సర్కార్​ స్కూళ్లలో ఏఐ క్లాస్​లు

సర్కార్​ స్కూళ్లలో ఏఐ క్లాస్​లు
  • విద్యా ప్రమాణాల పెంపునకు విద్యాశాఖ కసరత్తు
  • ‘ఏక్​ స్టెప్ ఫౌండేషన్’తో చర్చలు
  • ఫౌండేషన్ ను సందర్శించిన అధికారుల బృందం


హైదరాబాద్, వెలుగు:  పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుడుతున్నది.  మరింత నాణ్యతా ప్రమాణాలతో పాఠశాల విద్యను అందించడానికి ఏఐ, డిజిటల్ ఇన్షియేటివ్స్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ  నిర్ణయించింది. విద్యార్థుల్లో మరింత మెరుగైన అభ్యాస పద్ధతులు, సాంకేతిక ప్రమాణాల పెంపునకు  ఏఐ క్లాస్​లను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ఏక్ స్టెప్ ఫౌండేషన్’ ను రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం గురువారం సందర్శించింది.  

ఫౌండేషన్ ప్రతినిధులతో విద్యారంగంలో చేపట్టాల్సిన పలు ఇన్షియేటివ్ అంశాలపై రాష్ట్ర బృందం చర్చించింది. ప్రాథమిక విద్యాస్థాయిలో ఏఐ ఆధారిత డిజిటల్ పద్ధతుల ద్వారా రాయడం, చదవడం, సంఖ్యాపరమైన విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సులువవుతుందని నిర్ణయించారు. ఏఐ ఆధారిత టూల్స్, ప్లాట్​ఫామ్​లను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిగత స్థాయిలో విద్యా ప్రమాణాలు, అభ్యాస పద్ధతులను మరింతగా మెరుగుపరచవచ్చని భావిస్తున్నారు. విద్యార్థుల్లో ఉన్న అభ్యసన లోపాలను గుర్తించి, వాటిని సవరించడానికి చర్యలు చేపట్టాలని చర్చల్లో ప్రస్తావించారు. అలాగే, టీచర్లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి డిజిటల్ పద్ధతులపై పూర్తిస్థాయిలో శిక్షణ అందించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. 

2024లో కేరళలో..

ఏక్ స్టెప్ ఫౌండేషన్ ను సందర్శించిన  తెలంగాణ విద్యాశాఖ ప్రతినిధి బృందం.. 2024లో కేరళ లోనూ పర్యటించింది. అక్కడ విద్యారంగంలో చేపట్టిన ఆధునిక పద్ధతులను పరిశీలించింది. కేరళ ప్రభుత్వం కూడా  విద్యాశాఖలో ఏఐ టూల్స్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకొని, మెరుగైన విద్యా ప్రమాణాలను సాధించిందని ఈ బృందం పరిశీలనలో గుర్తించింది. తెలంగాణ విద్యాశాఖలోనూ దీన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ తదితరులున్నారు.