- రైతులు కోర్టులకు వెళ్లే తిప్పలు లేకుండా అప్పీళ్లు, ల్యాండ్ ట్రిబ్యునళ్లు
- మండలం, డివిజన్, జిల్లా స్థాయిలో పరిష్కార మార్గాలు
- ‘తెలంగాణ భూ భారతి’ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సర్కారు
- 33 మాడ్యుల్స్ స్థానంలో ఇక ఆరు మాడ్యుల్స్
- పట్టాదారుతో పాటు అనుభవదారు కాలమ్
- మాన్యువల్‌గా రికార్డుల నిర్వహణ
- అధికారులు తప్పులు చేస్తే క్రిమినల్ చర్యలు
- ప్రతి సర్వే నంబర్‌కు జియో కో ఆర్డినేట్స్
- సర్వే తర్వాత వ్యవసాయ, వ్యవసాయేతర, అబాదీ జాగాలకు భూధార్ నంబర్
- యాజమాన్య హక్కుల మీద మాత్రమే సివిల్ కోర్టుకు
- ప్రభుత్వ భూముల రక్షణ.. పార్ట్ బీ ల్యాండ్స్కూ పరిష్కారం
- 9 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు లైన్‌క్లియర్
హైదరాబాద్, వెలుగు : నాలుగేండ్లుగా రైతులను తిప్పలు పెడుతున్న భూ సమస్యలు, వివాదాలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ‘ధరణి– ఆర్ఓఆర్ 2020’ చట్టం స్థానంలో ‘తెలంగాణ భూ భారతి ఆర్ఓఆర్ 2024’ బిల్లును తీసుకొచ్చింది. రైతులకు ఇబ్బంది లేకుండా భూ సమస్యలను ఫీల్డ్ లెవెల్లో సులువుగా పరిష్కరించడమే కాకుండా.. ప్రభుత్వ భూములను కాపాడడంతోపాటు తప్పులు చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న చట్టంలో సివిల్ కోర్టుకు వెళ్లడం తప్పితే అప్పీల్స్‌కు అవకాశం లేదు.
దీంతో కొత్తగా తెస్తున్న చట్టంలో ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అప్పీల్స్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా.. ల్యాండ్ ట్రిబునళ్లను కూడా తీసుకురానున్నారు. ఇవే ఫైనల్ ఆర్డర్స్ ఇవ్వనున్నాయి. అక్కడ పేద రైతులకు ప్రభుత్వం నుంచి ఉచిత లీగల్ సర్వీస్ అందుతుంది. కేవలం యాజమాన్య హక్కుల కోసం మాత్రమే సివిల్ కోర్టులకు ఆశ్రయించాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ(గ్రామ కంఠం) సమస్యలూ కొత్త చట్టంతో తీరనున్నాయి. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాలకు పరిష్కారం చూపించడమే కాకుండా..
భవిష్యత్‌లో ప్రతి సర్వే నంబర్‌కు ఎంజాయ్‌మెంట్ సర్వే చేసి, జియో కో ఆర్డినేట్స్ ఇస్తూ సరిహద్దు ఇబ్బందులకూ చెక్ పెట్టనున్నారు. భూ భారతి ఆర్ఓఆర్–2024 బిల్లును అసెంబ్లీలో బుధవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెట్టారు. త్వరలో చట్టం కానున్న ఈ బిల్లులో అనేక కీలక అంశాలు ఉన్నాయి. చట్టానికి తగ్గట్టు మూడునెలల్లో రూల్స్‌ను రూపొందించనున్నారు.
ధరణి తప్పులకు చెక్
ధరణిలో ఉన్న తప్పులు, లోపాలన్నింటిని భూభారతిలో సవరించారు. బిల్లులో ఉన్న ప్రధానంశాల ప్రకారం.. ఇన్నాళ్లూ ఒక్క పట్టాదారు పేరుకే పరిమితమైన పాస్‌బుక్కుల్లో త్వరలో అనుభవదారు కాలమ్ రానుంది. పట్టాదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. గతంలో ధరణి వచ్చిన తర్వాత ఖాస్తులో ఉండి ఇబ్బంది పడిన రైతులకు అనుభదారు/ఖాస్తు కాలమ్ పెట్టనున్నారు. విస్తీర్ణం మిస్ అయిందనో.. పేరు తప్పు పడిందనో.. ఇలాంటి ఏదైనా భూసమస్య వస్తే ఇప్పుడున్న 33 మాడ్యుల్స్లో ఏ మాడ్యుల్లో అప్లై చేసుకోవాలో తెలియని గందరగోళానికి కూడా కొత్త చట్టంతో చెక్ పడనుంది. కేవలం ఆరు మాడ్యుళ్లతోనే ధరణి స్థానంలో భూభారతి రాబోతున్నది. అంతా ఆన్లైన్ లో జరుగుతున్నప్పటికీ..
ALSO READ : ధరణిని అడ్డుపెట్టుకొని ..లక్షన్నర కోట్ల భూదందా : డిప్యూటీ సీఎం భట్టి
2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో ఇకపైనా అలాగే కొనసాగించనున్నారు. పదకొండు కాలమ్స్ తో జమాబందీ, గ్రామ రెవెన్యూ రికా ర్డుల నిర్వహణ చేపట్టనున్నారు. ధరణిలో వివాదాస్పదమైన 18 లక్షల ఎకరాల పార్ట్ బీ భూములకూ కొత్త చట్టంలో పరిష్కారం చూపించనున్నారు. ప్రస్తుత చట్టం ప్రకారం ధరణి నుంచి భూ భారతి పోర్టల్‌లోకి వివరాలు వస్తాయి. అయితే వ్యవసాయ, వ్యవసాయేతర, అబాదీ (గ్రామకంఠం) భూములన్నింటిని డ్రోన్ లేదా ఇతర సర్వే కార్యక్రమాల తర్వాత ప్రతి భూ కమతాన్ని మ్యాపింగ్ చేసి భూభారతితో శాశ్వాతంగా భూధార్ నంబర్‌ను కేటాయిస్తారు.
భూ భారతి బిల్లులోని ప్రధానాంశాలు..
- అనుభవదారుడి వివరాలు కూడా రెవెన్యూ రికార్డులో నమోదు కానున్నాయి. అనుభవదారుడికి ఈ చట్టం రక్షణగా నిలుస్తుంది. ప్రస్తుత ధరణి చట్టంలో ఈ అవకాశం లేదు.
- ధరణిలో ఉన్న తప్పులను సవరించడానికి, భూమి ఉండి కూడా కొత్త పాస్ పుస్తకాలు రాని వాళ్లకు (పార్టు-–బీ కేసులకు 18 లక్షల ఎకరాలు ) రికార్డులకు ఎక్కించి పాస్ పుస్తకాలను ఇచ్చే విధంగా కొత్త చట్టం రూపొందించారు.
- ఈ తరహా భూ సమస్యలను పరిష్కరించడానికి లేదా ఈ పని చేయడానికి లేదా సరి చేయడానికి తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు అధికారం కల్పిస్తారు.
- ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డును పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతనే కొత్త చట్టం కింద రికార్డును నమోదు చేస్తారు. అప్పటివరకు ఇప్పుడున్న ధరణి రికార్డు తాత్కాలికంగానే కొనసాగుతుంది. ప్రక్షాళన చేసి కొత్త రికార్డును రూపొందిస్తారు. భవిష్యత్తులో భూ సర్వేను కూడా చేసి రికార్డును రూపొందించుకునే అవకాశం కల్పించనున్నారు.
- రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెనువెంటనే మ్యుటేషన్ జరిగి పాస్ పుస్తకం వస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కొత్త చట్టం కల్పిస్తుంది.
- భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ఎంజాయ్‌మెంట్ సర్వే చేయించి శాశ్వతంగా పరిష్కరించే విధానం అందుబాటులోకి వస్తుంది.
- మ్యుటేషన్‌కు మ్యాప్ తప్పనిసరిగా ఉంటుంది. పాస్ పుస్తకంలో కూడా మ్యాప్ ఉంటుంది. దీంతో సరిహద్దు వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు.
- వారసత్వ భూములకు నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఇంతకు ముందు ఎలాంటి విచారణ లేకుండానే జారీ చేయడం అన్నదమ్ముల మధ్య, కుటుంబాలలో వివాదాలకు దారితీసింది. ఇక నుంచి ఈ పరిస్థితి ఉండదు.
- 13బీ, 38ఈ, ఓఆర్‌సీ, లావుని పట్టా వంటి మార్గాల్లో భూమి వచ్చినప్పుడు పాస్ పుస్తకాలు పొందే అవకాశం పాత చట్టంలో లేదు. వీరందరికీ కూడా పాస్ పుస్తకాలను ఆర్డీవో ద్వారా ఇచ్చే అవకాశాన్ని కొత్త చట్టం కల్పిస్తుంది.
- సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్న సుమారు 9 లక్షల పైగా ఉన్న సన్న, చిన్న కారు రైతులకు ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. పాత చట్టంలో ఈ అవకాశం లేదు. 2020 నవంబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది.
- గ్రామ కంఠం, ఆబాదీలకు కూడా హక్కుల రికార్డును ఈ చట్టం కల్పిస్తుంది.
- భూ సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ, ప్రత్యేకంగా భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగనుంది. అవసరాన్ని, ప్రాంతాన్ని బట్టి వీటి సంఖ్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏ విధమైన భూ సమస్యలున్నా కోర్టులకు వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుంది.
- ఏ రైతైనా ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో అప్పీల్ చేసుకోలేని పరిస్థితి ఉంటే, అలాంటి వారికి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది.
- గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా ప్రైవేట్‌లో బంధించింది. ఇప్పుడు భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్‌ప్లే చేస్తారు.
- ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుని శిక్షించేలా కొత్త చట్టంలో నిబంధనలున్నాయి.
- ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండగా.. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్లకు కుదించారు.
- రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డులతో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ ఆఫీసుల్లో భద్రపరుస్తారు.
- ధరణిలో రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ లేదు. ఎవరికి ఫిర్యాదు చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు కొత్త చట్టం అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేస్తుంది.