- గ్రామాల వారీగా ఫీల్డ్ వెరిఫికేషన్
- రంగంలోకి ప్రత్యేక బృందాలు
- 4 రోజుల పాటు ఫీల్డ్ ఎంక్వైరీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు పనికిరాని భూములపై సర్వే షురూ అయింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి లెక్కలు తీస్తున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ఇచ్చిన డేటాతో గ్రామాల్లో ఫీల్డ్వెరిఫికేషన్ బృందాలు సర్వే చేస్తున్నాయి. అగ్రికల్చర్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ.. సాగుకు పనికిరాని భూముల గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు. పంచాయతీ సెక్రటరీ, ఏవోలు, ఆర్ఐలు ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్‌లతో సర్వే చేపట్టారు. ఈ ఫీల్డ్ సర్వే గురువారం షురూ కాగా.. ఈ నెల 19 వరకు కొనసాగుతుంది.
ఈ టీమ్‌లు విలేజ్‌లో ఎక్కడెక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో గుర్తిస్తాయి. ప్రతి గ్రామంలో ఏఈవో, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు బృందంగా ఈ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే వివరాలున్న రెవెన్యూ డేటా ఆధారంగా గ్రామాల్లో భూముల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
గ్రామ సభల్లో భూముల జాబితా పదర్శన..
సర్వే నంబర్ల వారీగా సాగుకు పనికిరాని భూముల వివరాలతో ప్రత్యేక జాబితా రూపొందించి.. ఆ లిస్ట్‌ను గ్రామ సభల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ లిస్ట్‌లో ఉన్న భూముల వివరాలను చదివి వినిపించి, చర్చిస్తారు. అనంతరం ఈ లిస్ట్‌ను ఆమోదంలోకి తీసుకుంటారు. అభ్యంతరాలుంటే వాటిని పరిశీలిస్తారు. ఆ భూములను పోర్టల్లో సంబంధిత అధికారి నమోదు చేస్తారు. 25న ఈ జాబితాలను జిల్లాల వారీగా ప్రభుత్వానికి పంపిస్తారు. వాటి ఆధారంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించి.. మిగిలిన భూముల జాబితా ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సాయం ఈ నెల 26న విడుదల చేస్తుంది.
ఒక్కో గ్రామంలో 50 ఎకరాలకు పైనే..
గ్రామాల వారీగా సాగుకు పనికిరాని రాళ్లు, రప్పలతో గుట్టలు, గ్రానైడ్ క్వారీల్లో, రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఉన్న భూముల లెక్కలు తీస్తున్నారు. ఇలా యావరేజీగా గ్రామానికి 50 ఎకరాలకు పైనే ఇలాంటి భూములు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో ఈ భూములు ఎక్కువగా నమోదవుతున్నాయని ఫీల్డ్‌కు వెళ్లిన అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు, గుట్టలు, గ్రానైట్క్వారీలున్న ప్రాంతాల్లో వంద ఎకరాలకు పైగా ఇలాంటి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బయట పడుతున్నాయని పేర్కొంటున్నారు.