వచ్చే నెల 10 కల్లా ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించాలి

వచ్చే నెల 10 కల్లా ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించాలి
  • జిల్లా పీడీలకు హౌసింగ్  కార్పొరేషన్ ఎండీ ఆదేశం
  • కొత్త లబ్ధిదారుల  లిస్ట్  పంపాలి
  • మోడల్ హౌస్​లు త్వరగా పూర్తి చేయాలని సూచన

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందుకున్న లబ్ధిదారులు మార్చి 10 వరకు బేస్ మెంట్  స్థాయి దాకా వర్క్ స్టార్ట్  చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు డైరెక్టర్లను హౌసింగ్ 
కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. ఈ స్కీమ్ పై ఇటీవల అన్ని జిల్లాల పీడీలకు ఎండీ సర్క్యులర్  జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ గైడ్​లైన్స్​లో మంజూరు పత్రం అందుకు న్న 45 రోజుల్లోగా ఇండ్ల పనులు ప్రారంభించాలని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే అంశం ఉందని, దానినే ఇపుడు అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 

అప్పటి వరకు పునాదులు తీసి బేస్ మెంట్  నిర్మిస్తే ఫస్ట్ ఫేజ్ అమౌంట్ రూ.1 లక్ష ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.5 లక్షలను బేస్ మెంట్  దశలో రూ.లక్ష, గోడలు కట్టిన తరువాత రూ.1. 25 లక్షలు, స్లాబ్ పూర్తయ్యాక రూ.1.75 లక్షలు, ఇల్లు పూర్తయిన తరువాత రూ.లక్షను ప్రభుత్వం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. వచ్చే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు స్కీమ్  అమలుకు దశల వారీగా నిధులు రిలీజ్  చేయనుంది. 

తొలి దశలో నేడో, రేపో స్కీమ్  కోసం సుమారు వెయి కోట్లు రిలీజ్  చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా..  గత నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ర్ట ప్రభుత్వం 71,482  మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అయితే..  ఈ అప్లికేషన్లను కూడా రీసర్వే చేసి అనర్హులను తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అధికారులు రీసర్వే చేస్తుండగా ఇప్పటి వరకు సుమారు 500 మంది అనర్హులను తొలగించారు. అలాగే కొత్త లబ్ధిదారులను కూడా సెలెక్ట్  చేసి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాల వారీగా ఈనెల 25 వరకు వివరాలు పంపాలని సర్క్యులర్ లో ఎండీ స్పష్టం చేశారు. 

మోడల్ హౌస్​లు పూర్తి చేయాలి

రాష్ర్ట ప్రభుత్వం అన్ని మండల కేంద్రాల్లో ఎంపీడీవో ఆఫీసులో ప్రభుత్వం స్థలం ఉంటే  ఇందిరమ్మ మోడల్ హౌస్ లు నిర్మించాలని గత డిసెంబరులో  ఆదేశాలు ఇచ్చింది.  రాష్ర్టంలో  570 మండలాలు ఉండగా ఇప్పటి వరకు 330 ఇండ్ల నిర్మాణాలు స్టార్ట్  చేశారు. 17 మండలాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 15న ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రం (హౌసింగ్  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియో జకవర్గం పాలేరు) లో నిర్మాణం ప్రారంభించగా..  28 రోజుల్లోనే రూ.5 లక్షల వ్యయంతో ఇళ్లను పూర్తి చేశారు.

 గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రాలకు వచ్చినపుడు పబ్లిక్ కు ఈ ఇళ్లపై అవగాహన ఏర్పడుతుందని మోడల్ హౌస్ లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇవి పూర్తయ్యాక హౌసింగ్  డిపార్ట్ మెంట్  అధికారుల అవసరాలకు ఉపయోగించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

రేపు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయనున్న సీఎం

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​లో భాగంగా గత నెలలో ప్రభుత్వం మంజూరు చేసిన లబ్ధిదారుల ఇండ్ల పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం నారాయణ పేట జిల్లా అప్పక్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి ఇంటికి సీఎం రేవంత్  రెడ్డి ముగ్గు పోస్తారని అధికారులు వెల్లడించారు. 

ఇండ్లు సాంక్షన్ అయిన 45 రోజు ల్లోగా పనులు ప్రారంభించాలని గైడ్​లైన్స్​లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ గడువు వచ్చే నెల 10తో ముగియనున్నందున రాష్ట్రవ్యాప్తంగా పనులు స్టార్ట్ చేసేందుకు లబ్ధిదారులు ప్లేస్ చదు ను చేసి, ముగ్గు పోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అర్హుల జాబితాలో పలు సవరణలు

ఇందిరమ్మ ఇళ్ల కోసం కొత్తగా గత నెలలో 4 రోజుల పాటు గ్రామసభలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఇళ్లకు సుమారు లక్ష అప్లికేషన్లు వచ్చాయి. అయితే  కొత్తగా లబ్ధిదారులను గుర్తించే అంశంపై ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఇందులో నెల వేతనం రూ.15,000 కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులు కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు అర్హులని.. అంగన్ వాడీ కార్యకర్తలు, ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఈ జాబితాలో ఉంటారని సర్క్యులర్ లో పేర్కొంది.

మండలాలు, మున్సిపాలిటీలలో ఇటుక తయారీ యూనిట్స్, సెంట్రింగ్  యూనిట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పీడీలను ఎండీ  ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్  ఇండ్ల కాలనీ ఇళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, ప్రారంభించిన పనులు ఏమైనా ఉంటే గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు వాటి పనులను చేపట్టి పూర్తి చేయాలని సర్క్యులర్ లో  ఎండీ పేర్కొన్నారు.