బీఆర్​ఎస్​ ఒక ఎత్తుగడ : బెజాడి బీరప్ప

తెలంగాణ రాష్ట్ర ఉద్యమానిది ప్రపంచ చరిత్రలోనే అద్భుత పోరాట విజయ గాధ. ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఈ పోరాటంలో మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు ప్రాణాలకు తెగించి కొట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై పోరాడితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసింది. తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్​కు బ్రహ్మరథం పట్టారు. ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలు చెదిరిపోగా, ఇప్పుడు తెలంగాణ వాదమే అస్తిత్వంగా చెప్పుకున్న ఆ పార్టీ, నిర్దిష్ట జాతీయ విధానాలు లేకుండా జాతీయ పార్టీగా మారి ‘తెలంగాణ’ను వదులుకున్నది. రాష్ట్రంలో ఎనిమిదేండ్ల పాలనలో వైఫల్యాలను పక్కదారి పట్టించడానికే బీఆర్ఎస్​లాంటి పార్టీలు తెరమీదకొస్తున్నాయి. పాము కూసం వదిలినట్లుగా తెలంగాణ వాదాన్ని వదిలి జాతీయవాదం అనే ముసుగు ధరించడం కొత్తగా, ఆశ్చర్యంగా ఉంది. రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రం అని చెబుతున్న బీఆర్ఎస్​పార్టీ మేధావులు, నాయకులు ఏ రంగంలో ముందు ఉందనేది విడమర్చి చెప్పాలి? ఎందుకంటే, ఏ రంగం తీసుకున్నా, పాలనా వైఫల్యాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి.  తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయనుకున్న సబ్బండ వర్గాల ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి.

ఇదేనా కిసాన్​ సర్కారు?

దేశంలో గుణాత్మక మార్పు కోసమని గతంలోనే జాతీ య రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఖంగుతిన్నట్లు ఉన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, దేశంలో కిసాన్ సర్కార్ రావాలని చెప్పడం బాగానే ఉన్నది. ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేయడం ద్వారా ఎకరానికి కోటి రూపాయలు పండిస్తున్నానని గతంలో అన్నారు కదా! ఆ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయనట్టు? ఖమ్మంలో మిర్చి పంటకు మద్దతు అడిగినందుకు రైతుల చేతికి బేడీలు వేసిన ఘటన ప్రజలు మరిచిపోలేదు. రైతుబంధు పేరుతో భూస్వాములకు వందల ఎకరాలు ఉన్నవారికి ప్రజాధనాన్ని పంచడం దుర్వినియోగం చేసినట్టు కాదా? రైతు బంధు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారు కదా! మరి రైతు బంధు ఇస్తున్నా, రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగడం లేదు? రైతు బంధు ఇస్తున్నామని మిగిలిన వ్యవసాయ పథకాలన్నిటికి మంగళం పాడిన విషయం వాస్త వం కాదా? రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మరిచిపోయారు. రైతు వేదికలు నిరుపయోగంగా మిగిలాయి. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోతే రాష్ట్రంలో పంటల బీమా పథకం లేదు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీ మా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదు. వడ్ల కుప్పల మీద రైతు ఊపిరి ఆగిపోతే కనీసం పరామర్శించని ముఖ్యమంత్రి, మంత్రులు రైతుల సంక్షేమాన్ని కోరుకుంటున్నామని ఎలా చెప్పుకుంటారు? కిసాన్ సర్కార్ లక్ష్యం, ఆచరణ ఇదేనా?  తెలంగాణలో రైతుల ను గాలికి వదిలేసి, ఇక్కడి పౌరులు కట్టిన పన్నులను ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ఆదుకుంటామనే పేరుతో చెక్కుల రూపంలో ఇస్తోంది. ఆ చెక్కులు బౌన్స్ అవుతాయి. రేపు దేశంలో ఉన్న రైతులను ఇలాగే ఆదుకుంటారా?

బడులు తక్కువ -బార్ షాపులు ఎక్కువ..

రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య లేదని కొన్ని బడులను మూతపడేస్తున్న సర్కారు, ప్రతి గ్రామంలో వార్డుకు ఒక బెల్ట్ షాపును ప్రోత్సహిస్తున్నది. సర్కారు బడుల్లో చదివే ఆడపిల్లలకు కనీసం టాయిలెట్స్ లేకపోవడం విచారకరం. బార్లు, వైన్​షాపులను పెంచుతూ మద్యం అమ్మకాలను పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. బడులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ప్రతినెల 3వ తారీఖు లోపు జీతాలు వచ్చేవి. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో రోజుకొక జిల్లా, రెండు జిల్లాల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రేపు ఇదే పాలసీని దేశమంతటా అమలు చేస్తారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో  చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు. ఉపాధి దొరకదు. రాష్ట్రంలో ఒప్పంద  సేవలపై పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయరు. కేజీ టు పీజీ ఉచిత విద్య దేవుడు ఎరుగు, మంచి నాణ్యమైన భోజనం వసతుల కోసం విద్యార్థులు రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. బడులు మొదలై నెలలు గడుస్తున్నా బుక్స్, యూనిఫామ్​ పంపిణీ జరగదు. సర్కారు బడులన్నీ సార్లు లేకుండానే కొనసాగుతాయి. ఉద్యమానికి ఊపిరిలూదిన తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు నిధులు లేక, నియామకాలు లేక అధ్వాన స్థితిలో కొనసాగుతుంటే, ప్రభుత్వం మాత్రం ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు పచ్చజెండా ఊపుతుంది. 

వైద్య రంగంలో విఫలం

రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ దవాఖానలను బాగు చేయడంలో విఫలమైంది. ఆరోగ్యశ్రీ కార్డ్స్ పనిచేయక ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కొనలేక ప్రజలు ఆస్తులను అమ్ముకుంటున్నారు. నిమ్స్ ప్రధాన వైద్యాధికారికి గుండెపోటు వస్తే అపోలో ఆసుపత్రిలో వైద్యం కావాలి, సీఎం కేసీఆర్ కు పంటి నొప్పి వస్తే ఢిల్లీకి పోవాలి. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండరు. రాష్ట్రంలో నిర్దిష్టమైన వైద్య పాలసీ విధానమంటూ ఏదీ లేదు. ఇటీవలే జాతీయ ఆరోగ్య సర్వే నివేదిక ఇలాంటి అనేక విషయాలను బహిర్గతం చేసింది. అయినా ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇబ్రహీంపట్నం సర్కారు దవాఖానలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళలు ప్రాణాలు కోల్పోవడం శోచనీయం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులు కాళ్లు ఎలుకలు కొరకడం కన్న దారుణం ఇంకేముంటుంది? ఇలాంటి వాటన్నిటి పైనుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్​పేరుతో కొత్త డ్రామాలు మొదలయ్యాయి. దేశ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తే స్థానికంగా సులభంగా గెలవచ్చనేది వాళ్ల ఎత్తుగడ. జాతీయ మీడియాలో కవరేజ్ వచ్చినంత మాత్రాన వేరే రాష్ట్రం వాళ్లు పిలిస్తే వెళ్లినంత మాత్రాన ఎవరూ ఓటు వేయరు. అలా అయితే కమల్ హాసన్, ప్రకాశ్ రాజు, చంద్రబాబు వీళ్లు ఏండ్ల తరబడి అధికారంలో ఉండే వారే కదా! “పొలిటికల్ టూరిస్టులు రావచ్చు.. బిర్యానీ తిని ఇరానీ చాయ్ తాగి పోవచ్చు’’ అని మాట్లాడిన నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్​తో దేశంలో ఎట్లా తిరుగుతారు? తెలంగాణలో చెల్లని రూపాయి, దేశంలో ఎట్లా చెల్లుతుంది? ఇక్కడ ఇచ్చిన హామీలు విస్మరించి, దేశానికి వెళ్లి అక్కడేం చేయగలరు? తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణను తుడిచేసుకున్నప్పుడే.. తెలంగాణ తల్లితో కేసీఆర్​ పేగుబంధం తెంచేసుకున్నట్టు లెక్క.

- బెజాడి బీరప్ప, బీజేపీ నేత