మహిళాభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ప్రాధాన్యం

మహిళాభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ప్రాధాన్యం
  •     మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి టౌన్, వెలుగు : మహిళలు వ్యాపారాలు చేసే స్థాయికి ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.  అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వ కాంట్రాక్టులను మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి టౌన్ లో రూ. 44 కోట్లతో చేపట్టిన అమృత్‌‌ జల్​పథకం ట్యాంక్‌‌ నిర్మాణానికి భూమి పూజ, షాపింగ్ కాంప్లెక్స్, ఎంపీడీవో ఆఫీస్‌‌ ఆవరణలో మోడల్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా  మహిళా శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలోని తొలి మహిళా పెట్రోల్ బంక్ కు మంత్రి భూమి పూజ చేసి మాట్లాడారు.  

మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో పథకాలు చేపట్టిందని, మహిళా క్యాంటీన్లు ,పెట్రోల్ పంపు , ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి వాటితో ప్రోత్సహిస్తుందన్నారు. మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి సూచించారు.  మహిళల ఆర్థికాభివృద్ధికి పెట్రోల్ పంపులు, మహిళా షాపింగ్ కాంప్లెక్స్ మంజూరు చేసి ఆర్థికంగా సహకరించిన అధికారులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం,  రాబోయే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీవో జ్యోతి, ఆర్డీవో రవీందర్ రెడ్డి,  ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి రామ్ ఇప్పిలి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.