- సాగు భూములు గుర్తించేందుకు
- సర్వేకు ప్రత్యేక బృందాల ఏర్పాటు
- 16 నుంచి 20 వరకు గ్రామాల్లో సర్వే
- 21 నుంచి 25 వరకు గ్రామ సభల నిర్వహణ
సిద్దిపేట, వెలుగు: రైతు భరోసా కోసం అధికారులు క్షేత్రస్థాయిలో సన్నాహక చర్యలు ప్రారంభించారు. ఈ నెల 26న సాగుకు అనుకూల భూములకు మాత్రమే పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిపై అధికారులు సర్వేకు సిద్ధమయ్యారు. గురువారం నుంచి ఈనెల 20 వరకు సర్వే జరుగనుంది. సర్వే అనంతరం సాగుకుయోగ్యం కాని భూముల లిస్ట్‌ను గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే చేస్తారు. 21 నుంచి 25 వరకు గ్రామ సభలు నిర్వహించి ఆమోదం తీసుకుంటారు. జనవరి 26న రైతు భరోసా డబ్బులను అర్హులైన రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.
సర్వే కు ప్రత్యేక బృందాలు
గతంలో రైతు బంధు పై విమర్శలు వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారికి సైతం రైతుబంధు డబ్బులు పడ్డాయి. దీంతో భరోసాపై కాంగ్రెస్ నిర్థిష్ట ప్రణాళికతో ముందుకు వెలుతోంది. మండలానికి నాలుగు నుంచి ఐదు ప్రత్యేక బృందాలు గ్రామాల్లో సర్వే చేసి, అర్హుల జాబితా తయారు చేస్తాయి. వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్, అటవి శాఖ అధికారులు సర్వేలో పాల్గొంటారు. భూ భారతి(ధరణి) పోర్టల్ సర్వే నెంబర్ల ఆధారంగా భూములను గుర్తించనున్నారు.
సిద్దిపేట జిల్లాలో 9.12 లక్షల ఎకరాల భూమి ఉండగా.. 7.19 లక్షల ఎ కరాలు సాగుకు యోగ్యమైనవి ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఆరు లక్షల పై చిలుకు ఎకరాల్లోని 3.24 లక్షల మంది రైతులకు ఒక్కొ సీజన్ లో దాదాపు 312 కోట్లు పెట్టుబడి సహాయంగా అందించారు.
జిల్లాలో రెండు సీజన్ల లో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు జరుగుతుండగా వానా కాలం సీజన్ లో మాత్రం అత్యధికంగా 5.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్ లో 3.50 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనాలు రూపొందించారు..
Also Read : నిజామాబాద్–జగ్ధాల్పూర్ నేషనల్ హైవేకు అటవీ అడ్డంకులు
మంత్రి సమీక్ష
రైతు భరోసా పై సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ రివ్యూ నిర్వహించారు. భూ భారతి పోర్టల్ లో నమోదైన పట్టాదారులకు మాత్రమే రైతు భరోసా పథకం ఆర్థిక సహాయాన్ని అందుకునేందుకు అర్హులని చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందేలా విధివిధానాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా, మండల స్థాయిలో ఈ పథకం అమలుకు నోడల్ ఆఫీసర్ల సేవల వినియోగించుకోవాలని భూములకు సంబంధించిన వివరాలను రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వుంటుందని, ఈ దిశగా ఆలోచన చేయాలని మంత్రి సురేఖ సూచించారు.
గ్రామ సభల్లో వివరాల వెల్లడి
రైతు భరోసా పెట్టుబడి సహాయం అందించే రైతులు, భూముల వివరాలను గ్రామసభల్లో అధికారులు వెల్లడించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్వే చేస్తున్నాం..
జిల్లాలో సాగుకు యోగ్యం కాని భూముల వివరాల కోసం గురువారం నుంచి 20 వరకు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించనున్నాం. ఆయా మండలాల్లో భూ విస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఐదు సర్వే బృందాలను ఏర్పాటు చేశాం. ఆయా గ్రామాల్లోని పట్టాదారుల పాస్ పుస్తకాలను పరిశీలించి సాగు భూములను గుర్తిస్తాం. సర్వే అనంతరం నిర్దేశిత తేదీల్లో గ్రామ సభలను నిర్వహిస్తాం. - రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి