హై లెవల్ కాలువల కోసం మళ్లీ భూసేకరణ .. లక్ష ఎకరాలకు సాగు నీరు లక్ష్యం

హై లెవల్ కాలువల కోసం  మళ్లీ భూసేకరణ .. లక్ష ఎకరాలకు సాగు నీరు లక్ష్యం
  • రెండు కాలువల కోసం 450 ఎకరాల భూములు అవసరం
  • 28వ ప్యాకేజీ కాలువ నిర్మాణానికి మొదలైన ప్రక్రియ
  • సర్కార్ చొరవతో కొనసాగుతున్న పనులు

 నిర్మల్, వెలుగు:  జిల్లాలో లక్ష ఎకరాలకు అదనంగా సాగు నీరందించేందుకు నిర్మించతలపెట్టిన కాళేశ్వరం హై లెవల్ కాలువల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు మరో 450 ఎకరాల భూమిని సేకరించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ముథోల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు చేపట్టిన ప్యాకేజీ నంబర్ 28 కాలువ కోసం గతంలోనే 555 ఎకరాల భూమిని సేకరించారు. తాజాగా మరో 200 ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మరో 50 వేల ఎకరాల భూములకు సాగు నీరందించేందుకు చేపట్టిన ప్యాకేజీ నంబర్ 27 హై లెవల్ కాలువల కోసం 250 ఎకరాల భూములను కూడా సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో భూసేకరణ సర్వే పనులు పూర్తయ్యాయి. 

16 గ్రామాల్లో భూసేకరణ

28వ నంబర్ ప్యాకేజీ కాల్వ కోసం భూసేకరణకు 16 గ్రామాల్లో సర్వే పనులు మొదలయ్యాయి. భైంసా మండలం అంపొలి కే, బోర్గావ్ మాటేగాం, అంబకంటి గ్రామాల్లో 45 ఎకరాల భూమిని సేకరించారు. మరో 12 గ్రామాల్లో భూసేకరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేయనుంది. ఆ తర్వాత రెవెన్యూ శాఖ నుంచి క్లియరెన్స్ లభించగానే భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.

మూడు మండలాల్లో 250 ఎకరాలు

27వ నంబర్ ప్యాకేజీ కాలువ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ పూర్తికాకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికే కాలువ నిర్మాణ పనుల గడువు పూర్తికాగా.. పలుసార్లు ఈ గడువును పెంచి కాంట్రాక్టర్​కు పనులు పూర్తిచేసేందుకు అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ భూసేకరణ ప్రక్రియ జరగకపోవడం ఎప్పటికప్పుడు నిధులు విడుదల కాక కాలువ నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయలేమంటూ చేతులెత్తేశారు. 

అధికారంలోని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వల నిర్మాణంపై దృష్టి పెట్టింది. నిధుల మంజూరు, మిగిలిపోయిన భూములు సేకరించే ప్రక్రియ మొదలుపెట్టింది. దిలావర్​పూర్ మండలంలోని గుండంపెల్లి, కాల్వ, న్యూలోలం, నర్సాపూర్ జి మండలంలోని తురాటి, భామిని బి, అంజనీ తండా, కుంటాల మండలంలోని అందకూర్, విఠాపూర్, లింబా కే, లింబా బి, దౌనెల్లి గ్రామాల్లో 250 ఎకరాల భూసేకరణ చేపట్టనున్నారు. మరికొద్ది రోజుల్లోనే సర్వే పనులు మొదలు పెట్టనున్నారు.