కేసీఆర్​ మోడల్​ దేశాన్ని ఏం చేయనుంది?

రాష్ట్రంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, నేర చరిత్ర గల వారు, అవినీతిపరులైన అధికారులు, కార్పొరేటు విద్యా వైద్యం, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టు, వ్యాపారవేత్తలు, పరస్పర లావాదేవీలు వ్యాపారాలు పరస్పర ప్రయోజనాలు ఇచ్చిపుచ్చుకోవడం ప్రజల కండ్లకు కట్టినట్టు అన్ని పరిపాలన వ్యవస్థలలో,  స్పష్టంగా గోచరిస్తున్నది.  ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మిషన్ కాళేశ్వర, ధరణి, మద్యం తయారీ, వ్యాపారాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్రానైట్, ఇసుక, ల్యాండ్, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ సాఫ్ట్ వేర్ ప్రాజెక్టులు, ప్రశ్నపత్రాల లీకులు ఇంకా మాదకద్రవ్యాల మాఫియాలతో గుత్త వ్యాపారవేత్తలు, అవినీతి అధికారులు, ప్రజా ప్రతినిధులందరూ కలిసి వ్యవస్థలో దోపిడి సొమ్ము నీకింత నాకింత (క్విడ్ ప్రోకో) తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు ప్రభుత్వ ఖజానాను, వనరులను, ప్రజల ఆస్తులను పంచుకుంటున్నారని ప్రజల భావన, ప్రతిపక్షాల ఆరోపణ.

కాసుల పంటలు

గత తొమ్మిది  ఏండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ నిధులను ఖర్చు పెట్టిన సందర్భంలో అనేక లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడం సహజమైపోయింది. హైదరాబాద్, ఇతర జిల్లాల ప్రభుత్వ భూముల అమ్మకాలు, ఇసుక, గ్రానైటు, మద్యం వ్యాపార లావాదేవీలు ప్రభుత్వ అడ్వర్టైజ్​మెంట్స్, ప్రభుత్వ రోడ్లు, భవన, ప్రాజెక్టుల నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఇంకా అనేకం నాయకులకు బడా వ్యాపారస్తులకు అవినీతి అధికారులకు నిత్యం కాసుల పంట పండిస్తూనే ఉన్నాయి. అక్రమ సంపాదనతో ప్రతిపక్ష నాయకులను లొంగ తీసుకోవడానికి, కోవర్టులుగా మార్చుకోవడానికి, డబ్బుతో ప్రజల ఓట్లను దండుకోవడానికి, వేలాది ఎకరాల భూములను సొంతం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయనేది నిర్వివాదాంశం.  తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడి కుటుంబ ఆధిపత్య రాజరికపు పరిపాలన సాగడానికి ఈ దళారి వ్యాపార రాజకీయాలే కారణం. తెలంగాణ దళారి వ్యాపార రాజకీయ వ్యవస్థ మొత్తం దేశానికే ప్రాకడానికి తహతహలాడుతున్నట్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అవతారం ఎత్తడమే ఒక సజీవ సాక్ష్యం. మన ముఖ్యమంత్రి గారికి జాతీయ నాయకత్వాన్ని అప్పగించినట్లయితే దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ గెలిపించుకోగల శక్తి సామర్థ్యాలు అన్ని రకాల వనరులు సమకూర్చగలనని సెలవిచ్చినట్లు వార్తా కథనాలు వచ్చాయి. 

అవినీతి మిషన్లు

తెలంగాణలోని సహజ వనరులు అతి శీఘ్రగతిలో కారు చౌకగా అన్యాక్రాంతం కావడం, అస్మదీయులకు అప్పజెప్పడం ద్వారా పాలకవర్గాలకు వేలకోట్ల ప్రయోజనాలు సంక్రమిస్తున్నట్లు ప్రజలు ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉన్నారు.  రాజకీయ నాయకులు, కార్పొరేటు సంస్థలు,  అధికారులు భూములపై పొందిన అవినీతి డబ్బును పెట్టుబడిగా మార్చుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి.  పేదవాడు 50 గజాల ఇంటి స్థలాన్ని కూడా కొనుక్కో లేని దుస్థితి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు, భగీరథ మిషన్, కాకతీయ మిషన్ ధరణి మిషన్ అన్నీఅవినీతి మయమైనవని ప్రతిపక్ష నాయకులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత దొరలు, వారి బంధువులు, అదే  సామాజిక వర్గం ఇంకా  వందిమాగదులను గమనించి నైజాంనాటి నవాబుల వారసులు తిరిగి అవతారమెత్తినారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలంగాణలో అమలవుతున్న దళారి వ్యాపార రాజకీయాలు కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులను లొంగ తీసుకోవడం, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం మీడియాను సొంతం చేసుకోవడం లేదా  అడ్వర్టైజ్ ​మెంట్ ద్వారా నియంత్రించడం సాధారణ ప్రక్రియగా మారిందని సీనియర్ పాత్రికేయులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజాస్వామ్య వాదులను, ప్రశ్నించిన వారిని అదుపులోకి తీసుకోవడం, అక్రమ కేసులు పెట్టడం ఆస్తి తగాదాలు సృష్టించడం సర్వసాధారణమైంది.  

