- 92 వేల మందికి ఆన్లైన్ ద్వారా నేరుగా ఖాతాల్లోకి జీతాలు
- పీఆర్ సిబ్బంది, చిరుద్యోగుల హర్షం
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ శాఖలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది, చిరుద్యోగులకు ప్రతి నెలా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోనే జీతాలు జమ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఆన్ లైన్ లో వేతనాలు జమ చేసేందుకు ప్రత్యేకంగా ‘స్పర్ష్’ పేరుతో ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను కూడా పంచాయతీ రాజ్, ఆర్థిక శాఖలు రూపొందించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 92 వేల మంది పీఆర్, ఆర్డీ సిబ్బంది, చిరుద్యోగుల కష్టాలు తొలగనున్నాయి.
గతంలో వీరికి పంచాయతీల నుంచి వేతనాలు చెల్లించడం వల్ల జాప్యం జరిగేది. అంతేకాకుండా, రెండు, మూడు నెలలకోసారి వీరికి జీతాలు చెల్లించేవారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. వీరి ఇబ్బందులపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇకపై ప్రతినెలా మొదటి వారంలో నేరుగా అకౌంట్లో జీతాలు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని సూచించారు. దీంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది, చిరుద్యోగుల వివరాలను అధికారులు సేకరించారు.
ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 92 వేల మంది సిబ్బంది, చిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది. 54 వేల మంది మల్టీపర్పస్ వర్కర్లు,18 వేల మంది వీఓఏలు,12 వేల మంది ఉపాధి హామీ ఎఫ్టీఏలు, మిగిలిన 8 వేల మంది ఇతర విభాగాల సిబ్బందికి నేరుగా జీతాలు ఖాతాల్లో పడనున్నాయి. ప్రతినెలా వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం దాదాపు రూ.117 కోట్లు చెల్లించనున్నది. ఇకపై జీతాలు నేరుగా ఖాతాల్లో పడనుండటంతో పంచాయతీరాజ్ లోని ఆయా విభాగాల ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాకూ నేరుగా ఇవ్వాలి: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
పీఆర్, ఆర్డీ శాఖల్లో వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పని చేస్తున్నారు. వీరికి ఏజెన్సీల ద్వారా వేతనాలు అందిస్తుండటంతో ప్రభుత్వం నుంచి వచ్చే వేతనంలో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఏజెన్సీలకే పోతున్నాయి. వచ్చే జీతంలో కొంత కట్టింగ్ పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేడుకుంటున్నారు. దీనిపై మంత్రి సీతక్క చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.