భాషా పండితులకు పదోన్నతులతో గౌరవం

భాషా పండితులకు పదోన్నతులతో గౌరవం

దశాబ్దాల నుంచి ఎక్కువ  విద్యార్హతలు  కలిగి ఉండి సెకండరీ  గ్రేడ్  క్యాడర్​గా  గుర్తించిన భాషా పండితులు ఎన్నో ఏండ్లుగా వెట్టి చాకిరి చేస్తున్నారు.  శ్రమ దోపిడీకి గురవుతూనే ఉన్నారు. భాషా పండితులుగా నియామకమైనవారు పదోన్నతులు లేక భాషా పండితులుగానే పదవీ విరమణ పొందుతున్నారు.  విద్యా హక్కు  చట్టం ప్రకారం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే బోధన చేయాలి. కానీ, అందుకు విరుద్ధంగా తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులతో  ఉన్నత తరగతులకు  బోధన చేయిస్తున్నారు. ఇది అన్యాయం అంటూ భాషా పండిత సంఘాలు ఎన్నో రకాలుగా నిరసన తెలియజేశాయి.

గత ప్రభుత్వం చేయలే

గత ప్రభుత్వం  హైదరాబాద్​లో  జరిగిన  ప్రపంచ  తెలుగు  మహాసభల సందర్భంగా  భాషా పండితులకు  న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా ఆచరణ సాధ్యం కాలేదు.  ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికారంలోకి  వచ్చిన  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  భాషా పండితులకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని పదివేలకు పైగా భాషా పండితులు, పీఈటీలను ఈ విద్యా సంవత్సరంలోనే  స్కూల్  అసిస్టెంట్లుగా ఉన్నతీకరించాలని, అందుకు అడ్డంకిగా ఉన్న సమస్యలను వెంటనే తొలగించాలని సూచించడం, వెంటనే భాషా పండితులకు సంబంధించిన షెడ్యూలు ఇవ్వాలని అధికారులను ఆదేశించడం  భాషా పండితులకు  ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.  రాష్ట్రంలో  ప్రజాపాలన జరుపుతున్న రేవంత్​ సర్కారు ఎన్నో సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్న 
ఈ సమస్యను పరిష్కరించి న్యాయం చేసినందుకు భాషా పండితులు, పీఈటీలు  ప్రభుత్వానికి  ఎంతైనా  రుణపడి ఉంటారు.  ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నిర్ణయం.. భాషా పండిత కుటుంబాల్లో ఎంతో సంతోషాన్ని కలిగించిందనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా ప్రతి భాషా పండితుడు కాంగ్రెస్​ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

- చంద్రకాంత్ గౌడ్,
సిద్దిపేట