హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్యూనివర్సిటీ హోదా ఇస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తీరుపై రాష్ట్ర సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నది. అవసరమైతే కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు సమాచారం. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలకు డీమ్డ్వర్సిటీ హోదాను ఇస్తూ ఇటీవల యూజీసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీతో సంబంధం లేకుండా ప్రత్యేక (డిస్టింక్ట్) కేటగిరీ కింద డీమ్డ్ హోదా ఇస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది.
ఆయా కాలేజీల్లో కన్వీనర్ కోటా, రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం లేకుండా అనుమతులు జారీ చేసింది. ఫీజుల ఖరారు, పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల మూల్యంకనం వంటివన్నీ యూనివర్సిటీ హోదాలో సొంతంగానే చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ లోకల్ కోటా అమలు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు ఇచ్చింది. దీంతో మల్లారెడ్డి కాలేజీల్లో ఉన్న 400 ఎంబీబీఎస్ సీట్లు, సుమారు 150 బీడీఎస్(డెంటల్) సీట్లు పూర్తిగా మేనేజ్‌మెంట్ కోటాలోకి వెళ్లిపోయాయి.
మల్లారెడ్డి బాటలో అపోలో, సీఎంఆర్..
మల్లారెడ్డి కాలేజీల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు, దాదాపు 150 డెంటల్ సీట్లు ఉండగా.. గతేడాది వరకు ఇందులో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు. ఇవి నీట్‌లో మంచి ర్యాంక్ సాధించిన మెరిట్ స్టూడెంట్లకు దక్కేవి. మెరిట్ ర్యాంక్ సాధించిన పేద విద్యార్థులకు ఉచితంగా మెడిసిన్ చదివే అవకాశం దక్కేది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లలోనూ 85 శాతం తెలంగాణ స్టూడెంట్లకే కేటాయించేవారు. కానీ ఇకపై ఈ రూల్స్ ఏవీ అమలు చేయాల్సిన అవసరం లేకుండా యూజీసీ మల్లారెడ్డి కాలేజీలకు మినహాయింపులు ఇచ్చింది.
దీంతో మల్లారెడ్డి చూపిన బాటలో అపోలో, సీఎంఆర్ కాలేజీలు కూడా డీమ్డ్హోదా కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కన్వీనర్ కోటా, రిజర్వేషన్ కోటా సీట్లు తగ్గిపోయి.. మెరిట్, పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు స్టూడెంట్ల పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని, డీమ్డ్వర్సిటీలను అడ్డుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్టుగా విద్యార్థుల పేరెంట్స్ చెబుతున్నారు.
ఈ అంశంపై కాళోజీ యూనివర్సిటీ అధికారులతోనూ మంత్రి రివ్యూ చేసినట్టుగా తెలిసింది. యూజీసీ తీరు బడుగు, బలహీన వర్గాలకు చెందిన మెరిట్ స్టూడెంట్స్‌కు తీరని అన్యాయం చేసే విధంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించినట్టుగా అధికారులు చెబుతున్నారు. డీమ్డ్ హోదా తెచ్చుకుంటున్న కాలేజీలను కట్టడి చేయడానికి ఉన్న అవకాశాలను సైతం పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది.
డీమ్డ్ హోదాతో కోట్లలో లాభం..
డీమ్డ్ యూనివర్సిటీ హోదా తెచ్చుకుంటున్న మెడికల్ కాలేజీలకు రూ.వందల కోట్ల లబ్ధి చేకూరుతున్నది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీటు ఫీజు రూ.60 వేలు మాత్రమే ఉండగా, మేనేజ్‌మెంట్ కోటా ఫీజు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంది. ఆయా కాలేజీల్లో ఉన్న వసతులను బట్టి ఈ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిర్ణయిస్తున్నది. కానీ ఫీజు రెగ్యులేటరీ కమిటీతో సంబంధం లేకుండా, సొంతగానే తమ ఫీజులను నిర్ణయించుకునే అధికారాన్ని డీమ్డ్ యూనివర్సిటీలకు యూజీసీ కల్పిస్తున్నది.
మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజు రూ.17.5 లక్షలుగా ఉన్నట్టు కాళోజీ అధికారులు చెబుతున్నారు. గతంలో కన్వీనర్ కోటా ఫీజు 200 సీట్లకు ఏడాదికి రూ.1.2 కోట్లు వస్తే, ఇప్పుడు అదే 200 సీట్లకు ఏడాదికి రూ.35 కోట్లు వస్తుంది. ఒక్క బ్యాచ్ స్టూడెంట్ల మీద ఏకంగా రూ.175 కోట్లు సమకూరుతుంది. కాలేజీ మీద రాష్ట్ర ప్రభుత్వ మానిటరింగ్ ఉండదు. సొంతగా పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల మూల్యాంకనం వంటి మినహాయింపులు ఉండడం వల్ల.. ఇక్కడ చదివే విద్యార్థులు సులభంగా మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీంతో ఎంత ఫీజైనా చెల్లించి ఇసొంటి కాలేజీల్లో చేరేందుకు ధనికుల పిల్లలు ఇష్టపడతారు.