
- ఓరుగలో కాకతీయుల కాలంనాటి బావి
- దశాబ్దాలుగా డంపింగ్ యార్డులా మారిన వైనం ల్లు
- మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో స్పీడ్ గా పునరుద్ధరణ పనులు
వరంగల్, వెలుగు: కాకతీయుల కాలం నాటి మెట్లబావికి ప్రస్తుత సర్కార్ జీవం పోసింది. మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకుని రూ.50 లక్షల నిధులు మంజూరు చేయించింది. దీంతో స్పీడ్ గా మెట్లబావి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. కాకతీయుల కాలంలో ఓరుగల్లు రాజధాని చుట్టూరా ఎక్కడా నది లేదు. కాబట్టి 800 ఏండ్ల కిందటే తాగు, సాగు నీటితో పాటు నిత్యావసరాలకు వందలాది మెట్ల బావులు తవ్వించారు.
ప్రతి వానబొట్టు వృథా కాకుండా 365 రోజులు నీరు నిలువ ఉండేలా కోనేరులు, బావులను నిర్మించారు. ఇందులో మెట్ల బావులు ఎంతో ఆకర్షణగా ఉంటాయి. 14వ శతాబ్దంలో వినుకొండ వల్లభరాయుడు రాసిన 'క్రీడాభిరామం'లోనూ కాకతీయులు వరంగల్ లో 365 మెట్ల బావులు తవ్వించినట్లు ఉంది. వందల ఏండ్లుగా వీటిని సంరక్షించేవారు లేకపోవడంతో చాలా బావులు నామ రూపాలు కోల్పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నడిబొడ్డున శివనగర్‍లో ఇండ్ల మధ్యనున్న మెట్ల బావి పునరుద్ధరణ చర్యలు చేపట్టింది.
సిగ్గు పడుతున్నానన్న కేటీఆర్.. రూపాయి ఇవ్వలే
కేంద్ర ప్రభుత్వం 2016,2017, 2018లో వరుసగా వరంగల్ సిటీని హెరిటేజ్ సిటీగా ప్రకటించింది. హృదయ్ పథకం ద్వారా ఖిలా వరంగల్ కోట, వెయ్యి స్తంభాలగుడి, రామప్ప ఆలయాల అభివృద్ధికి రూ.42 కోట్ల నిధులు కేటాయించింది. అప్పటి వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి బావుల సంరక్షణకు రూ.కోటిన్నరతో ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించారు.
అయినా.. కాకతీయుల మెట్ల బావుల సంరక్షణకు కేసీఆర్ సర్కార్ రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ, సికింద్రాబాద్ బన్సీలాల్‍పేటలోని మెట్ల బావిని మాత్రం 13 నెలల్లో రూ.10 కోట్లతో పునరుద్ధరించారు. 2022 జులై 7న కాకతీయుల వారసుడు కమల్‍చంద్ర బాంజ్‍దేవ్ తమ పూర్వీకుల రాజధాని ఓరుగల్లును సందర్శించారు. ఆపై హైదరాబాద్‍లో టార్చ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో కమల్ చంద్రతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..800 ఏండ్లనాటి ఓరుగల్లు వారసత్వ సంపద, మెట్ల బావులు మరుగునపడినందుకు సిగ్గు పడుతున్నట్లు కమల్‍చంద్రకు చెప్పారు. సంరక్షించాల్సింది ఇంకా ఎంతో ఉందని.. తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆపై కాకతీయుల వారసుడికి ఇచ్చిన మాట మరిచారు.
ఏప్రిల్ నుంచి చూడొచ్చు
కాకతీయ కాలంనాటి మూడు అంతస్తుల మెట్ల బావిని భావితరాలకు చూపాలనే ఆకాంక్షతో జిల్లాకు చెందిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ చూపారు. పనులకు అవసరమైన రూ.50 లక్షలు కేటాయించారు. దీంతో నాలుగైదు నెలల కింద పనులు మొదలుపెట్టారు. బావిలోని చెత్త తొలగించారు. కుంగిన పిల్లర్లను సరిచేశారు.
లోపల బావి చుట్టూ జనాలు నడిచేచోట బండలు వేశారు. ప్రమాదాలు జరగకుండా రెయిలింగ్ నిర్మించారు. రాత్రి సమయాల్లో కూడా చూసేందుకు లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో పనులు చివరి దశకు చేరాయి. మొత్తంగా కాకతీయులు తవ్వించిన 800 ఏండ్లనాటి మెట్ల బావిని వచ్చే ఏప్రిల్ లో పున:ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.