త్వరలో 6 కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్

త్వరలో 6 కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్
  • అసెంబ్లీలో మున్సిపల్ 
  • చట్ట సవరణ బిల్లు పెట్టిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో మరో  6 కొత్త మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్  ఏర్పాటు కానున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ కలిపి కార్పొరేషన్  ను ఏర్పాటు చేస్తుండగా.. ములుగు, కల్లూరు (ఖమ్మం జిల్లా), బిచుకుంద (నిజామాబాద్), అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట (మేడ్చల్  జిల్లా) మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను విలీనం చేయడంతో పాటు మరికొన్ని మండలాల్లో గ్రామాలను కలిపి కొత్త కార్పొరేషన్ నే ఏర్పాటు చేయనున్నారు.

 మేడ్చల్ జిల్లాలో కొత్తగా ఏర్పాటుకానున్న మూడు మున్సిపాలిటీల్లో 68 గ్రామ పంచాయతీలను కలపగా, 20 గ్రామ పంచాయతీలను కలిపి కల్లూరు మున్సిపాలిటీని, 12 గ్రామాలను విలీనం చేసి బిచుకుంద మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో మున్సిపల్  సవరణ చట్టం బిల్లు 2025ను మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. శుక్రవారం లేదా శనివారం ఈ బిల్లు అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందనుంది. రాష్ర్టంలో ప్రస్తుతం 152 మున్సిపాలిటీలు, 15 కార్పొరేషన్లు ఉండగా వీటితో కొత్తగా మరో 6 మున్సిపాలిటీలు, కొత్త కార్పొరేషన్  ఏర్పాటు కానుంది.