- యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని ఎంపీడీవోలకు స్టేట్ ఆఫీసర్ల ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పేద, వెనుకబడిన బీసీ వర్గాల లబ్ధిదారులకు గత బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన బీసీ బంధుపై ప్రభుత్వం ఆరా తీస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన రూ. లక్ష ఆర్థిక సహాయంతో ఏం చేశారని లబ్ధిదారులకు అధికారులు ఫోన్లు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా బీసీ బంధు స్కీమ్ ను తీసుకొచ్చింది. ఒక విడతలో అర్హుల ఎంపికగా దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,28,862 దరఖాస్తులు రాగా, అందులో మొత్తంగా 4.13 లక్షల మందిని రూ.లక్ష ఆర్థిక సాయానికి అర్హులుగా గుర్తించింది.
వారందరికీ ప్రతినెలా 15న ఆర్థిక సాయం అందించాలని, అది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల వరకు దాదాపు 46 వేల మంది కులవృత్తిదారులకు లక్ష ఆర్థిక సాయం అందించింది. వృత్తిదారులు ముడిసరుకులు, యంత్ర పరికరాల కొనుగోలు చేసుకునేందుకు వీలుగా 100 శాతం సబ్సిడీతో లక్ష అందించింది. ఇంకా 3.73లక్షల మంది అర్హులకు ఇవ్వాల్సి ఉండగా.. ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆగిపోయింది. కాగా, లబ్ధిదారుల్లో ఆ పార్టీ నేతలు, అనర్హులు ఉన్నారని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది.
దీంతో ఈ స్కీమ్ ను కాంగ్రెస్ సర్కారు పక్కన పెట్టింది. ఈ స్కీమ్ కోసం గత సర్కారు మొత్తంగా రూ.500 కోట్లు మంజూరు చేయగా.. అందులో రూ.400 కోట్ల నిధులను కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసింది. దాదాపు రూ.100 కోట్ల నిధులు జిల్లా బీసీ సంక్షేమశాఖ వద్దనే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ నిధులన్నీ కార్పొరేషన్ ఖాతాకు తిరిగి పంపించాలని కోరుతూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలువురు జిల్లా అధికారులు నిధులను వెనక్కి పంపారని తెలుస్తున్నది.
సొంత అవసరానికి నిధులు వినియోగం
గత సర్కారు అందించిన రూ.లక్షల సాయాన్ని చాలా మంది లబ్ధిదారులు కుటుంబ ఖర్చులు, ఇతర అవసరాలకు వినియోగించుకున్నట్టు తమ పరిశీలనలో తేలిందని ఎంపీడీవోలు చెబుతున్నారు. వీరి యూసీలు ఎలా అన్న అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది.
ఈ స్కీమ్ కింద గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యకర్తలకు, అనుచరులకు , ఆర్ధికంగా ఇబ్బందులు లేని వారికి ఇచ్చినట్టు అధికారుల సర్వేలో తేలింది. ఈ లక్ష సాయంలో కూడా లబ్ధిదారుల నుంచి స్థానిక నేతలు 20 శాతం కమిషన్ రూపంలో తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరికొంత మంది నేతలు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మరీ హడావుడిగా లక్ష సహాయం నిధులు రిలీజ్ చేశారన్న ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.
32 వేల యూసీలు అప్లోడ్
రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంధు లో భాగంగా గత సర్కారు 46 వేల మందికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించగా.. ఇప్పటివరకూ 32 వేల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ( యూసీ) మాత్రమే ఎంపీడీవోలు ఓబీఎంఎంస్ (ఆన్ లైన్ బెనిఫీషియరీ మేనేజ్ మెంట్ మానిటరింగ్ సిస్టమ్) పోర్టల్ లో అప్ లోడ్ చేసినట్టు బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు.
ప్రతి లబ్ధిదారుడి యూసీ అప్ లోడ్ చేయాలని ఎంపీడోవోలకు ఆదేశాలు ఇచ్చామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామ సభలు జరుగుతున్న నేపథ్యంలో అవి పూర్తయిన వెంటనే అప్ లోడ్ చేస్తామని ఎంపీడీవోలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల చివరి నాటికి యూసీల అప్ లోడ్ పూర్తవుతుందని ‘వెలుగు’కు తెలిపారు.