
- సెక్యూరిటీ, వయిలెన్స్ ప్రివెన్షన్ కమిటీలు
- విజిటింగ్ పాసులు లేకుంటే నో ఎంట్రీ
- సీసీ కెమెరాల ఏర్పాటు
- భద్రత పై ప్రతి మూడు నెలలకోసారి రివ్యూ
నిర్మల్, వెలుగు: జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులపై దాడులు, ఆందోళనల నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టబోతోంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది భద్రత కోసం ‘హాస్పిటల్ వయిలెన్స్ ప్రివెన్షన్ కమిటీ’లను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక గైడ్లైన్స్ జారీ చేసింది. మూడు షిఫ్టుల్లో భద్రతా చర్యలు చేపట్టి ఆస్పత్రుల్లోకి వచ్చే వారందరిపై సెక్యూరిటీ కమిటీ ప్రత్యేక నిఘా పెట్టనుంది.
విజిటర్స్ పాసులు తప్పనిసరి
జిల్లా హాస్పిటల్స్లో విజిటర్స్ పాసులను ఇకపై తప్పనిసరి చేయనున్నారు. రోగుల బంధువులు, వారి దగ్గరి వారు ఎవరైనా ఆస్పత్రుల్లోకి రావాలంటే విజిటర్స్ పాస్ ఉండాల్సిందే. డాక్టర్లు, వైద్య సిబ్బందికి కూడా ఐడెంటిటీ కార్డ్స్ తప్పనిసరి చేయనున్నారు. ఆ కార్డు ఉంటేనే వారిని విధుల్లోకి అనుమతించనున్నారు.
హాస్పిటల్లో అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సీసీ ఫుటేజీలను నిర్దిష్ట కాలపరిమితి వరకు అందుబాటులో ఉంచనున్నారు. ఆస్పత్రుల్లో ప్రధాన మార్గాలు, ముఖ్యమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. వచ్చేవారందరికీ స్క్రీనింగ్ చేయనున్నారు. వెంట తీసుకొచ్చే బ్యాగులు తనిఖీ చేసి అభ్యంతరకర వస్తువులుంటే స్వాధీనం చేసుకోనున్నారు. అన్నిచోట్ల లైటింగ్ సౌకర్యం, డాక్టర్లకు డ్యూటీ రూమ్స్, రెస్ట్ రూమ్స్, ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. స్థానిక పోలీస్స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో హాస్పిటల్ సెక్యూరిటీ కమిటీలు ఎప్పటికప్పుడు భద్రతపై సంప్రదింపులు జరపనుంది. వయిలెన్స్ ప్రివెన్షన్ కమిటీ ఆధ్వర్యంలో 24 X7 తరహా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, దీన్ని పోలీస్ స్టేషన్కు అనుసంధానించనుంది.
మహిళా డాక్టర్లు, సిబ్బందిపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట
మహిళా డాక్టర్లు, సిబ్బందిపై లైంగిక వేధింపులు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టనున్నారు. సెక్యూరిటీ, వయలెన్స్ ప్రివెన్షన్ పై డాక్టర్లు, వైద్య సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టాలు, ప్రాపర్టీ డ్యామేజీ నిరోధ చట్టాలపై హాస్పిటల్స్ లో అవగాహన కల్పించనున్నారు. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీతో సమావేశమై రివ్యూ చేయాల్సి ఉంటుంది.
కమిటీల చైర్పర్సన్లుగా సూపరింటెండెంట్లు
హాస్పిటల్స్ సెక్యూరిటీ కమిటీ చైర్ పర్సన్ గా మెడికల్ సూపరింటెండెంట్, కన్వీనర్ గా సేఫ్టీ ఆఫీసర్లు(ఆర్ఎంఓ) వ్యవహరించనున్నారు. మెంబర్లుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్, నర్సింగ్ సూపరింటెండెంట్, బయో మెడికల్ ఇంజనీర్, సెక్యూరిటీ స్టాఫ్ ప్రతినిధి, ఐఎంఏ ప్రతినిధి, సీనియర్ డాక్టర్, సీనియర్ స్టాఫ్ నర్స్, సీనియర్ సిబ్బందిలో ఒకరు కొనసాగనున్నారు. అలాగే హాస్పిటల్ వయలెన్స్ ప్రివెన్షన్ కమిటీకి కూడా మెడికల్ సూపరింటెండెంట్ చైర్ పర్సన్ గా, సీనియర్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. మెంబర్లుగా ఇంటర్నల్ కమిటీ చైర్మన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో పాటు ఐఎంఏ ప్రతినిధి, హాస్పిటల్ లోని సీనియర్ డాక్టర్, సీనియర్ స్టాఫ్ నర్స్, సీనియర్ సిబ్బంది సభ్యులుగా ఉండనున్నారు. ఇంటర్నల్ కమిటీలను కూడా నియమించుకోవాలని వైద్యారోగ్యశాఖ గైడ్ లైన్స్ లో పేర్కొంది.