కొత్త రెవెన్యూ బిల్లు ముసాయిదా మంచీచెడులు

కొత్త రెవెన్యూ బిల్లు ముసాయిదా మంచీచెడులు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న రెవెన్యూ చట్టంపై  ప్రజాభిప్రాయం కోరడం, అందులో మంచీ చెడులను చర్చకు పెట్టేందుకు అవకాశమివ్వడం శుభపరిణామం. ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే కీలకమైన బిల్లులను చట్టసభల్లో ఆమోదించే ముందు ముసాయిదాగా ప్రవేశపెట్టి,  ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి, అందుకనుగుణంగా మార్పులు, చేర్పులు చేయడమనే సంప్రదాయం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పటి నుంచో ఉంది. కానీ, గత సర్కార్ హయాంలో మేం చేసిందే చట్టం.. చెప్పిందే శాసనం అనే ధోరణితో వ్యవహరించారు. 

ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్స్ యాక్ట్ –2‌‌‌‌‌‌అనే  రెవెన్యూ చట్టాన్ని గుట్టుచప్పుడు కాకుండా రూపొందించి ప్రజల మీద రుద్దారు.  భూరికార్డుల  ప్రక్షాళన ద్వారా తప్పుల తడకగా రూపొంచిన ధరణి అనే పోర్టల్ లోని  డిజిటల్ రికార్డులనే  పక్కా  భూహక్కుల రికార్డుగా  ఆ పోర్టల్ సృష్టికర్త, అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ధరణి పోర్టలే భూవివాదాలకు పరిష్కారమంటూ.. అప్పటికే ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు.  దీంతో  ధరణి  పోర్టల్ ను ప్రారంభించాకే  కొత్త వివాదాలు తెరమీదికి రావడంతో ఆ వివాదాలను పరిష్కరించే యంత్రాంగం లేకుండాపోయింది. 2020 ఆర్వోఆర్ చట్టం వల్ల  సుమారు 20 లక్షల ఎకరాలకు సంబంధించి 9.20 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో పడ్డాయి.

2017లో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో కొందరు అవినీతి రెవెన్యూ ఆఫీసర్లు ఒకరి భూమిని మరొకరి పేరుపైకి మార్చడం, భూవిస్తీర్ణాన్ని, భూమి స్వభావాన్ని తప్పుగా నమోదు చేయడం, కొన్ని సర్వే నంబర్లు మిస్ చేయడం, పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితాలో కలిపేయడం, ఎప్పుడో ప్లాట్లుగా మార్చిన వ్యవసాయేతర భూములకు వ్యవసాయ భూములుగా పట్టాలు జారీ చేయడం, మూడు, నాలుగు దశాబ్దాల క్రితమే ఊర్లు వదిలేసి వెళ్లిపోయిన దొరల పేర్ల మీద భూములు నమోదు చేయడం, తల్లిదండ్రులు సంపాదించిన భూమిని వారసుల్లో ఒకరి పేరు మీదికి మార్చి మరొకరికి భూమి లేకుండా చేయడం, అమ్మేసిన భూములకు పాత పట్టాదారు పేరిట పాస్ బుక్ ఇవ్వడంలాంటి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇలా తప్పులతడక డేటాతోనే ధరణి అనే పోర్టల్ కు రూపకల్పన చేశారు. 80 శాతం మంది రైతుల భూరికార్డుల్లో ఎలాంటి తప్పిదాల్లేకపోయినా.. 20 శాతం మంది రైతులు తమ భూరికార్డులకు సంబంధించి ఏదో ఒక రకం సమస్యను ఎదుర్కోవడం గ్రామాల్లో నెలకొంది. 

ధరణిని వ్యతిరేకించి..కాంగ్రెస్కు పట్టం
20 శాతం సమస్యలను పరిష్కరించకలేకపోవడం, ఫీల్డ్ లో బాధితుల బాధను అర్థం చేసుకోకుండా ధరణిలో ఎలాంటి సమస్యల్లేవంటూ బుకాయించడమే అప్పటి సీఎం కేసీఆర్ కు శాపంగా మారింది. జరిగిన తప్పులను రెండేళ్ల ఆలస్యంగా గుర్తించిన ఆయన తన సొంత నియోజకవర్గంలోని ములుగు మండల కేంద్రాన్ని 2022లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని రెవెన్యూ సభ నిర్వహించారు. 

