మహిళా కోటా తేల్చకుండానే..ఉద్యోగ ప్రకటనలా? : కోడెపాక కుమార స్వామి

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం మహిళా రిజర్వేషన్​33.33 శాతాన్ని అధిగమించకుండా అమలు చేయనున్నారు. కానీ హైకోర్టు ఉత్తర్వుపై జీవో మాత్రం ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం మహిళా కోటాపై విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా  ప్రస్తుతం అనేక ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తున్నారు. కావున, అనేక మంది పురుష అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తూ కేసులు దాఖలు చేస్తున్నారు. ఫలితంగా నియామకాల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. 

ఏపీని ఆదర్శంగా తీసుకోవాలి

తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 2022లో 503 గ్రూప్-1 ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ప్రకటన జారీ చేసింది. అందులో మహిళలకు 225 (44%) నిలువు/వర్టికల్ పద్ధతిలో పోస్టులను కేటాయించారు. వాస్తవానికి మహిళా రిజర్వేషన్లలో మహిళలకు కేటాయించే పోస్టుల సంఖ్య  33.33 శాతానికి  మించకుండా ఉండాలి. అందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2016లో జీవో నెం. 40 ద్వారా మహిళా కోటాను  33.33శాతమే అమలు చేయాలని నిర్ణయం తీసుకొని, తదనంతరం 2018లో జీవో నెం 63 ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు సవరణ చేశారు. కానీ, నేటివరకు తెలంగాణ రాష్ట్రంలో అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు. అందుకు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హైకోర్టులో మహిళా రిజర్వేషన్లను ​ కోటా ప్రకారం మాత్రమే అమలు చేయాలని పిటిషన్ వేశారు. విచారణ అనంతరం హైకోర్టు సెప్టెంబర్ 23న కె. రోహిత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసు తీర్పులో తెలంగాణ ప్రభుత్వాన్ని గ్రూప్-1 ఉద్యోగాల నియామకాల్లో గతంలో 2007లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు తీర్పులో తెలిపినట్లుగా మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని మద్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మధ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్-1 ఉద్యోగాల నియామకాల్లో మహిళా రిజర్వేషన్​ కోటా ప్రకారంగా మాత్రమే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫలితంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ నుండి  మెయిన్స్ పరీక్షకు సుమారుగా 3 వేలకుపైగా ప్రతిభ కలిగిన పురుష అభ్యర్థులు అర్హత పొందనున్నారు.

సమాంతరాన్ని (33.33%)మించొద్దు

భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పుల ప్రకారం దేశంలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రెండు రకాలుగా చెప్పవచ్చు . వర్టికల్/నిలువు/సామాజిక రిజర్వేషన్లు ఇందులో ఆర్టికల్ 15(4), 15(5), 16(4), 16(6) ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాలు వస్తాయి.  సమాంతర/ హారిజాంటల్/ప్రత్యేక రిజర్వేషన్లు ఇందులో ఆర్టికల్ 15(3), 16(1), 16(2) ప్రకారం మహిళా, దివ్యాంగుల, స్పోర్ట్స్,  ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ మొదలగు కోటాలు వస్తాయి. రెండు రిజర్వేషన్లకు మధ్య తేడా ఏమనగా? వర్టికల్ రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యర్థులు వారికి కేటాయించిన రిజర్వేషన్లలో, ఓపెన్ కేటగిరిలో ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ పోస్టులకు మించి ఎంపిక కావచ్చు. అదే హారిజాంటల్ రిజర్వేషన్ అభ్యర్థులు వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతంలో, ఓపెన్ క్యాటగిరీలో ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించకూడదు.

