హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు పారినా అవి కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినవే అన్నట్లుగా ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ప్రాజెక్టు కింద కనీసం పంట కాల్వలను కూడా తవ్వని సర్కారు.. మూసీలోనూ కాళేశ్వరం నీళ్లు పారిస్తామని అంటున్నది. హుస్సేన్‌సాగర్‌ను కాళేశ్వరం నీళ్లతో నింపుతామని ప్రకటించింది. జీవో 111 ఎత్తేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును ట్రంప్‌కార్డుగా ఉపయోగించుకుంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల క్యాచ్మెంట్ ఏరియా కలుషితం కాకుండా కాపాడే 111 జీవోను ఎత్తేసిన ప్రభుత్వం.. ఆ జలాశయాలను కాళేశ్వరంతో లింక్చేస్తామంటున్నది. ఇందుకు అవసరమైన పనులేవీ మొదలుపెట్టకముందే కాళేశ్వరం నీళ్లను ఆ రెండు జలాశయాలు దాటించి మూసీలోకి ప్రవహింపజేస్తామని హామీ ఇచ్చింది. ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకే నీళ్లు ఇవ్వని ప్రభుత్వం ఆ నీళ్లను ఎక్కడెక్కడికో తరలిస్తామని చెప్తుండటం ఇంజనీర్లను కూడా విస్మయానికి గురిచేస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చెరువులు మత్తడి దుంకినా.. కూడవెళ్లి వాగు పారినా.. ఆ నీళ్లన్నీ ఎస్సారెస్పీ నుంచి తరలించినవే. కానీ వాటికి కాళేశ్వరం కలరింగ్ ఇచ్చి పలు రాష్ట్రాల వారిని పిలిపించి చూపిస్తున్నది. ఆయకట్టులో పదోవంతు నీళ్లు కూడా ఇయ్యలే మేడిగడ్డ నుంచి ఏటా వానాకాలంలో 180 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్‌చేశారు.
ఇందులో 124 టీఎంసీలతో 13 జిల్లాల్లోని 19.63 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వడంతో పాటు 20 జిల్లాల పరిధిలోని 18.83 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఎత్తిపోసే నీళ్లల్లో 30 టీఎంసీలు హైదరాబాద్, సికింద్రాబాద్తాగునీళ్లకు, ఇంకో 10 టీఎంసీలు ప్రాజెక్టు పొడవునా ఉన్న గ్రామాల తాగునీటికి, 16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించాలనుకున్నారు. 2019 జూన్21న ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రస్తుత వాటర్ఇయర్వరకు నాలుగేండ్లలో 153.58 టీఎంసీలను మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేశారు. ఇందులో 50 టీఎంసీలకు పైగా నీళ్లు వృథాగా సముద్రం పాలయ్యాయి. మిగతా వంద టీఎంసీల నీటిని ఎస్సారెస్పీ స్టేజ్–2 ఆయకట్టుకు ఉపయోగించడంతో పాటు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లో నిల్వ చేయడం, ఉమ్మడి మెదక్జిల్లాలోని పలు చెరువులు నింపడం సహా వాగుల్లోకి వదలడానికే ప్రాధాన్యం ఇచ్చారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినా ఇప్పటి వరకు ఏ సీజన్లోనూ 75 వేల ఎకరాలకు మించి ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లివ్వలేదు.
