- ఇప్పటికే పది చోట్ల ప్రారంభం
- రోజుకు10 టన్నులకు పైగా చెత్తను తొలగిస్తున్న అధికారులు
- పనులు వేగం పెంచేందుకు ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించే ఏర్పాట్లు
- ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు
- ఏడాదిలో చెత్త పూర్తిగా తొలగించాలని ప్రణాళికలు
హైదరాబాద్ సిటీ, వెలుగు:మూసీ ప్రక్షాళన పనులను ప్రభుత్వం స్పీడప్చేసింది. ఇప్పటికే మూసీలో నిర్మాణాలను తొలగించేందుకు సర్వే చేస్తుండగా మరోవైపు మూసీలో చెత్తను తొలగించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) అధికారులు మూసీలోని కొన్ని పాయింట్ల వద్ద చెత్తను తొలగిస్తున్నారు.
గతంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చెత్తను తరలించి ఇందులో పోసిన ఘటనలున్నాయి. అలాగే, మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు చెత్త, పశువుల కళేబరాలు, ప్లాస్టిక్ వస్తువులు, కబేలాల నుంచి జంతువుల వ్యర్థాలు, డ్రైనేజీ వ్యర్థాలు తెచ్చి మూసీలో వేసేవారు. వివిధ ప్రాంతాల నుంచి నాలాలు, డ్రైనేజీ నీరు కూడా మూసీలోకే వదులుతున్నారు. దీంతో మూసీ మురుగుకూపంగా మారిపోయింది.
ఈ పరిస్థితుల్లో అందులోని మురుగు తొలగించి, లండన్లోని థేమ్స్ నది మాదిరి అందమైన సరస్సుగా మార్చాలని కాంగ్రెస్ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా రూ. 60 వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు చేపట్టింది. ఈ క్రమంలో మూసీలోని ఆక్రమణలను తొలగించడంతో పాటు, మురుగును తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
10 పాయింట్లలో ఫ్లోటింగ్ ట్రాష్ బ్యారియర్స్..
ఎంఆర్డీసీఎల్అధికారులు మూసీ పొడవునా 55 కిలోమీటర్ల పరిధిలో తూర్పున గౌరెల్లి నుంచి పశ్చిమాన నార్సింగి వరకూ నదిలో చెత్తను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించారు. పది పాయింట్లలో ఫ్లోటింగ్ ట్రాష్ బ్యారియర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పద్ధతిలో పారుతున్న నీటికి అడ్డుగా జాలి (నెట్) ఏర్పాటు చేస్తారు. నీరంతా జాలిగుండా వెళ్లిపోతుంది. చెత్త మాత్రం నిలిచిపోతుంది.
ఇలా నిలిచిపోయిన చెత్తను తొలగిస్తారు. ఇప్పుడు మూసీలో బాపూఘాట్, అత్తాపూర్, పురాణాపూల్, ముస్లింజంగ్పూల్, శివాజి బ్రిడ్డి-(ఎ), శివాజి బ్రిడ్జి(-బి), చాదర్ఘాట్, గోల్నాక, మూసారం బాగ్, నాగోల్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి రోజుకు 10 టన్నుల చెత్తను తొలగిస్తున్నారు. అయితే 55 కి.మీ. పరిధిలో చెత్తను తొలగించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి..పనుల నిర్వహణను కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని అధికారులు
నిర్ణయించారు.
ఏడాదిలోగా పూర్తి చేసేలా..
మూసీలోని చెత్త, ఇతర వ్యర్థాలు తొలగించేందుకు కనీసం ఏడాది పడుతుందని అధికారులు అంటున్నారు. దీని కోసం ఇటీవలే ఎంఆర్ డీసీఎల్అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఫ్లోటింగ్ ట్రాష్ బ్యారియర్స్ పద్ధతిలోనే నదిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో చెత్తను తొలగించాలని నిర్ణయించారు. ఇలా ఎత్తిన చెత్తను సమీపంలోని డంపింగ్ యార్డులకు తరలిస్తారు.
టెండర్లు పొందిన కంపెనీలకు ఏడాది గడువు మాత్రమే ఇస్తామని, ఆ లోపు మొత్తం చెత్తను తొలగించేలా షరతులు పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు. సర్వే, కూల్చివేతలు, చెత్త తొలగింపు పనులు పూర్తయ్యాక జంటజలాశయాల నుంచి నీటిని నదిలోకి రిలీజ్చేయాలన్నది అధికారుల ప్లాన్ గా తెలుస్తున్నది. త్వరలోనే టెండర్లను ఖరారు చేసి పనులు అప్పగించనున్నట్టు తెలిపారు