మరో వెయ్యి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్..తాజాగా నిర్ణయించిన రాష్ట్ర సర్కార్

మరో వెయ్యి రైతు వేదికల్లో  వీడియో కాన్ఫరెన్స్..తాజాగా నిర్ణయించిన రాష్ట్ర సర్కార్
  • తొలిదశలో సబ్ డివిజన్లలో ప్రారంభించగా సత్ఫలితాలు 
  • రెండో దశలో మండలాల్లోని రైతు వేదికల్లోనూ ఏర్పాటు 
  • ఎక్కువ మంది రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు  
  • మంత్రి ఆదేశాలతో రెండు, మూడు నెలల్లో వీసీ సేవలు

మెదక్, వెలుగు : ఆధునిక పద్ధతిలో వ్యవసాయ పంటల సాగుపై రైతులకు అవగాహన, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రెండో దశలో మరో వెయ్యి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) సదుపాయం కల్పించేందుకు తాజాగా రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గతేడాది ఫిబ్రవరిలో తొలి దశలో  అన్ని జిల్లాల్లోని వ్యవసాయ సబ్ డివిజన్ కు ఒక రైతు వేదికలో అమలులోకి తెచ్చింది. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి 64 ఇంచుల టీవీ, మైక్, స్పీకర్ ను అందజేసింది. ఒక్కో రైతు వేదికకు రూ.3.70 లక్షలు మంజూరు చేసింది. ప్రతి మంగళవారం ‘రైతు నేస్తం’ ద్వారా అగ్రికల్చర్ సైంటిస్ట్ లు, నిపుణులతో  రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహి స్తుండగా సత్ఫలితాలు ఇస్తోంది. దీంతో మరిన్ని రైతు వేదికల్లోనూ ఏర్పాటు చేసేందుకు రెండు, మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అన్ని జిల్లాల్లో 30 -– 50 రైతు వేదికల్లో వీసీ ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది.  తద్వారా వేలాది మంది రైతులకు బెనిఫిట్ కలగనుంది. 

వ్యవసాయ అనుబంధ రంగాలపైన కూడా..

జిల్లాల్లో సబ్ డివిజన్ లో ఒకచోట మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండడంతో చాలామంది రైతులకు ఉపయోగపడడంలో లేదు.  రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మండలాల వారీగా అనువైన రైతు వేదికలను వ్యవసాయశాఖ అధికారులు ఎంపిక చేశారు. అక్కడ వీసీ నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.  ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించిన అంశాలపైనే రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.  భవిష్యత్ లో మత్స్య, పట్టు పరిశ్రమ, పశుసంవర్థక, ఉద్యానవన శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా సలహాలు, సూచనలు అందించే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.  

రైతు నేస్తం ప్రోగ్రామ్ ద్వారా..

పంటల సాగులో మూస విధానాలతో పెట్టుబడి వ్యయం పెరుగుతుండగా రైతులు ఆశించిన దిగుబడులు సాధించడంలేదు. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేందుకు, అధిక దిగుబడి సాధించేందుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా అవగాహన లేక రైతులు వినియోగించుకోవడంలేదు. దీంతో ఆధునిక విధానాల పై సలహాలు, సూచనలు అందించి రైతులు అవలంభించేలా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని గతేడాది ప్రారంభించింది. ప్రతి మంగళవారం  ‘రైతు నేస్తం’ ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఆధునిక పద్ధతుల్లో పంటల సాగు విధానం, మేలైన విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి ఆవశ్యకత, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు తదితర అంశాలపై రైతులకు సలహాలు, సూచనలు ఇస్తోంది. మరోవైపు  ప్రభుత్వం అమలు చేసే రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ పథకాలపై అవగాహన కల్పిస్తోంది. ఆదర్శ రైతుల ఇంటర్వ్యూలను కూడా ప్రసారం చేస్తోంది.