కొత్తవి లేవు.. విస్తరణ లేదు!

కొత్తవి లేవు..  విస్తరణ లేదు!
  • సిటీలో ఏండ్లుగా రోడ్ల పనులు పెండింగ్
  • మంజూరైన వాటికి నిధులు ఇవ్వట్లేదు
  • ఎమర్జెన్సీ ప్రాంతాల్లోనూ పూర్తి చేయట్లేదు
  • బల్దియా గ్రీవెన్స్ సెల్ కు ప్రజల ఫిర్యాదులు
  • కాల్ చేసి అడిగినా అధికారుల నుంచి నో ఆన్సర్ 
  • జనాలకు తొలగని ట్రాఫిక్ కష్టాలు 

“ షేక్ పేట్ డివిజన్ కు చెందిన రాజు గత నెల 22న బల్దియా గ్రీవెన్స్ సెల్ కు ఫిర్యాదు చేసి.. డివిజన్ లోని మా ప్రాంతంలో రోడ్డుపై ఎప్పుడూ గుంతలే ఉంటున్నాయి. రోడ్లు ఎందుకు వేయడం లేదు’’ అని ప్రశ్నించాడు. ఆ తర్వాత అక్కడ రోడ్డు పనులు పూర్తి చేసినట్టు అదేనెల 31న అతడి సెల్ కు మెసేజ్ వచ్చింది. పనులు చేయకుండానే ఫిర్యాదు ఎలా క్లోజ్ చేశారని రాజు మళ్లీ ఈనెల ఫస్ట్ వీక్ లో  కంప్లయింట్ చేశాడు. రెండురోజుల తర్వాత అతనికి బల్దియా అధికారి కాల్ చేసి గ్రీవెన్స్ సెల్ కు  ఎందుకు ఫిర్యాదు చేశారని ఆరా తీశాడు. రోడ్డుపై పడిన గుంతలను ఎందుకు పూడ్చడం లేదని మళ్లీ రాజు ప్రశ్నించాడు. పనులు చేయకుండానే నా ఫిర్యాదును ఎందుకు క్లోజ్ చేశారని నిలదీశాడు. దీనిపై ఆ అధికారి జవాబు ఇస్తూ  .. రూ.1.98 కోట్లతో  రోడ్డు మంజూరు అయిందని (ఫైల్ నెంబర్ 32510) ఫండ్స్​రాకపోవడంతోనే రోడ్లు వేయడం లేదని తెలిపాడు. ఫండ్స్​రాగానే రోడ్లు వేస్తామని చెప్పి మళ్లీ గ్రీవెన్స్​ని క్లోజ్ చేశాడు. ఇలా అధికారులే ఫండ్స్ లేవని డైరెక్టుగా చెబుతున్న పరిస్థితి ఉంది.’’ 

హైదరాబాద్, వెలుగు: సిటీతో పాటు శివారులోనూ రోడ్ల విస్తరణను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. దీంతో ప్రజలు నిత్యం ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల ఎమర్జెన్సీగా విస్తరించాల్సిన రోడ్ల పనులను కూడా పూర్తి చేయట్లేదు. ఓల్డ్ సిటీలో 13 రోడ్లకు సంబంధించి కొన్నేళ్లుగా పెండింగ్ లో పడ్డాయి. దీనికి కారణం ఆస్తుల సేకరణకు ఫండ్స్​ లేకనే అధికారులు నిలిపేశారు. దీనిపై ఇటీవల స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆస్తుల సేకరణకు రూ.150  కోట్లు హెచ్ఎండీఏ నుంచి మంజూరు చేయించారు. అయితే ఎన్నికల ముందు రోడ్ల విస్తరణ తలనొప్పిగా మారేలా ఉంది. 

ఓల్డ్ సిటీలో ఆస్తుల సేకరణ కూడా పెద్ద సవాల్ గా నిలవనుండగా మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది. ఇక రోడ్లు ఖరాబైన చోట రికార్పెటింగ్ చేసేందుకు ఫండ్స్​ లేకపోవడంతో పాటు కొత్తగా మంజూరైన చోట్ల పనులు కూడా ఆగిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలాచోట్ల రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. వర్షాలు తగ్గుముఖం పట్టి 15 రోజులైన కూడా రోడ్లపై పడిన గుంతలను పూడ్చడం లేదు. కొత్తగా రోడ్లు వేయడంలేదు. ఎందుకు వేయడంలేదని జనాలు ప్రశ్నిస్తూ.. బల్దియా గ్రీవెన్స్​సెల్ కు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా.. ఎన్నిసార్లు కంప్లయింట్ చేసినా పనులైతే చేయడంలేదు. చివరకు గ్రీవెన్స్​సెల్ అధికారులతో మాట్లాడితే  కొత్త రోడ్లకు పనులు శాంక్షన్ అయ్యాయని, నిధులు రాగానే  ప్రారంభిస్తామని చెబుతూ సమాధానం ముగించేస్తున్నారు. 

మంజూరైన వాటిలో సగమే..

 కొత్త రోడ్ల నిర్మాణాలను బల్దియా పట్టించుకోవడంలేదు.  గ్రేటర్ లో మొత్తం  9,013 కి. మీ మేర రోడ్లు ఉండగా.. 6,167 కి.మీ (68.42 శాతం) సీసీ రోడ్లు,  2,846  కి.మీ (31.58 శాతం) బీటీ రోడ్లు ఉన్నాయి. ప్రతిఏటా రోడ్ల పనులకు నిధులు మంజూరు చేస్తున్నా పనులను చేయడంలో బల్దియా నిర్లక్ష్యంగా ఉంటుంది. గతేడాది రూ.1,274 కోట్లతో 4,790 రోడ్ల  పనులు చేపట్టగా.. అందులో రూ.697 కోట్లతో  2,480 మాత్రమే పూర్తయ్యాయి. ప్రస్తుత  ఏడాదిలోనూ రూ.567 కోట్లతో  2,162 పనులు మంజూరు చేయగా, ఇప్పటి వరకు రూ.10 కోట్లకు సంబంధించి 22 పనులు కంప్లీట్ అయ్యాయి. ఇలా నిధులు మంజూరు చేసినా పనులు చేయడంలేదు. దీంతో సిటీలో ఎక్కడ చూసినా రోడ్లు పూర్తిగా ఖరాబ్ అయ్యాయి. దీంతో వాహనదారులు సాఫీగా ప్రయాణించలేకపోతున్నారు. 

శివారు మున్సిపాలిటీల్లోనూ అంతే.. 

సిటీ శివారులోని బండ్లగూడ జాగీర్, ఘట్ కేసర్, కొత్తూరు, దమ్మాయిగూడ, నాగారం, బడంగ్ పేట్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మణికొండ, జవహర్ నగర్  మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో రూ. 1,250 కోట్లతో 103.45 కిలోమీటర్ల మేర లింక్ రోడ్లను నిర్మిస్తున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కొన్నింటి రోడ్ల వైడెనింగ్ కూడా ఉంది. ఆ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ట్రాఫిక్ జామ్ లతో స్థానికులు ఇబ్బందులు పడుతుండగా.. త్వరగా పనులనైతే షురూ చేయడంలేదు. ప్రభుత్వ హడావుడిగా ప్రకటిస్తుండగా పనులను వెంటనే చేపట్టి కంప్లీట్ చేయట్లేదు. అవసరమైన చోట చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తీరుతాయి. కానీ.. చేస్తామని చెబుతున్నారే తప్ప, పాలనాపరమైన అనుమతులైతే ఇవ్వట్లేదు.  .