ప్రతిపాదనలకే పరిమితం
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు కలుషితం కాకుండా వాటికి నీళ్లు వచ్చే (క్యాచ్మెంట్ఏరియా) పరిధిలోని 84 గ్రామాల్లో జీవో 111 ద్వారా ఉమ్మడి ఏపీలో ఆంక్షలు పెట్టారు. నిజాం కాలం నుంచే ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. అయితే.. ఆ గ్రామాల పరిధిలోని 1.32 లక్షల ఎకరాల్లో రియల్ఎస్టేట్వ్యాపారానికి 111 జీవో అడ్డంకిగా మారింది. ఇదే క్రమంలో జీవోను ఎత్తేయాలని ప్రభుత్వం నిరుడు మార్చిలో నిర్ణయించి, హైదరాబాద్తాగునీటికి ప్రత్యామ్నాయాలను ముందుకు తీసుకువచ్చింది. హైదరాబాద్తాగునీటి కోసం మల్లన్నసాగర్రిజర్వాయర్లో డెడికేటెడ్‌గా 10 టీఎంసీలు నిల్వ చేయాలని నిర్ణయించింది. అక్కడి నుంచి రెండు స్టేజీల్లో కొండపోచమ్మసాగర్‌కు ఎత్తిపోయాలని, కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్‌కు తరలించాలని, ఆ కెనాల్104.25 కి.మీ. పాయింట్ దగ్గర నుంచి కొత్తగా 52 కి.మీ.ల పొడవైన కాల్వ తవ్వి ఉస్మాన్‌సాగర్‌కు లింక్ చేయాలని రిటైర్డ్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. అక్కడి నుంచి నేరుగా హిమాయత్‌సాగర్‌కు నీళ్లు తరలించవచ్చని పేర్కొన్నారు. సంగారెడ్డి కెనాల్వద్దే మరో లొకేషన్నుంచి పైపులైన్‌ను కూడా రిటైర్డ్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఈ రెండు అలైన్మెంట్లుతప్ప జంట జలాశయాలకు కాళేశ్వరం నీళ్లు తరలించే పనులేవీ ప్రభుత్వం చేయలేదు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు తెచ్చే నీళ్లను మూసిలోకి వదిలి తద్వారా హుస్సేన్‌సాగర్‌కు తరలించాలనే ఆలోచనలో సర్కారు ఉంది. కానీ అందుకు అవసరమైన ప్రాథమిక పనుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ ఇయర్లో ఎత్తిపోసింది 24 టీఎంసీలే
ఈ ఏడాది వానాకాలంలో గోదావరి ఉప్పొంగడంతో మేడిగడ్డ, అన్నారం పంపుహౌస్‌లు నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. ఆ పంపుహౌస్‌లు రిపేర్ చేసి పాక్షికంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ వాటర్ఇయర్లో మేడిగడ్డ నుంచి కేవలం 24 టీఎంసీలు ఎత్తిపోశారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో ఎస్సారెస్పీ నుంచి మూడు వందల టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రం పాలయ్యాయి. వరద కాలువ ద్వారా ఫ్లడ్డేస్లో మిడ్‌మానేరును నింపి అక్కడి నుంచి మల్లన్నసాగర్, కొండపోచమ్మకు నీళ్లు తరలించే అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేదు. వరద తగ్గిన తర్వాత కొద్దిపాటి నీళ్లను మాత్రమే లిఫ్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన ఏడాది నుంచి ఎస్సారెస్పీ పూర్తిగా నిండి నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతూనే ఉన్నాయి. ఆ నీటిని ఉపయోగించుకునే అవకాశమున్నా కాళేశ్వరం మైలేజ్‌కోసం కింద నుంచి ఎత్తిపోతలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ ఏడాది ఎత్తిపోసిందే 24 టీఎంసీలు.. అందులో ఒక్క చుక్కను కూడా మిడ్ మానేరు నుంచి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు తరలించలేదు. అయినా పలు రాష్ట్రాల రైతులను, జర్నలిస్టులను ఉమ్మడి మెదక్‌జిల్లాకు తీసుకువచ్చి పారే నీళ్లన్నీ కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినవేనని ప్రభుత్వం చెప్పుకుంటున్నది.
ఆయకట్టు కాల్వలేవీ?
కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొదట ప్రయోజనం పొందాల్సింది ఆయకట్టు రైతులే.. కానీ దానికింద ప్రతిపాదిత 19.63 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేయడం లేదు. ప్రాజెక్టును ప్రారంభించి నాలుగేండ్లు గడిచినా పంట కాల్వలు కూడా తవ్వడం లేదు. కేవలం మేజర్పనులు పూర్తి చేసి కొండపోచమ్మసాగర్వరకు నీళ్లు చూపించి ప్రాజెక్టును ప్రచారంచేసుకోవడంపైనే ఫోకస్పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్టు లింక్– 1 కింద పెద్దపల్లి జిల్లాలో 30 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా, ఒక్క కాల్వ కూడా తవ్వలేదు. ఉమ్మడి మెదక్జిల్లాలో నీళ్లు కనిపిస్తున్నా పంట కాల్వలు మాత్రం లేవు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ కింద కొంతమేరకు మాత్రమే కాల్వలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టులో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ కిందనే దాదాపు 75 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారు. మిగతా 18 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లివ్వడానికి కాల్వలే లేవు. ఈ కాల్వలన్నీ పూర్తి చేయాలంటే భూసేకరణ కలుపుకొని ఇంకో రూ.లక్ష కోట్ల అవసరమని ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రభుత్వం అంత ఖర్చు చేసే ఆలోచనలో లేదు కాబట్టి చెరువులకు లింక్చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నామని అంటున్నారు.
ఎత్తిపోసే నీళ్లెన్ని.. మూసీలో పారేదెప్పుడు?
మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే నీళ్లు ఇప్పుడు ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుతో పాటు తాగునీళ్లకు, పారిశ్రామిక అవసరాలకే సరిపోవు. మల్లన్నసాగర్లో వచ్చే ఏడాది నుంచి కనీసం 30 టీఎంసీలను ఏడాది పొడవునా నిల్వ ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడేండ్ల తర్వాత 50 టీఎంసీలను నిల్వ ఉంచుతామని చెప్తున్నది. ఈ లెక్కన మల్లన్నసాగర్లో నీళ్లు నిల్వ చేయాలంటే అదనంగా ఇంకో 40 టీఎంసీల వరకు ఎత్తిపోయాలి. అవి కూడా అక్కడి అవసరాలకే సరిపోతాయి. ఆ నీళ్లు కొండపోచమ్మసాగర్‌ను దాటి ఎప్పుడు ఉస్మాన్‌సాగర్‌కు వస్తాయి.. అవి హిమాయత్‌సాగర్‌ను దాటి మూసీలో పారేదెప్పుడు.. హుస్సేన్‌సాగర్‌కు చేరేదెప్పుడు.. అనేదానిపై ఇరిగేషన్ ఉన్నతాధికారులకు కూడా క్లారిటీ లేదు.
డెడికేటెడ్‌గా రెండు రిజర్వాయర్లు అని చెప్పి..!
ఉమ్మడి ఏపీలోనే హైదరాబాద్ తాగునీటి కోసం కృష్ణా, గోదావరి, మంజీరా డ్రింకింగ్‌వాటర్ ప్రాజెక్టులు చేపట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ తాగునీటి కోసమే డెడికేటెడ్‌గా రెండు రిజర్వాయర్లు (ఒక్కోటి 10 టీఎంసీల చొప్పున) నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవపూర్‌లో 20 టీఎంసీలతో ఒక రిజర్వాయర్, రాచకొండ గుట్టల కింద 10 టీఎంసీలతో ఇంకో రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పారు. కేశవపూర్ రిజర్వాయర్ కోసం వ్యాప్కోస్డీపీఆర్ కూడా రెడీ చేసింది. ఇందుకు రూ. 4,750 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రిజర్వాయర్ కోసం 2,166.18 ఎకరాలు అవసరమని అంచనా వేయగా అందులో అటవీ భూమి 1,234.12 ఎకరా లు ఉందని తేల్చారు. అటవీ భూమి సేకరణ క్లిష్టతరమవుతుందని చెప్పి రిజర్వాయర్ కెపాసిటీని నాలుగు రెట్లు కుదించి 5 టీఎంసీలకు పరిమితం చేశారు. రూ.2 వేల కోట్లతో నిర్మాణం పూర్తి చేయవచ్చని ప్రతిపాదించారు. కొండపోచమ్మ సాగర్‌నుంచి కేశవపూర్ రిజర్వాయర్ ప్రతిపాదిత స్థలం కేవలం 15 కి.మీ.లు కాబట్టే ఈ రిజర్వాయరే అవసరం లేదని ఎత్తేశారు. రాచకొండ రిజర్వాయర్ప్రతిపాదనల దశలోనే అటకెక్కింది.
జంట జలాశయాల నీళ్లే దూపదీరుస్తున్నా..!
హైదరాబాద్ తాగునీటికి జంట జలాశయాల నుంచి నీళ్లే తీసుకోవడం లేదని.. కృష్ణా, గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుల నీళ్లే పుష్కలంగా వస్తున్నప్పుడు ఆ నీళ్లు అవసరమే లేదని సీఎం కేసీఆర్ జీవో 111 ఎత్తేసేందుకు సిద్ధమైన సమయంలో ప్రకటించారు. కానీ ఈ ఏడాది ఎండాకాలంలోనే హైదరాబాద్‌మెట్రో డ్రింకింగ్ వాటర్ బోర్డు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి నీటిని తరలించాయి. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టి జంట జలాశయాల నీళ్లే అవసరం లేదని చెప్తున్నది.
చెప్పింది ఇదీ..
మేడిగడ్డ నుంచి ఏటా వానా కాలంలో 180 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడం.
జరిగింది ఇదీ..
ప్రాజెక్టును ప్రారంభించి నాలుగేండ్లవుతుండగా.. ప్రస్తుత వాటర్ ఇయర్ వరకు 153.58 టీఎంసీలను మాత్రమే మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేశారు. ఇందులో 50 టీఎంసీలకు పైగా నీళ్లు వృథాగా సముద్రం పాలయ్యాయి.