గ్రౌండ్ వాటర్​ వినియోగంపై సర్కారు ఫోకస్

గ్రౌండ్ వాటర్​ వినియోగంపై సర్కారు ఫోకస్
  • అతిగా తోడేస్తున్న వారి గుర్తింపునకు విజిలెన్స్ కమిటీలు
  • పరిమితికి మించి వాడితే ఫైన్లు
  • వాల్టా యాక్టు పటిష్టం చేసేలా చర్యలు
  • ఫ్యూచర్ లో నీటి సంక్షోభం తలెత్తకుండా యాక్షన్ 

హనుమకొండ, వెలుగు: ఎండాకాలం వచ్చిందంటే ఇండ్ల నుంచి ఇండస్ట్రీల వరకు అంతటా నీటి వినియోగం ఎక్కువవుతుంది. నీళ్లను రీస్టోర్ చేసే ఫెసిలిటీస్ ​లేకపోవడం, ఫంక్షన్​ హాళ్లు, బల్క్​వాటర్​సప్లయర్స్, మైనింగ్, గ్రానైట్​ కంపెనీలు పరిమితి లేకుండా తోడేస్తుండటం వల్ల భూగర్భ జలాలు మీటర్ల కొద్దీ పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రౌండ్​వాటర్ విచ్చలవిడి వినియోగంపై ప్రభుత్వం స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. అతిగా గ్రౌండ్​వాటర్​ ను తోడేస్తున్న ఇండస్ట్రీలు, కంపెనీలకు ఫైన్లు కూడా విధించడమే కాకుండా నిబంధనలు అతిక్రమించే వాటిని సీజ్​ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందుకు జిల్లాల్లో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయగా.. ఉమ్మడి వరంగల్​జిల్లాలో భూగర్భ జలశాఖ అధికారులు అతిగా గ్రౌండ్​ వాటర్ వినియోగిస్తున్న వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు.

‘నో ఆబ్జెక్షన్’​ తప్పనిసరి 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 6 లక్షలకు పైగా బోర్లున్నాయి. గ్రానైట్, మైనింగ్, ఇతర కమర్షియల్​అవసరాలకు సంబంధించిన ఇండస్ట్రీలు పరిమితి లేకుండా నిత్యం లక్షల లీటర్ల నీటిని భూగర్భం నుంచి తోడేస్తున్నాయి. దీంతో భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం వాల్టా యాక్ట్- 2002ను పటిష్టపరుస్తూ తెలంగాణ గ్రౌండ్​వాటర్​ఎక్స్​ట్రాక్షన్​రూల్స్​-2023 ప్రకారం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 2023 చివర్లోనే ఈ రూల్స్ అమల్లోకి వచ్చినా.. వివిధ కారణాల వల్ల ఇన్నిరోజులు పెద్దగా అమలుకు నోచుకోలేదు. ఈ వాటర్​ఎక్స్​ట్రాక్షన్​ నిబంధనల్లో ప్రభుత్వం వ్యక్తిగత ఇండ్లు, వ్యవసాయ రంగాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో నెలకు 25 వేల లీటర్ల నీటిని వినియోగించే అపార్ట్​ మెంట్స్, హౌజింగ్ సొసైటీలకు మినహాయింపు ఇస్తూ బోర్లు వినియోగించే ప్రతి ఇండస్ట్రీకి ఎన్​వోసీ(నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్​) తప్పనిసరి చేసింది. 

ఇన్​ఫ్రా స్ట్రక్షర్​ప్రాజెక్టులు​రూ.10 వేలు చెల్లించి ఎన్​వోసీw తీసుకోవాల్సి ఉండగా,  నిత్యం 25 వేల లీటర్లు వినియోగించే ఇండస్ట్రీలు 14,500, 25 వేల నుంచి 50 వేల లీటర్లు వినియోగించేవి రూ.18 వేలు, 50 వేల నుంచి లక్ష లీటర్లకు రూ.32 వేలు, అంతకుమించి వాడే ఇండస్ట్రీలు రూ.42 వేలు, మైనింగ్​ ప్రాజెక్టులు రూ.లక్ష చెల్లించి ఎన్​వోసీ తీసుకోవాల్సి ఉంది. ఇందులో ఇన్​ ఫ్రా స్ట్రక్షర్​ ప్రాజెక్టులకు 5 ఏండ్లు, ఇండస్ట్రీస్, కమర్షియల్ కంపెనీలు, బల్క్​ వాటర్, ప్యాకేజ్డ్​డ్రింకింగ్ వాటర్​ సప్లయర్లకు 3 ఏండ్లు, మైనింగ్ ప్రాజెక్టులకు 2 ఏండ్ల తరువాత ఎన్​వోసీ రిన్యూవల్​ చేసుకోవాల్సి ఉంటుంది.

