స్వయం సహాయక సంఘాల బలోపేతానికి మహిళా శక్తి

  •     వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం
  •     మహిళా సంఘాల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ప్రోగ్రామ్స్‌‌‌‌
  •     ప్రతి నియోజకవర్గానికి మినీ ఇండ్రస్టీయల్‌‌‌‌ పార్క్‌‌‌‌, మండలానికి శాశ్వత కుట్టు మిషన్‌‌‌‌ కేంద్రాలు
  •     ఈవెంట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌పైనా ఫోకస్‌‌‌‌ చేసేందుకు ప్లాన్‌‌‌‌

నల్గొండ, వెలుగు : మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ‘మహిళా శక్తి’ పేరుతో పలు రకాల కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 4.32 లక్షల సంఘాల కోసం ప్రత్యేక యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ తయారుచేశారు. శాశ్వత ప్రాతిపదికన మహిళా సంఘాలకు నిరంతరం ఆదాయం సమకూరేలా పథకాలను రూపొందించారు. మహిళా సంఘాల ద్వారా ఇప్పటికే కుట్టు మిషన్‌‌‌‌ కేంద్రాలు నడుస్తున్నాయి. 

ఈ ఏడాది సర్కార్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేయగానే యూనిఫామ్స్‌‌‌‌ పంపిణీ చేయడం మహిళా సంఘాల ద్వారానే సాధ్యమైంది. దీంతో రెండో విడత యూనిఫాం కుట్టే బాధ్యతలు సైతం మహిళా సంఘాలకే అప్పగించారు. దీని కోసం శాశ్వత కుట్టు మిషన్‌‌‌‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు డెయిరీ యూనిట్లు, ఎంటర్‌‌‌‌ ప్రైజెస్‌‌‌‌ నెలకొల్పేందుకు ప్రత్యేకంగా టార్గెట్లు పెట్టారు. ఈ ఏడాది 14 వేల ఎంటర్‌‌‌‌ ప్రైజెస్‌‌‌‌ ఏర్పాటు చేయాలని టార్గెట్‌‌‌‌ పెట్టారు. ఇందులో కిరాణ షాపులు, కరెంట్‌‌‌‌, కూలర్లు, బేకరీలు, బ్యూటీ పార్లర్లు, డెయిరీ యూనిట్లు ఉన్నాయి. 

స్కిల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్లు

ప్రభుత్వం టైఅప్‌‌‌‌ చేసుకున్న వివిధ ప్రైవేట్‌‌‌‌ సంస్థల ద్వారా స్కిల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల నుంచి లోన్లు సైతం ఇప్పిస్తారు. ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండ్రస్టీయల్‌‌‌‌ పార్క్‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పలు రకాల యూనిట్లను స్థాపించి మహిళలకు ఉపాధి కల్పించనున్నారు. దీంతో పాటు కొత్తగా మరికొన్ని సంఘాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా కొత్త గ్రూపుల్లో చేరే మహిళలకు కొత్త ఆలోచనలతో ఉత్పత్తులు తయారు చేయడానికి స్కిల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్లు దోహదపడుతాయి.

సోలార్‌‌‌‌ యూనిట్లతో పవర్‌‌‌‌ జనరేషన్‌‌‌‌

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కుసుం’ అనే పథకం కింద మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్‌‌‌‌ యూనిట్లను కూడా నడపనున్నారు. ఎకరం, రెండెకరాల స్థలంలో కోటి, రెండు కోట్ల ఖర్చుతో సోలార్‌‌‌‌ యూనిట్లు స్థాపించనున్నారు. ఇక్కడ తయారయ్యే విద్యుత్‌‌‌‌ను పవర్‌‌‌‌ గ్రిడ్‌‌‌‌కు అమ్ముతారు. తద్వారా వచ్చే ఆదాయంతో మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నది ఈ పథకం ఉద్దేశ్యం. 

నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జునసాగర్‌‌‌‌, నల్గొండల్లో సోలార్‌‌‌‌ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌‌‌‌ చేస్తున్నారు. దీంతో పాటే ప్లాస్టింగ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ యూనిట్లు, ప్రతి మండలానికి శాశ్వత కుట్టు మిషన్‌‌‌‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అమ్మేందుకు హైదరాబాద్‌‌‌‌లోని శిల్పారామంలో ప్రత్యేక స్టాల్స్‌‌‌‌  ఏర్పాటు చేశారు. 

ఇందులో నల్గొండ జిల్లా నుంచి మూడు స్టాల్ట్‌‌‌‌ పెట్టేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం జిల్లాలో 13 రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. త్వరలో కొత్తగా తయారయ్యే వస్తువులను శిల్పారామం వేదికగా మార్కెటింగ్‌‌‌‌ చేసుకునే అవకాశం మహిళా సంఘాలకు లభించనుంది.

ఈవెంట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్లపైనా ఫోకస్‌‌‌‌

ఈవెంట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్యక్రమాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని మహిళా సంఘాలకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సూచించింది. గ్రామాలు, పట్టణాల్లో జరిగే శుభకార్యాలకు అవసరమయ్యే అన్ని రకాల కార్యక్రమాలు మహిళా సంఘాలతో చేయించనున్నారు. బ్యాండ్​మేళం, భోజనాలు, టిఫిన్, ఫంక్షన్‌‌‌‌ హాల్‌‌‌‌ డిజైనింగ్‌‌‌‌, మ్యూజిక్‌‌‌‌ సిస్టం ఇలా పెండ్లికి అవసరమయ్యే అన్ని పనులను మహిళా సంఘాలతో చేసేలా ప్లాన్‌‌‌‌ చేశారు. 

ఇందుకోసం నల్గొండ మండలాన్ని పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కింద ఎంపిక చేశారు. ఈ మండలంలో ఎంపిక చేసిన మహిళా సభ్యులకు ఈవెంట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌పై శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు సైతం ఇప్పించి ఈవెంట్స్‌‌‌‌కు అవసరమయ్యే ఐటమ్స్‌‌‌‌ను కొనుగోలు చేస్తారు.