- అర్హుల లెక్క తేల్చే పనిలో ఆఫీసర్లు
జనగామ/ మహబూబాబాద్, వెలుగు: రైతు రుణమాఫీ కోసం రాష్ర్ట ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. పంద్రాగస్టు వరకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలనే ప్రభుత్వ సంకల్పంతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. ఈమేరకు అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీ ఏకకాలంలో అమలు కానుండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది.
జిల్లాలో 1,82,552 మంది రైతులు..
జనగామ జిల్లాలో 1,82,552 మంది రైతులున్నారు. వీరిలో ఎంతమంది రైతులు ఎంతమేర రుణాలు తీసుకున్నారనే స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే నెల నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలై పంద్రాగస్టుకు పూర్తి కానున్న నేపథ్యంలో ఆఫీసర్లు అందుకు అవసరమైన కార్యాచరణ చేస్తున్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు వరకు రుణాలు తీసుకున్న రైతులను పరిగణనలోకి తీసుకోనున్నారు. కాగా, జిల్లాలో రెండున్నర ఎకరాల లోపు భూములున్న వారు 1,23,316 మంది ఉన్నారు. ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు బ్యాంకులు రుణాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ రెండున్నర ఎకరాల్లోపున్న రైతులు దాదాపుగా అర్హుల కిందికి రానున్నారు. 5 ఎకరాలలోపు రైతులు 45,706 ఉన్నారు. 10 ఎకరాల వరకు ఉన్న వారు 11,322 మంది ఉండగా, ఆపై బడిన రైతులు 2,208 మంది ఉన్నారు. వీరిలో ఎంత మంది అర్హులనేది తేల్చేందుకు యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. రూ.50 వేలు, లక్ష, లక్షన్నర, రూ.2 లక్షల వరకు కేటగిరీల వారీగా రుణాలు పొందిన వారి జాబితాను రూపొందించి పంద్రాగస్టు వరకు అందరి రుణాలను మాఫీ చేయనున్నారు. సర్కారు నుంచి గైడ్ లైన్స్ వస్తే అర్హుల సంఖ్య పై స్పష్టత వచ్చే అవకాశమున్నది.
గత ప్రభుత్వం 33 వేల మందికే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం జనగామ జిల్లాలో అత్తెసరు మంది రైతులకే పంట రుణాలను మాఫీ చేసింది. 2018 ఎన్నికలకు ముందు లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన అప్పటి కేసీఆర్ సర్కారు రైతులను దగా చేసింది. అప్పట్లో 2018 డిసెంబర్ 11 వరకు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల్లో 93,861 మంది రైతులు లక్ష లోపు తీసుకున్న అర్హులైన వారుగా గుర్తించి, నివేదించారు. కాగా, వీరిలో 2020 నుంచి విడతల వారీగా, కేటగిరీలుగా రైతులను విభజించి మాఫీ ప్రక్రియను చేపట్టినా సగం కూడా పూర్తి చేయలేదు. కేవలం 33,048 మంది రైతులకు మాఫీ కింద రూ.183.42 కోట్లను మాత్రమే చెల్లించింది. మిగిలిన రైతులకు పంగనామాలు పెట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుత రేవంత్‌రెడ్డి సర్కారు రూ.2 లక్షల లోపు రుణాలను ఏకకాలంలో మాఫీ చేసేందుకు పూనుకోవడంపై రైతు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రుణమాఫీ ప్రకటనలతో రైతులు, కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకాలు చేశారు.
మహబూబాబాద్జిల్లాలో 1.40 లక్షల మందికి ప్రయోజనం రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయనుండడంతో ఆఫీసర్లు అర్హుల జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా లక్షా 40 వేలమంది రైతులకు రుణ మాఫీతో సుమారుగా రూ.1,650 కోట్ల ప్రయోజనం చేకూరే అవకాశమున్నది.
రుణ మాఫీతో రైతులకు మేలు..
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణ మాఫీ చేయడం మర్చిపోలేనిది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగగా మార్చేందుకు కృషి చేస్తోంది.
- కందాడి అశోక్ రెడ్డి, కాంగ్రెస్ కిసాన్‌సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు, తొర్రూరు