ఒక్క ములుగు గ్రామంలోనే 272 దరఖాస్తులు వస్తే అందులో 132 దరఖాస్తులకు ధరణి పోర్టల్ లో పరిష్కారం దొరకలేదు. అప్పుడుగానీ ధరణి తత్వం ఆయనకు బోధపడలేదు. దీంతో ఇదే పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రెవెన్యూ సభలు నిర్వహిస్తామని, ఒక్కో మండలంలో 100 టీమ్ లతో భూసమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత వదిలేశారు.  ఇదంతా మరిచి అసెంబ్లీ ఎన్నికల బహిరంగ సభల్లో ‘ధరణికి ఓటేస్తారో.. ధరణిని బంగాళాఖాతంలోనే వేస్తామని చెప్తున్న కాంగ్రెస్ కు ఓటేస్తారో తేల్చుకోండి’ అని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన పిలునందుకున్న ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచారు.   

తప్పుచేసే ఆఫీసర్లపై చర్యలొద్దా? 
భారతీయ న్యాయ సంహిత – 2023లోని సెక్షన్ 2(28) అర్థంలో ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం లేదా దానికింద రూపొందించిన నిబంధనల ప్రకారం లేదా దాని ప్రకారం పనిచేసే ప్రతి అధికారిని పబ్లిక్ సర్వెంట్‌గా పరిగణిస్తారు. పబ్లిక్ సర్వెంట్‌గా ఉన్న ఎవరైనా హక్కుల రికార్డును తారుమారు చేసినా లేదా మోసపూరితమైన ఆర్డర్‌ను పాస్ చేసినా, తొలగింపు పెనాల్టీకి బాధ్యత వహిస్తారు. 

ఆర్వోఆర్ యాక్ట్ –2020లోని సెక్షన్ 14 ప్రకారం ఎవరైనా రెవెన్యూ ఆఫీసర్  భూరికార్డులను ట్యాంపరింగ్ చేస్తే వారిని ఉద్యోగం నుంచి తొలంగించే అధికారం ఉన్నతాధికారులకు ఉండేది. కానీ, ఈ సెక్షన్ ను ఆర్వోఆర్  ముసాయిదా చట్టం –2024లో తొలగించారు. అంటే రెవెన్యూ ఆఫీసర్లు ఏ తప్పు చేసినా వారిపై ఎలాంటి చర్యలు ఉండవు.  ఈ సెక్షన్ ను తొలగించడం వల్ల అవినీతికి పెద్దన్నగా పేరున్న రెవెన్యూ శాఖలో అవినీతిని మరింత ప్రోత్సహించినట్లవుతుంది. వారికి అడ్డూ అదుపు ఉండదు. అవినీతి రెవెన్యూ అధికారులకు అడ్డుకట్ట వేసేలా ఈ సెక్షన్ ను చేర్చాలి. 

టైటిల్ గ్యారంటీతోనే అంతిమ పరిష్కారం.. 
టైటిల్ గ్యారంటీ తీసుకురావాలని, సమగ్ర భూసర్వే చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో రెవెన్యూ శాఖపై జరిగిన చర్చ సందర్భంగా ఉచిత సలహా ఇచ్చారు. ఈ సలహా ఇచ్చేదేదో 2017లోనే అప్పటి సీఎం కేసీఆర్ కు ఇచ్చి ఉంటే పరిస్థితికి ఇక్కడివరకు వచ్చేది కాదు. టైటిల్ గ్యారంటీ అంటే భూహక్కుల రికార్డుకు ప్రభుత్వమే బాధ్యత వహించడం. 

ఇప్పటివరకు భూరికార్డుల నిర్వహణలో,  రిజిస్ట్రేషన్లలో అధికారులు చేస్తున్న తప్పులకు ప్రజలు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే పాస్ బుక్(గ్యారంటీ టైటిల్) వల్ల అది పొందిన వ్యక్తులకు నష్టం జరిగితే ప్రభుత్వమే బాధితులకు స్పెషల్ ఫండ్ ద్వారా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే  టైటిల్ గ్యారంటీ యాక్ట్ కు  రోడ్ మ్యాప్ ఖరారు కాగా.. 2011లో ల్యాండ్ టైటిలింగ్ డ్రాఫ్ట్  బిల్లుకు రూపకల్పన జరిగింది. అనేక చర్చల తర్వాత 2019లో  నీతి ఆయోగ్ మోడల్ టైటిలింగ్ యాక్ట్ – 2019 డ్రాఫ్ట్ ను రూపొందించి రాష్ట్రాలకు పంపింది. 

ప్రభుత్వానికి కత్తి మీద సామే
అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ డ్రాఫ్ట్ ను పక్కన పెట్టి 2020లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. ఈ సందర్భంలోనూ అసెంబ్లీలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ల్యాండ్ టైటిల్ గ్యారంటీ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేయగా.. అప్పటి సీఎం కేసీఆర్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తనకు తెలుసని, శ్రీధర్ బాబు చాలా తెలివిగా మాట్లాడుతున్నారంటూ సమాధానం దాట వేశారు. సమగ్ర భూసర్వేతో అక్షాంశ, రేఖాంశాలతో కూడిన ఖచ్చితమైన హద్దులు నిర్ధారించి, భూరికార్డుల విస్తీర్ణంలో చేర్పులు, మార్పులు చేస్తూ రైతుకు టైటిల్ గ్యారంటీ ఇచ్చినప్పుడే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. 

ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టంలో ఈ ప్రక్రియకు చోటు కల్పించారు. సమగ్ర భూసర్వే, ఇప్పుడున్న భూరికార్డుల్లో మార్పులు, చేర్పులు అనేది ప్రభుత్వానికి కత్తి మీద సామే. సమగ్ర భూసర్వే చేయడమంటే తేనె తుట్టెను కదిపినట్లేనని భయపడే కేసీఆర్ సర్కార్ ఆ పనికి పూనుకోలేదనే చర్చ అప్పట్లో జరిగింది. కొత్త చట్టాన్ని ఆమోదించిన సమయంలోనే  టైటిల్ గ్యారంటీకి యాక్ట్ తీసుకొచ్చేందుకు రోడ్డు మ్యాప్ ఖరారు చేసి టైం బాండ్ విధిస్తే భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 

ముసాయిదా బిల్లులో మంచీచెడులు.. 
పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామని, రైతులకు ఆమోదయోగ్యమైన కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చినట్లుగానే ఇటీవల జరిగిన అసెంబ్లీలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అభిప్రాయాలు చెప్పాలని ప్రజలను కోరారు. ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్స్ యాక్ట్ –2‌‌‌‌‌‌తో పోలిస్తే ముసాయిదా బిల్లులో  ప్రస్తుత భూసమస్యల పరిష్కారానికి పనికొచ్చే అనేక మంచి సెక్షన్లకుతోడు.. కొత్త వివాదాలకు దారితీసే, రెవెన్యూ ఆఫీసర్ల అవినీతికి అవకాశమిచ్చే సెక్షన్లు కూడా ఉన్నాయి. 

ఆర్వోఆర్ యాక్ట్ – 2020 ప్రకారం పరిష్కారం కాని సాదాబైనామా, డిజిటల్ సైన్ పెండింగ్, తప్పుడు పత్రాలతో పొందిన పట్టాల రద్దులాంటి అనేక భూసమస్యలు ఈ చట్టం ద్వారా పరిష్కారమయ్యే అవకాశముంది. వ్యవసాయేతర భూరికార్డుల నిర్వహణను కూడా ఇదే చట్టం పరిధిలోకి తీసుకురావడం బాగుంది. ఎన్నో దశాబ్దాలుగా ఎలాంటి హక్కు పత్రాల్లేకుండా వారసత్వంగా వస్తున్న గ్రామకంఠం/ఆబాదీ స్థలాలకు హక్కు పత్రాలు ఇచ్చే అవకాశం కల్పించడం లక్షలాది మందికి ఊరటనిచ్చే అంశం.  అయితే మరో భూరికార్డుల ప్రక్షాళన, మరో ధరణి వ్యవహారంలాగ ఈ కొత్త చట్టం మారొద్దంటే.. ఇందులోనూ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. 

