- రూ.30.70 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
కరీంనగర్, వెలుగు: మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న వడ్డీ లేని రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం మిత్తి పైసలను విడుదల చేసింది. ఈ రుణాలకు సంబంధించి గత ఫిబ్రవరి, మార్చి నెలల మొత్తం వడ్డీ రూ.30.70 కోట్లు రిలీజ్ చేసింది. ఈ డబ్బులు త్వరలోనే మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలోని 5,283 గ్రూపులకు రూ.1.99 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 5,010 గ్రూపులకు రూ.1.91 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3,983 గ్రూపులకు రూ.1.66 కోట్లు, కరీంనగర్ జిల్లాలోని 3,291 గ్రూపులకు రూ.1.55 కోట్లు జమ కానున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాబోతున్న సందర్భంగా సర్కార్ కానుకగా మహిళలకు ఈ మిత్తి పైసలు జమ చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మహిళా సంఘాలకు రావాల్సిన నాలుగేళ్ల వడ్డీ పైసలు ఇవ్వకపోవడంతో అవి పెండింగ్‌లోనే ఉన్నాయి.