![వచ్చే బడ్జెట్లో బీసీ సబ్ ప్లాన్!](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-government-intends-to-implement-the-bc-sub-plan-from-the-next-financial-year-2025-26_RMH3wubXzQ.jpg)
- ఎస్సీ, ఎస్టీల మాదిరి బీసీలకూ స్పెషల్ ఫండ్స్
- వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లులు
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-–26) నుంచి బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎస్సీ, ఎస్టీల మాదిరే బీసీలకూ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కేటాయించాలని యోచిస్తున్నది. వచ్చే నెలలోనే బడ్జెట్‌సమావేశాలు ఉన్నందున.. కేటాయింపులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు అందినట్టు తెలిసింది. ప్రభుత్వం కులగణన సర్వే వివరాలను ఇటీవల వెల్లడించింది. రాష్ట్రంలో ఏయే కులాల వారు ఎంత మంది ఉన్నారు? వారి స్థితిగతులు ఏంటి? అనే వివరాలన్నీ ఈ సర్వేలో తేలాయి. దీంతో అందుకు అనుగుణంగా బీసీ సబ్‌ప్లాన్ తీసుకు రావాలని సర్కార్ యోచిస్తున్నది. కాగా, మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సబ్‌ప్లాన్ తెస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించింది. బీసీల అభివృద్ధికి ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించింది. ప్రతి జిల్లాకు బీసీ భవన్, అర్హులైన బీసీలకు రుణాలు తదితర హామీలు ఇచ్చింది. దీంతో ఏయే అంశాల్లో బీసీలకు ప్రభుత్వం ఆర్థికంగా సహకరించే అవకాశం ఉంటుంది? ఇప్పటి వరకు అమలు చేస్తున్న సబ్సీడీ పథకాలేమిటి? ఇప్పుడు చేతివృత్తులు, కులవృత్తులు ఏ దశలో ఉన్నాయి? బీసీలకు ఎలాంటి సాయమందిస్తే మేలు జరుగుతుంది? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బీసీల కోసం ప్రత్యేక పథకాలనూ కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
డ్రాఫ్ట్ బిల్లులు రెడీ...
కులగణనకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే పెట్టాలని యోచిస్తున్నది. దీంతో డ్రాఫ్ట్ బిల్లు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కులగణనకు చట్టబద్ధత కల్పిస్తే.. ఇకపై ఆ సర్వే రిపోర్టు అధికారిక డాక్యుమెంట్కానుంది. రిజర్వేషన్ల విషయంలోనూ కోర్టుల్లో కొట్లాడేందుకు అవకాశం ఉంటుంది. కులగణనకు చట్టబద్ధత తెచ్చి, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే రాహుల్ గాంధీ డిమాండ్‌కు మరింత బలం చేకూర్చి.. కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. అదే విధంగా ఎస్సీ వర్గీకరణపై జస్టిస్షమీమ్అక్తర్ఇచ్చిన రిపోర్టుకు కూడా చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసింది. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి, రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేసింది. దీనిపై త్వరలోనే జీవోలు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా అసెంబ్లీలో చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ డ్రాఫ్ట్ బిల్లు కూడా అధికారులు రెడీ చేస్తున్నారు.