జిల్లా స్థాయిలో విజిలెన్స్ కమిటీ 

గ్రౌండ్​ వాటర్​ ఎక్స్​ట్రాక్షన్​ రూల్స్​ ప్రకారం ప్రతి ఇండస్ట్రీ ఎన్​వోసీతో పాటు బోర్లకు డిజిటల్ ​వాటర్​ ఫ్లో మీటర్, పీజో మీటర్స్, నీటి నాణ్యత, నిత్యం తోడే నీటి పరిమాణానికి సంబంధించిన లాగ్ బుక్, ఇంకుడుగుంతలు కలిగి ఉండాలి. 20 వేల లీటర్ల కన్నా ఎక్కువ భూగర్భ జలాలను వినియోగించే అపార్ట్​మెంట్స్​ కచ్చితంగా ఎస్​టీపీలను ఏర్పాటు చేసుకోవాలి.  కానీ ఇవన్నీ ఎక్కడా కనిపించవు. దీంతోనే గ్రౌండ్ వాటర్​ ఎక్స్​ట్రాక్షన్​ రూల్స్​ను స్ట్రిక్ట్ గా అమలు చేసేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో విజిలెన్స్​ కమిటీలను కూడా నియమించింది. 

ఇందులో అడిషనల్​కలెక్టర్​(రెవెన్యూ), స్థానిక ఎమ్మార్వోలు, పోలీస్​ ఆఫీసర్లు, డీఆర్డీవో, డిస్ట్రిక్ట్ గ్రౌండ్​వాటర్​ఆఫీసర్లు, కలెక్టర్​ నామినేట్​ చేసే ఇంకో ఆఫీసర్ ఎవరైనా ఒకరు సభ్యులుగా ఉంటారు. కాగా నిబంధనల ప్రకారం ముందుగా జిల్లా భూగర్భ జలశాఖ అధికారులు రెసిడెన్షియల్​అపార్ట్మెంట్స్, ఫంక్షన్​ హాల్స్, గ్రానైట్​ కంపెనీలు, తదితర ఇండస్ట్రీలకు ఎన్​వోసీలు తీసుకోవాల్సిందిగా నోటీసులు 
అందిస్తున్నారు. 

రూల్ ప్రకారం ఫైన్.. బ్రేక్​ చేస్తే సీజ్​

గ్రౌండ్​వాటర్ ఎక్స్​ట్రాక్షన్ రూల్స్​బ్రేక్​చేసే వారిపై సీరియస్​ యాక్షన్​ తీసుకునేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. రూల్స్ పాటించని వారితో పాటు పరిమితికి మించి భూగర్భజలాలను వినియోగించేవారికి ఫైన్లు కూడా విధిస్తున్నారు. కాగా కొంతమంది ఫైన్లు చెల్లించేందుకు ముందుకొస్తుండగా.. మరికొందరు మొండికేస్తున్నట్లు తెలిసింది. దీంతో అలాంటి వారిపై ఆఫీసర్లు స్పెషల్​ ఫోకస్​ పెడుతున్నారు. 

రెండు సార్లు నోటీసులు అందించి, అయినా వారి నుంచి స్పందన రాకపోతే జిల్లా విజిలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఆయా ఇండస్ట్రీలను సీజ్​ చేసేందుకు కూడా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే హనుమకొండ జిల్లాలో వివిధ రకాల 25 ఇండస్ట్రీలకు రూ.6.5 లక్షల వరకు ఫైన్​ కూడా విధించారు. తొందర్లోనే ఇండస్ట్రీలన్నింటికీ నోటీసుల ప్రక్రియ పూర్తి చేసి, ఫైన్లు వసూలు చేసేందుకు రెడీ అవుతున్నారు. 

 పరిమితికి మించి వాడితే ఫైన్లు

తెలంగాణ గ్రౌండ్​వాటర్​ఎక్స్​ట్రాక్షన్​రూల్స్​ ప్రకారం ప్రతి ఇండస్ట్రీ భూగర్భజల శాఖ నుంచి ఎన్​వోసీ తీసుకోవాలి. దాని ప్రకారం ఇండస్ట్రీలకు నోటీసులు ఇస్తున్నాం. పరిమితికి మించి భూగర్భజలాలను వినియోగించే ఇండస్ట్రీలకు ఫైన్లు విధిస్తున్నాం. రూల్స్​ కు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన యాక్షన్​ తీసుకుంటాం. నోటీసులకు రెస్పాండ్​ అవని ఇండస్ట్రీలను విజిలెన్స్​కమిటీ ఆధ్వర్యంలో సీజ్​ చేస్తాం.

 శైలశ్రీ మల్లికాదేవి, డీడీ, భూగర్భజల శాఖ