- రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణరెడ్డి, నల్గొండకు త్రిపాఠి, యాదాద్రికి హనుమంతరావు
- మున్సిపల్ శాఖ కమిషనర్‌గా శ్రీదేవి, ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా హరీశ్
- సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా మందా మకరందు నియామకం
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వం 11 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. మరో ముగ్గురు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, ఒకరు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారితో పాటు ఇద్దరు రాష్ట్ర స్థాయి అధికారులను ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణరెడ్డి, నల్గొండ కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా హనుమంతరావును నియమించారు. మున్సిపల్ శాఖ కమిషనర్‌గా టీకే శ్రీదేవికి, సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా మందా మకరందుకు బాధ్యతలు అప్పగించారు.
ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా ఎస్.హరీశ్‌ను నియమించడంతో పాటు విపత్తు నిర్వహణ శాఖ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్‌గా జెడ్ కే హనుమంతును నియమించడంతో పాటు దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రంగారెడ్డి కలెక్టర్‌గా ఉన్న కె.శశాంకను స్టేట్ఫ్లాగ్షిప్ ప్రాజెక్టులకు కమిషనర్‌గా నియమించారు.ఆర్అండ్ఆర్, భూసేకరణ కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డి, డెయిరీ కార్పొరేషన్ ఎండీగా కె.చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఎస్.దిలీప్ కుమార్ నియమితులయ్యారు.
వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా నిఖిల్ చక్రవర్తికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. క్రీడా శాఖ డైరెక్టర్‌గా సోని బాలాదేవీ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీగా కొర్రా లక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా ఎన్.క్షితిజ, జీహెచ్‌ఎంసీ అర్బన్ ఫారెస్ట్రీ అదనపు కమిషనర్‌గా సుభద్రాదేవీ, వికారాబాద్ డీఎఫ్‌గా జి.జ్ఞానేశ్వర్ ను నియమించారు.
15 మంది అడిషనల్ కలెక్టర్లు,47 మంది డిప్యూటీ కలెక్టర్లు ట్రాన్స్ ఫర్
పలువురు అడిషనల్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డీఆర్వోలను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అడిషనల్ కలెక్టర్లు, 47 మంది డిప్యూటీ కలెక్టర్లు, 23 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, నలుగురు డీఆర్వోలను ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో హైదరాబాద్, యదాద్రి భువనగిరి, జగిత్యాల, మెదక్, వనపర్తి, సూర్యాపేట, ఖమ్మం, సిద్దిపేట, నారాయణపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, ఆసిఫాబాద్‌జిల్లా అడిషనల్ కలెక్టర్లు (రెవెన్యూ) ఉన్నారు.
వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల డీఆర్వోలను ట్రాన్స్ ఫర్ చేశారు. పదోన్నతులు, బదిలీల కోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ సంఘాలు ఇటీవల విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. అడిషనల్, డిప్యూటీ కలెక్టర్లతో పాటు భూసేకరణ అధికారులు, సివిల్ సప్లయ్స్ శాఖల్లో పని చేస్తున్నోళ్లను కూడా బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న 10 మంది ఆర్డీవోలకు పోస్టింగ్స్ ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్లు ఎల్.రమేశ్, ఎన్.ఆనంద్ కుమార్, హన్మనాయక్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వాళ్లను రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.