కేసీఆర్​ మోడల్​ దేశాన్ని ఏం చేయనుంది?

ఇక దేశంలోని అనేక రాష్ట్రాలలో ఇదే మోడల్ దళారి వ్యాపార రాజకీయాలను అమలు చేసినట్లయితే కేసీఆర్ మొదట ప్రకటించినట్లు రాజ్యాంగాన్ని తిరగరాయకుండానే రాజ్యాంగాన్ని కట్టడి చేయగల వ్యూహం అమలు చేయబోతున్నాడు అని అర్థం చేసుకోవాలి. కేసీఆర్ మోడల్ రాజకీయాలను, ప్రభుత్వాన్ని దేశంలో అమలు చేసినట్లయితే ఇక రాజ్యాంగం ఈ కాస్తయినా అమలుకు నోచుకోకపోవచ్చు. చట్టసభలు, పరిపాలనా యంత్రాంగం, న్యాయ, మీడియా వ్యవస్థలు మరింత బలహీన  పడతాయా? పేదలు రాజకీయాలకు, వనరులకు, కూడు, గుడ్డా నివాసానికి దూరం చేయబడతారా?. వేటగాడి ఉచ్చులో పడ్డ పక్షుల లాగా తెలంగాణ ప్రజలు ఏమరుపాటులో దళారి వ్యాపార రాజకీయ వ్యవస్థలో చిక్కినట్లే, దేశ ప్రజలు కూడా చిక్కుకుపోయే ప్రమాదం ఉందా?  కొన్ని ఆఫ్రికా దేశాలలో ప్రజాస్వామ్యం ముసుగులో రాజకీయ నాయకులు, కార్పొరేట్ సంస్థలు, నేర చరిత్ర గలవారు, అవినీతి అధికారులు కలిసి చేసే దళారి కాపిటల్ లిస్టు రాజకీయ వ్యవస్థ వలె.. మన తెలంగాణ మోడల్ కూడా దేశంలో విస్తరిస్తే?  సాధించుకున్న స్వాతంత్ర్యం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రజలు ఆమోదించుకున్న  రాజ్యాంగం  ప్రమాదంలో పడకుండా కాపాడుకోవలసిన కనీస బాధ్యత అందరిపై ఉండాలని ప్రజలు ఆశిస్తారు.కంచె చేను మేసినట్లు!
పిల్లి గుడ్డిదైతే ఎలుక నాట్యం చేస్తుందని చెప్పినట్లు ప్రజలలో చైతన్యం లేకుంటే తెలంగాణలో జరుగుతున్నట్లే దేశమంతా కూడా ఈ దుర్మార్గపు వ్యవస్థను విస్తరించి ఇక ప్రజాస్వామ్యాన్ని సామాజిక  న్యాయాన్ని బొంద పెట్టే ప్రమాదం పొంచి ఉన్నదేమో?  బంగారు తెలంగాణ చేస్తానంటే నమ్మి ప్రజలు మురిసిపోయారు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానంటే బహుజన వర్గాలు సంబరపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ లు అంటే ఇండ్లు లేని అక్కలు, చెల్లెళ్లు, అమ్మలు పండగ చేసుకున్నరు. నిరుద్యోగ భృతి ఇస్తానంటే నిరుద్యోగులు దావత్ చేసుకున్నారు. దళిత బంధు అంటే దళితులంతా పారిశ్రామికవేత్తలవుతున్నామని కలలుగన్నారు. తాను కుక్క కావలి కాస్తనంటే తెలంగాణ ప్రజలు హర్షధ్వా నాలు చేసినారు. కానీ కంచే  చేను మేసినట్లు, కుక్కే అటికె పగలగొట్టి గటుక తిన్నట్లు తెలంగాణలో పాలకులు, బడా కార్పొరేట్ వ్యాపారస్తులు, అవినీతిపరులైన ఉన్నత అధికారులు, నేర చరితులు బంగారం లాంటి సంపదలు మూట కట్టుకొని దేశ రాజకీయాలని గుత్తపట్టే స్థాయికి ఎదగడం మాటున ఎంత విధ్వంసం జరిగిందో ఊహించగలమా! ఈ తమాషా చూస్తున్న ఉద్యమకారులకు ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబ సభ్యులకు  కళ్ళు  చెమ్మగిల్లుతున్నాయి. త్యాగాలు భోగాలు  ఎవరివి?
కూరపాటి వెంకట్ నారాయణ  
‌‌‌‌