గుడ్ న్యూస్: దసరాకు మరో రెండు స్కీమ్​లు అమలుకు సర్కార్ రెడీ

గుడ్ న్యూస్: దసరాకు మరో రెండు స్కీమ్​లు అమలుకు సర్కార్ రెడీ
  •   అమలుచేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్
  •   ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ.5 లక్షలు
  •   రైతుభరోసా కింద ఎకరానికి రూ.7,500 సాయం
  •   గైడ్​లైన్స్​పై తుదిదశకు చేరిన కసరత్తు
  •   రైతు కూలీలకు సాయంపై త్వరలోనే గైడ్​లైన్స్​

హైదరాబాద్, వెలుగు: అభయ హస్తం హామీలను రాష్ట్ర సర్కార్ ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొస్తున్నది. దసరా వరకు మరో రెండు స్కీములను పట్టాలు ఎక్కించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఆర్థిక సాయం ఒకటి కాగా.. రైతు భరోసా కింద ఎకరానికి రూ.7,500 పెట్టుబడి మరొకటి. ఈ రెండు స్కీమ్​లకు అవసరమైన నిధులు, లబ్ధిదారుల ఎంపికకు కావాల్సిన విధివిధానాలపై కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయంపై కేబినేట్ నుంచి గ్రీన్​సిగ్నల్​ వచ్చింది. ఈ స్కీమ్ కింద ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇండ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4.50 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్లను వెరిఫై చేసేందుకు అనుమతి కోరుతూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు ఫైల్ వెళ్లింది. ఇక రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి.. రైతులు, రైతు సంఘాలు, కూలీలు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. త్వరలోనే మార్గదర్శకాలు రిలీజ్ చేసి అక్టోబర్​లో రైతు భరోసా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో పాటు రైతు కూలీలకు ఇచ్చే ఆర్థిక సాయంపైనా కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం బడ్జెట్​లో ఫండ్స్ కేటాయించారు.  

జాగా లేనోళ్లకు ఇంటి స్థలంతో పాటు రూ.5లక్షలు

దసరా నాటికి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో లబ్ధిదారుల ఎంపికకు ఆఫీసర్లు గైడ్​లైన్స్​ రూపొందిస్తున్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేవాళ్లకు రూ.5లక్షల ఆర్థికసాయం అందజేస్తారు. సొంత జాగా లేనివాళ్లకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షల సాయం ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష అదనంగా రూ.6 లక్షలు అందజేస్తారు. నిర్మాణాన్ని బట్టి విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల సాయం అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. గత మార్చి 11న ప్రభుత్వం భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కింద రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించగా, ఇందిరమ్మ ఇండ్ల కోసం 55 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. సీఎం రేవంత్ నుంచి గ్రీన్​సిగ్నల్ రాగానే గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. కాగా, ఇందిరమ్మ ఇంటిని కుటుంబంలోని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించిన తర్వాత సమీక్షించి ఫైనల్ చేస్తారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులను జిల్లాల్లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో అయితే కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి. ఇప్పటికే పీఎం ఆవాస్ కింద ఈ ఏడాది 9 లక్షల ఇండ్ల కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. కేంద్రం నుంచి ఎన్ని ఇండ్లకు అనుమతి రానుందో వివరాలు వస్తే.. ఈ స్కీం ఇంకా స్పీడ్ ​అందుకోనుంది.

రైతు భరోసా.. 10 ఎకరాలకు సీలింగ్!

గత ప్రభుత్వం రైతుబంధు కింద సాగులో లేని భూములకు సైతం పెట్టుబడి సాయం అందించింది. గుట్టలు, హైవేలు, రాళ్లు రప్పలున్న భూములు, వెంచర్లకు సైతం రైతుబంధు ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. దీంతో భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.24 వేల కోట్లు అనర్హుల ఖాతాల్లోకి వెళ్లినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీలో వెల్లడైంది. దీంతో రైతుబంధు స్థానంలో తెస్తున్న రైతు భరోసా స్కీమ్ విధి విధానాలను మార్చాలని రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్​కమిటీ రైతుల నుంచి నేరుగా అభిప్రాయ సేకరణ చేసింది. మెజారిటీ రైతులు, వివిధ వర్గాల ప్రజలు, మేధావులు.. రైతుబంధును 10 ఎకరాలకు పరిమితం చేయాలని సూచించారు. కొన్నిచోట్ల 7 నుంచి 8 ఎకరాల వరకు ఇస్తే చాలని చెప్పారు. ప్రభుత్వం మాత్రం 10 ఎకరాలకు సీలింగ్ పెట్టబోతోందని ఉన్నతవర్గాల ద్వారా తెలిసింది. అదే సమయంలో హైవేలు, రోడ్లు, గుట్టలు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్​కు ఎట్టిపరిస్థితుల్లో రైతుభరోసా ఇవ్వకూడదని ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ప్రజా ప్రతినిధులకు, ఐఏఎస్​లకు, ఇతర ఉద్యోగులకు (గ్రూప్ 4 మినహా) పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే ఎకరాకు రూ.7,500 చొప్పున కనీసం రూ.7 వేల కోట్ల మేర రైతు భరోసా కింద పంపిణీ చేసేందుకు సిద్ధమైన సర్కారు, ఈ మేరకు ఫండ్స్ రెడీ చేసుకుంటున్నది. దసరా కల్లా నిధుల సేకరణ కొలిక్కి వస్తుందని భావిస్తున్నది. పండుగ సందర్భంగా ఈ స్కీమ్​లను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు చెప్తున్నాయి.