అన్ని కేటగిరీల్లో కోటా 33.33% చేయాలి 

సుప్రీంకోర్టు తొమ్మిది మంది రాజ్యాంగ ధర్మాసనం 1992లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన మండల్ కమీషన్ తీర్పులో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలుచేయాలని సూచించింది. అయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997లో జీవో 65 ద్వారా మహిళలకు విద్యా ఉద్యోగాల్లో 33.33% వర్టికల్ రిజర్వేషన్లు అనే భావం వచ్చే విధంగా జారీ చేసింది. ప్రస్తుతం మహిళా 33.33%, ఎస్సీ 15%, ఎస్టీ 10%, బీసీ 29%, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు కలిపి మొత్తం వర్టికల్ రిజర్వేషన్లు 87.33% అవుతుంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, కోర్టు తీర్పులకు వ్యతిరేకమే అవుతుంది. వాస్తవానికి మహిళా రిజర్వేషన్లను ఓపెన్ కేటగిరిలో, ఎస్సీ,  ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాల్లో 33.33% సమాంతరంగా అమలు చెయ్యాలి. అట్లా అమలు చేయని కారణంగా మెరిట్ కలిగిన పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. ఇటీవల సమస్య తీవ్రతను గమనించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ 969 అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టుల భర్తీ విషయంలో ఉద్యోగ ప్రకటన సమయంలో మహిళలకు నిలువు/వర్టికల్ పద్ధతిలో పోస్టులను కేటాయించినప్పటికీ, గ్రూప్-1 పోస్టులకు సంబంధించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని న్యాయపరమైన సమస్యలు రాకుండా, మహిళా కోటాను సమాంతరంగా  33.33 శాతం పరిమితి మించకుండా మహిళలను ఎంపిక చేసి మిగతా పోస్టుల్లో ప్రతిభ కలిగిన పురుష  అభ్యర్థులను ఎంపికచేసి న్యాయం చేసారు.  

విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీపై హైకోర్టు మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా (33.33శాతం) అమలు చెయ్యాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన తర్వాత రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రిజర్వేషన్లపై అవగాహన వచ్చింది. నేడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ లెక్చరర్లు, గ్రూప్-2, గ్రూప్-3  తదితర నోటిఫికేషన్లపై పురుష అభ్యర్థులు హైకోర్టులో పిటీషన్లు వేస్తున్నట్లుగా సమాచారం. ఫలితంగా నియామకాల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ 2016లో జీవోను సవరించినట్లుగా.. విధానపరమైన నిర్ణయం తీసుకొని మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా ( 33.33శాతం దాటకుండా) అమలు చేసే విధంగా జీవోను జారీ చేసి, స్టేట్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలను సవరించి నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఉద్యోగాల భర్తీని నిర్దిష్ట కాలపరిమితితో పారదర్శకంగా పూర్తి చేయాలి.

పురుష అభ్యర్థులకు అన్యాయం

తెలంగాణ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించకుండా.. పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర సంస్థల ద్వారా ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తున్నది. ఉదాహరణకు కొన్ని ఉద్యోగ ప్రకటనలను పరిశీలిద్దాం. 8039 గ్రూప్-4 ఉద్యోగాలను ప్రకటించారు. ఇందులో 150 ఉద్యోగాలు మహిళలకు మాత్రమే చెందినవి, అవి పోను మిగిలిన 7882 ఉద్యోగాలు మహిళా, పురుష అభ్యర్థులకు కేటాయించారు. ఇందులో మహిళలకు సుమారు 4000 (50%) ఉద్యోగాలను కేటాయించారు. అంటే, సమాంతర 33.33శాతం కన్నా ఎక్కువ కేటాయించారు. అదేవిధంగా 783 గ్రూప్-2 ఉద్యోగాలను ప్రకటించారు. ఇందులో 412 (53%) ఉద్యోగాలను మహిళలకు కేటాయించారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్-ఏ విభాగంలో 170 ఉద్యోగాలను ప్రకటించగా, అందులో 96 (56%) పోస్టులను మహిళలకు కేటాయించారు. ఇదే విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్-బీలో 15 పోస్టులను ప్రకటించగా మహిళలకు 9 (60%) పోస్టులను కేటాయించారు. ఈ విధంగా అన్ని ఉద్యోగ ప్రకటనలను పరిశీలించినచో మహిళలకు రాజ్యాంగబద్ధంగా రావలసిన సమాంతర కోటా 33.33 శాతానికి బదులుగా 45 నుండి 60 శాతం నిలువుగా ఉద్యోగాలను కేటాయిస్తున్నారు. 

- కోడెపాక కుమార స్వామి, అధ్యక్షులు, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం