ఇకపై అన్ని మండలాలకు ఎంఈవోలు..సర్కార్ ఉత్తర్వులు

ఇకపై అన్ని మండలాలకు ఎంఈవోలు..సర్కార్ ఉత్తర్వులు
  • మండలానికో ఎంఈవో.. సర్కారు ఉత్తర్వులు
  • 609 మండలాలకు ఇన్​చార్జీలుగా సీనియర్ ​హెచ్ఎంలు
  • ఒక్కరికే ఒక్కో మండలం బాధ్యతలు ఇవ్వడం ఇదే తొలిసారి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో మరో కీలక నిర్ణయం తీసుకున్నది. స్కూళ్లపై మరింత పర్యవేక్షణ పెంచేందుకు గానూ ప్రతి మండలానికి ఒక మండల విద్యాశాఖ అధికారి  (ఎంఈవో) ఉండేలా చర్యలు తీసుకున్నది. మండలాల్లోని సీనియర్ హెడ్మాస్టర్లకు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో 632 మండలాలు ఉండగా, వాటిలో 16 మండలాల్లోనే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. 

ఇటీవల ప్రభుత్వం టీచర్లకు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ నిర్ణయించింది. దీంతో ఇన్​చార్జి ఎంఈవోలుగా ఉన్న చాలామంది హెడ్మాస్టర్లు.. ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లపై మరింత పర్యవేక్షణ పెంచేందుకు మండలానికి ఒకరినే ఇన్​చార్జి ఎంఈవోగా నియమించాలని నిర్ణయం తీసుకున్నది. దీనికి తగ్గట్టుగానే 609 మండలాలకు ఇన్​చార్జీలతోపాటు 16 మండలాలకు రెగ్యులర్ ఎంఈవోలకు బాధ్యతలు అప్పగించింది. 

ఇప్పటివరకూ ఒక్కో ఇన్​చార్జి ఎంఈవోకు 4 నుంచి 10 మండలాల బాధ్యతలు ఇచ్చేవారు. దీంతో ఆయా మండలాల్లోని స్కూళ్లపై పర్యవేక్షణ కొరవడింది. రెగ్యులర్ ఎంఈవోలకు 19 ఏండ్ల తర్వాత బదిలీలు చేపట్టారు. కాగా, మరో ఏడు కొత్త మండలాలు ఐఎఫ్ఎంఐఎస్​ వెబ్ సైట్​లో అప్​డేట్ కాలేదు. దీంతో ఆయా మండలాల నియామకం పెండింగ్ లో పెట్టారు. కాగా, సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజభాను చంద్రప్రకాశ్, రాజగంగారెడ్డి, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్​, మారెడ్డి అంజిరెడ్డి స్వాగతించారు. 

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఇదిలా ఉండగా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని లోకల్ కేడర్ గవర్నమెంట్ టీచర్స్ అసిసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాచారి అన్నారు.