ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్ర్కీనింగ్ టెస్టు

ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్ర్కీనింగ్ టెస్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కోర్సులను బోధించే ఆసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి ప్రత్యేకంగా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. మొత్తం12 వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల్లోఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను బోధించేందుకు దరఖాస్తు చేసుకునే అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులు ఇప్పటికే పీహెచ్ డీ పూర్తి చేస్తే 10 మార్కులకు, పీహెచ్​డీ లేని వారికి  20 మార్కులకి పరీక్షను నిర్వహించనున్నారు. 

కాగా, మిగిలిన సాంప్రదాయ సబ్జెక్టులు బోధించే ఆసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మాత్రం ఎలాంటి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించడం లేదు. కేవలం ఇంజనీరింగ్ కోర్సుల వారికి మాత్రమే ఈ పరీక్షను పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) ఉన్న వారికి 10 మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నారు. నెట్, సెట్, స్లెట్ ఉంటే ఐదు మార్కులు ఇస్తారు. పీహెచ్​ డీ ఉంటే పది మార్కులు లేదా ఎంఫిల్ ఉంటే ఐదు మార్కులు ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో పీహెచ్ డీ చేసిన వారు తక్కువగా ఉండటంతో పది మార్కుల వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.