- ప్రాథమికంగా అంచనావేసిన ప్రభుత్వం
- మొదటి విడతగా ఈ నెల 26న రూ.6 వేల చొప్పున సాయం
హైదరాబాద్, వెలుగు: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకానికి అర్హుల లెక్కను ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలు దాదాపు 12 లక్షల వరకు ఉన్నట్లు గుర్తించింది. వీరంతా కూడా కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లిన వాళ్లలో ఉన్నట్లు లెక్కలు తీసింది. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని, దీనికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ స్కీమ్‌గా నామకరణం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
మొదటి దశలో ఒక్కో కుటుంబానికి రూ. 6 వేల చొప్పున ఇవ్వనున్నారు. మరో ఐదారు నెలలకు ఇంకో రూ.6 వేలు జమ చేయనున్నారు. ఈ లెక్కన ఒక ఫేజ్‌కు దాదాపు రూ.700 కోట్ల మేర అవసరమవుతాయని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. సంక్రాంతి ముగిసేలోపు అర్హుల జాబితాను గ్రామసభల్లో పెట్టి ఫైనల్ చేస్తారు. గ్రామసభ ఆమోదం అనంతరం అర్హుల బ్యాంకు అకౌంట్లను సేకరించి ఆన్లైన్ చేస్తారు. ఆ బ్యాంకు ఖాతాల్లోకి ఈ నెల 26న ప్రభుత్వం రూ. 6 వేల చొప్పున జమ చేస్తుంది.
ఉపాధి హామీ, కులగణన డేటా పరిగణనలోకి..!
రాష్ట్రంలో మొత్తం 53.07 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు ఇష్యూ చేశారు. ఇందులో కోటీ 10 లక్షల మంది వర్కర్లు ఉన్నారు. మొత్తం జాబ్ కార్డుల్లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నవి 34.52 లక్షల కార్డులేనని కేంద్రం ప్రకటించింది. ఇందులో 58.57 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఎస్సీ కేటగిరీకి చెందిన కూలీలు 21.23 లక్షల మంది కాగా.. ఎస్టీ కేటగిరీకి చెందినవాళ్లు 17.7 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో భూములు లేని వాళ్లలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోనే ఉన్నారు.
దీంతో ప్రభుత్వం ‘ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద అందించే సాయం వారికి ఎంతో ఉపకరిస్తుందని అధికారులు చెప్తున్నారు. కులగణన సర్వేలోనూ ప్రభుత్వం భూమి లేని వారి వివరాలు సేకరించింది. అందులో ఉన్న డేటాను కూడా పరిగణనలోకి తీసుకొని నిరుపేద కూలీల లిస్ట్‌ను ఫైనల్ చేయనుంది. దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల కూలీల కుటుంబాలు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ స్కీమ్‌కు అర్హత సాధించే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఈ కూలీలు కూడా ఏడాదిలో కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ పనులకు హాజరైనవాళ్లే. ఒకవేళ ప్రభుత్వం పనిదినాలు ఇంకొంత తక్కువ చేసే నిబంధన పెడితే.. అర్హుల సంఖ్య పెరుగుతుంది. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పుడున్న భూమి లేని వ్యవసాయ కూలీ
కుటుంబాలకు ఏడాదికి రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్లు అవుతుందని అంచనా. రెండు విడతల్లో ఇవ్వాలని నిర్ణయించినందున మొదటి విడతలో రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లు ఇవ్వనున్నారు.
నేరుగా అకౌంట్లలో జమ
దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి ప్రభుత్వం సాయం రిలీజ్ చేయనుంది. ఒక్కసారి గ్రామ సభల్లో లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేశాక వారి అకౌంట్ వివరాలను తీసుకోనున్నారు. కుటుంబానికి ఒకరికే లబ్ధి చేరుతుంది. ఎవరి అకౌంట్‌కు సాయం జమ చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నందున.. ఫ్యామిలీలో మహిళ అకౌంట్‌కే జమ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చలు జరుగుతున్నాయి.