఈ బడులను రాష్ట్ర ప్రభుత్వం ఫేస్–2 కింద ఎంపిక చేయనుంది.
డిజిటల్ బోధనపై దృష్టి..
బడుల్లో డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్ని బడుల్లో డిజిటల్ విద్యా బోధనకు కావాల్సిన పరికరాలను సమకూర్చింది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్లకు పెద్ద మొత్తంలో స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. దీంతో ఇటీవల రిలీజ్ అయిన టెన్త్ రిజల్ట్స్‌లో ప్రైవేట్ స్కూల్స్ కంటే సర్కారు బడుల్లో చదువుకున్న స్టూడెంట్లే ఎక్కువ మొత్తం గ్రేడ్–-ఏతో ఉత్తీర్ణులయ్యారు.
గత ప్రభుత్వ హయాంలో 48 బడులు మూత..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడులపై పూర్తి నిర్లక్ష్యం కనబర్చింది. స్కూల్ ఎడ్యుకేషన్‌పై ఎలాంటి దృష్టి పెట్టలేదు. దీంతో జిల్లాల్లో సర్కారు బడులు అధ్వానంగా తయారయ్యాయి. 2021 నుంచి గత విద్యా సంవత్సరం వరకు ఒక్క పాలమూరు జిల్లాలో 48 స్కూల్స్ మూతబడ్డాయి. గిరిజన తండాల్లోని బడులను ఎక్కువగా మూసివేయడం పట్ల అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీనికితోడు ‘మనఊరు–-మనబడి’ స్కీం కింద జిల్లాలోని 837 బడుల్లో 280 బడులను మాత్రమే ఎంపిక చేసింది. ఇక ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో చాలా బడుల్లో పనులు ప్రారంభించలేదు. కొన్ని బడుల్లో ఉపాధి హామీ స్కీం కింద టాయిలెట్ల రిపేర్లు చేయించి చేతులు
దులుపుకున్నారు.
చైర్పర్సన్లుగా మహిళలు..
ఏఏపీసీ చైర్ పర్సన్లుగా ప్రభుత్వం మహిళలకు అవకాశం కల్పించింది. బడులను రీ ఓపెన్ చేశాక చైర్పర్సన్లను ఎంపిక చేయనుంది. చైర్పర్సన్ ఆధ్వర్యంలో రెండు, మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించి, బడుల్లో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోనుంది. బడుల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు, మెరుగైన ఫలితాలు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఉన్నతాధికారులకు ఈ కమిటీలు నివేదించనున్నాయి.