- అర్హుల ఎంపికకు 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభలు
- 16న పాలమూరులో ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్ల సమావేశం
మహబూబ్‌నగర్, వెలుగు:ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్‌లు అమలు చేసేందుకు సిద్ధమైంది. 25 లోపు అర్హుల ఎంపిక, ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆఫీసర్లు బిజీ అయిపోయారు. ‘ప్రజాపాలన’కు వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా.. సంక్రాంతి పండుగ తరువాత నుంచి ఫీల్డ్ ఎంక్వైరీ కోసం ఊళ్ల బాట
పట్టనున్నారు.
స్కీమ్‌ల అమలుకు పకడ్బందీ ప్లాన్..
గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు కాకుండా.. ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, వారి బంధువులకు వర్తింపజేసింది. లబ్ధిదారుల ఎంపికను ఆఫీసర్లకు కాకుండా.. లీడర్ల చేతికి అప్పగించడంతో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్కీమ్‌లను పకడ్బందీగా అమలు చేసే బాధ్యతను ఆఫీసర్లకు అప్పజెప్పింది. ఇందుకు సంబంధించిన షెడ్యుల్‌ను ఈ నెల 10న సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశమై వివరించారు. దాని ఆధారంగా ఆఫీసర్లు అర్హుల ఎంపికను స్పీడప్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన జరనుంది.
నోడల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏవోలు, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు టీమ్స్‌గా ఏర్పడి ఈ నెల 16 నుంచి 21 వరకు గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి విచారించనున్నారు. విచారణలో తేలిన వివరాలను బట్టి అర్హుల జాబితాను రూపొందించనున్నారు. జాబితాను ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్న గ్రామ సభలు, మున్సిపల్ వార్డు సభల్లో చదివి వినిపిస్తారు. ఒక వేళ సభల్లో అభ్యంతరాలు వస్తే వాటిని స్వీకరించి, పది రోజుల్లో పరిష్కరించేలా షెడ్యూల్‌ను రూపొందిస్తారు. అలాగే జాబితా ఓకే అయితే వాటిని 21 నుంచి 25 వరకు ఆన్లైన్ ఎంట్రీ పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
ముగ్గురి లాగిన్లకు రేషన్ కార్డుల జాబితా..
రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వేలో భాగంగా రేషన్‌కార్డులు లేని కుటుంబాల జాబితాను తయారు చేసింది. ఈ జాబితా ఆధారంగా గ్రామాల్లో చేపట్టే సర్వే ప్రక్రియ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం మండలాల్లో ఎంపీడీవోలు, మున్సిపాల్టీల్లో కమిషనర్లకు అప్పగించింది. జిల్లా స్థాయిలో కలెక్టర్, సివిల్ సఫ్లయ్ ఆఫీసర్లను పర్యవేక్షకులుగా నియమించింది. ఫీల్డ్ సర్వే అనంతరం అర్హుల జాబితాను గ్రామ, వార్డు సభల్లో ప్రదర్శించాలి. ఆమోదించిన జాబితాను ఎంపీడీవో, కమిషనర్ లాగిన్‌లో నమోదు చేసి కలెక్టర్ లాగిన్‌కు పంపిస్తారు. కలెక్టర్ ఆ జాబితాను పరిశీలించి సీసీఎస్ లాగిన్‌కు పంపుతారు. ఆ లిస్ట్ ప్రకారం సీసీఎస్ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు.
‘సూపర్ చెక్’ తర్వాతే లిస్ట్..
ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా ఇప్పటికే ఆఫీసర్లు ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సర్వే పూర్తి కానుంది. అయితే సర్వే ఆధారంగా గుర్తించిన అర్హుల జాబితాను మండలాలకు సంబంధించిన ఎంపీడీవో, మున్సిపాల్టీలకు సంబంధించిన కమిషనర్లు సూపర్ చెక్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాతే గ్రామ, వార్డు సభల్లో ఈ లిస్టులు ప్రదర్శించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, ఈ నాలుగు స్కీముల ఇంప్లిమెంటేషన్‌పై ఈ నెల 16న మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించనున్నారు.