మార్పులు, చేర్పులు..
ముసాయిదా బిల్లులోని సెక్షన్ 4(4)లో ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకముల చట్టం–2020 నిబంధనల కింద తయారుచేసి, ప్రస్తుతం నిర్వహిస్తున్న హక్కుల రికార్డును సబ్-సెక్షన్(1) కింద ఎలక్ట్రానిక్ రూపంలో తయారుచేసి, నిర్వహిస్తున్నట్లు భావించవలెను.’ అని పేర్కొన్నారు. ఇన్నాళ్లు బంగాళాఖాతంలో  వేస్తామని చెప్పిన, తప్పులతడకగా రూపొందించారని ఆరోపించిన ధరణి  పోర్టల్ నే  ఆర్వోఆర్ యాక్ట్ – 2024 కోసం యథావిధిగా కొనసాగిస్తామని, ఈ పోర్టల్ లోని డేటా సరైందేనని ఈ సెక్షన్ ద్వారా ప్రకటించినట్లుగా ఉంది. ధరణి పోర్టల్ తో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. 

సెక్షన్ 4(6) ప్రకారం ఎవరైనా తానే ఒక  కబ్జా భూమిలో ఉన్నానని, తనకు ఆ భూమిపై హక్కులు కల్పించమని రికార్డింగ్ అథారిటీ(తహశీల్దార్/ఆర్డీఓ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు తహసీల్దార్ అతడికి ఆ భూమికి పాస్ బుక్కులు ఇవ్వవచ్చు. ఇది ప్రమాదకరమైన సెక్షన్ దీనిని దుర్వినియోగం చేసి ఒకరి భూములు ఇంకొకరి పేరుపై ఎక్కించవచ్చు. ఈ సెక్షన్ ను పార్ట్ బీ భూముల కోసం పెట్టినట్టు చెబుతున్నారు. కానీ సెక్షన్ 4(5) కింద కూడా పార్ట్ బీ  భూములకు హక్కులు కల్పించే అవకాశముంది. దరఖాస్తుదారులకు వారి స్వాధీనం/మోకా ఆధారంగా మాత్రమే ఓనర్ షిప్ రైట్స్ ఇవ్వడానికి తహశీల్దార్ /ఆర్డీఓలకు అధికారాలిస్తే అధికార దుర్వినియోగం జరిగే ప్రమాదముంది. రికార్డింగ్ అథారిటీ ఇష్టాలు, అభిరుచుల ప్రకారం హక్కుల రికార్డు మోసపూరితంగా మార్చే అవకాశముంది. 

పట్టాదారు పాస్ బుక్ కం టైటిల్ డీడ్ గురించి ప్రస్తావించిన సెక్షన్ 10(8)లో ‘రిజిస్ట్రేషన్ చట్టం, 1908 కింద నియమించిన రిజిస్టరింగ్ అథారిటీ, ఎలక్ట్రానిక్‌గా నిర్వహించే హక్కుల రికార్డులో ఉన్న ఎంట్రీల ప్రాతిపదికగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సందర్భంలో టైటిల్ డీడ్ కమ్ పాస్ బుక్‌ను సమర్పించాలని బలవంతం చేయొద్దు. రిజిస్ట్రేషన్ చేయు అధికారిచే పట్టాదారు పాస్ పుస్తక సహిత హక్కుపత్రంలో అమ్మకము, బహుమతి, కొనుగోలు, తనఖా, కౌలు లేక మార్పిడి  లావాదేవీల నమోదును చేయనవసరం లేదు.’ అని పేర్కొన్నారు. అసలు పట్టాదారు పాస్ బుక్ చూపకుండా రిజిస్ట్రేషన్ చేస్తే  మోసాలకు దారితీయవచ్చు. బ్యాంకులు/ఆర్థిక సంస్థల వ్యక్తుల వద్ద ఒరిజినల్ పాస్ బుక్స్ డిపాజిట్ చేసి ప్రజలు లోన్లు తీసుకుంటారు. ఈ విషయాన్ని దాచి రిజిస్ట్రేషన్ చేస్తే ఇటు కొనుగోలు చేసిన వ్యక్తులకు, అటు లోన్లు ఇచ్చిన బ్యాంకులకు ఇబ్బందులు తప్పవు.

