ఏఐ క్లాసులు షురూ

 ఏఐ క్లాసులు షురూ
  • మహబూబాబాద్ లో 7  ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ క్లాసులు ప్రారంభం 
  • త్వరలో అన్ని స్కూళ్లలో ప్రారంభానికి  చర్యలు
  • ఏజెన్సీ ఏరియాల్లో ఇంటర్నెట్ కష్టాలు 
  • ఏఐతో క్లాసులు వినడం పై స్టూడెంట్ల ఇంట్రస్ట్

మహబూబాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూల్స్ లో ప్రాథమిక స్థాయిలో ఏఐ టెక్నాలజీని దశలవారీగా అమలు చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడో తరగతి నుంచి అయిదో తరగతి వరకు  ఏఐ టెక్నాలజీతో క్లాసులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.  ఉమ్మడి వరంగల్ జిల్లాలో  హై స్కూల్, ప్రైమరీ స్కూల్ ​ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రాంతాల్లో  ఏఐ క్లాసులను ప్రారంభించారు.  హై స్కూల్లో ఉన్న కంప్యూటర్లనే ప్రస్తుతానికి వినియోగించుకుంటున్నారు.  మిగిలిన చోట దశల వారీగా ఏఐ క్లాసులను చెప్పేలా ప్రణాళికలను ఆఫీసర్లు సిద్ధం చేస్తున్నారు. అయితే కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో ఇంటర్నెట్ సరిగా రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  

ప్రభుత్వ స్కూళ్ల వివరాలు.. 

మహబూబాబాద్​ 843, వరంగల్లో 524,  జనగామ 453, హనుమకొండ 420, జయశంకర్​ భూపాలపల్లి 407, ములుగు 405 ప్రభుత్వ స్కూల్స్​ ఉన్నాయి. మహబూబాబాద్​ జిల్లాలో తొలి విడతగా 7 ప్రభుత్వ పాఠశాలల్లో,  వరంగల్ లో 11 స్కూల్స్, హనుమకొండలో 9 స్కూల్స్, జనగామలో 5 స్కూల్స్ లో ఏఐ క్లాసులు ప్రారంభించారు.  రోజూ విద్యార్థులను విడతల వారీగా కంప్యూటర్ క్లాస్‌ కు పంపుతున్నారు. 
భూపాలపల్లి జిల్లాలో ఏఐ తరగతులు రెండు మండలాల్లో ప్రారంభమయ్యాయి. 

గుర్రంపేట్ తో పాటు, కాటారం మండలంలోని చింతకాని స్కూల్స్ లో ఏఐ  క్లాసెస్ ప్రారంభమయ్యాయి.ములుగు కలెక్టర్​ దివాకర జిల్లాలోని గోవిందరావుపేట మండలం చల్వాయి ఎంపీపీఎస్​ లో ఏఐ తరగతులను ప్రారంభించారు. మిగిలిన వెంకటాపూర్​ మండలం పాలంపేట, ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, కన్నాయిగూడెం మండలం గూర్రేవుల, తాడ్వాయి మండలం బీరెల్లి ఎంపీపీఎస్‌లలో తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏఐ టెక్నాలజీ వల్ల కలిగే లాభాలు

ఏఐ టెక్నాలజీ తరగతులతో  పిల్లలకు లాజికల్ థింకింగ్, సమస్యలను పరిష్కరించే  సామర్థ్యం పెరుగుతుంది. పిల్లలు కొత్తగా ఆలోచించడం, సృజనాత్మకంగా ఉండడం నేర్చుకుంటారు. ఏఐ ద్వారా గేమ్స్, అప్లికేషన్‌లు, రూపొందించగల సామర్థ్యాన్ని పొందుతారు.  కంప్యూటర్ ప్రోగ్రామింగ్, డేటా పెరుగుతాయి. ఏఐ ఆధారంగా విద్యార్థులకు ప్రత్యేక శైలి, వేగం బోధించేందుకు వీలవుతుంది.

  ఏఐ  రంగంలో భవిష్యత్తులో లభించే వృత్తిపరమైన అవకాశాల గురించి అవగాహన పెరుగుతుంది. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ వంటి రంగాల్లో ప్రాథమిక పరిజ్ఞానం కలుగుతుంది. ఏఐ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, మెరుగైన కమ్యూనికేషన్ , టీమ్‌ వర్క్  నైపుణ్యాలను పెంచుకోవచ్చు. స్టూడెంట్ల అభ్యసన , ప్రశ్నల స్థాయికి అనుగుణంగా ఏఐ టెక్నాలజీ  పని చేస్తుంది.  

ఏఐ తరగతులను విద్యార్థులు వినియోగించుకోవాలి

ప్రాథమిక స్థాయిలోనే  విద్యార్ధులు ఏఐ పట్ల  అవగాహన పెంచడం వల్ల భవిష్యత్తులో వారు సాంకేతికంగా కొత్త ఆవిష్కరణలు చేసేందుకు మంచి అవకాశం లభిస్తుంది.  ప్రభుత్వం ఆదేశాల మేరకు తొలుత జిల్లాలో  7  ప్రభుత్వ స్కూల్స్‌   ఏఐ తరగతులను ప్రారంభించాం. దశల వారీగా మిగిలిన చోట్ల ఏఐ క్లాసులను స్టార్ట్ చేస్తాం.  టీచర్లకు ముందస్తుగా శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులు టెక్నాలజీ ఎడ్యుకేషన్​ను సద్వినియోగం చేసుకోవాలి.  రవీందర్​ రెడ్డి, డీఈవో  మహబూబాబాద్​ జిల్లా