సెక్షన్ 6లో నమోదు చేయని లావాదేవీల క్రమబద్ధీకరణ (సాదాబైనామా) అనే అంశాన్ని చేర్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 9.20 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్లికేషన్లన్నింటిని ఒకసారి పరిష్కరించాక ఈ విభాగాన్ని తొలగించాలి. 1989 నుంచి 2020 వరకు సాదాబైనామా క్రమబద్ధీకరణకు 9 సార్లు ప్రభుత్వాలు అవకాశమిచ్చాయి. 

ముసాయిదా బిల్లులోని సెక్షన్ 14 ప్రకారం అప్పీల్ నిబంధన ద్వారా ఆర్వోఆర్ యాక్ట్ – 2020లో రద్దయిన రెవెన్యూ కోర్టులు ఇక్కడ ప్రవేశపెట్టారు. ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ అదనపు కలెక్టర్/ కలెక్టర్, సెకండ్ అప్పీలేట్ అథారిటీ సీసీఎల్ గా పేర్కొన్నారు. అయితే, రెవెన్యూ ఆఫీసర్లు తమ రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండటంతో భూవివాదాల పరిష్కారానికి చాలా ఆలస్యమవుతోందని ఆర్వోఆర్ యాక్ట్ – 1971 ప్రకారం నిరూపితమైంది. 

గత అనుభవాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ల్యాండ్/రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు. కానీ, ఆర్వోఆర్ – 2024 ముసాయిదా చట్టంలో గతంలో ఫెయిలైన రెవెన్యూ కోర్టులే మళ్లీ పెడతామనడం సమంజసంగా లేదు.  రెవెన్యూ కోర్టుల్లో  మళ్ళీ అడిషనల్ కలెక్టర్/ కలెక్టర్/ సీసీఎల్ఏనే జడ్జిగా వ్యవహరిస్తారు. దీంతో ప్రజలకు త్వరగా న్యాయం జరగదు. దీనికి ప్రత్యమ్నాయంగా మేనిఫెస్టోలో పెట్టినవిధంగా ప్రతి జిల్లాకు ఒక రెవెన్యూ/ల్యాండ్  ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి, ట్రిబ్యునల్ సభ్యులుగా ఒక రిటైర్డ్ జిల్లా జడ్జిని, ఒక రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ లేదా జిల్లా కలెక్టర్ ను నియమించాలి. సెక్షన్ 4(5), 5(2), 5(5), 6(2), 7(2), 8(2), 9(2) 10(2) కింద రికార్డింగ్ అథారిటీ తప్పుగా ఎంట్రీలు నమోదు చేస్తే ఈ ట్రిబ్యునళ్లలో అప్పీల్ చేసే అవకాశం కల్పించాలి. 

సెక్షన్ 4 ప్రకారం రికార్డింగ్ అథారిటీ (తహసీల్దార్/ఆర్డీఓ)కి  రెవెన్యూ రికార్డుల్లో ఏవైనా పొరపాట్లు పడితే సవరించే అధికారం ఇచ్చారు. కానీ, సెక్షన్ 4 కింద రికార్డింగ్ అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని సెక్షన్ 14 కింద అప్పీల్ చేసే అవకాశం ఇవ్వలేదు. కేవలం సెక్షన్ 15 కింద సీసీఎల్ఏకు రివిజన్ అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలి. ఉదాహరణకు ఒక రైతు తన ఎకరం భూమి వేరే రైతుపై పడింది. ఆ భూమి తన పేరుపై చేయమని దరఖాస్తు చేసుకున్న తర్వాత  ఒకవేళ తహసీల్దార్ రిజెక్ట్ చేస్తే అప్పుడు ఆ రైతు తహసీల్దార్ నిర్ణయాన్ని కలెక్టర్ కు అప్పీల్ చేసే అవకాశం లేదు.  కేవలం నేరుగా  సీసీఎల్ఏకు  రివిజన్  అప్లికేషన్  మాత్రమే పెట్టుకోవాలి. ఇది రైతులకు చాలా ఇబ్బంది గురి చేస్తుంది. మొత్తం ఆర్ఓఆర్ చట్టానికి గుండెకాయలాంటి సెక్షన్ 4ను అప్పీల్ పరిధిలోకి తీసుకురావాలి. 

నుగ్గునూతుల యాకయ్య, సీనియర్ జర్నలిస్టు 


గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి, హైకోర్టు అడ్వకేట్