కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఈ సీజన్ నుంచే కనీస మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాల్ కు రూ.500 బోనస్ అదనంగా చెల్లిస్తోంది. లేటెస్ట్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రాంతంలో కొందరు రైతులకు సన్న వడ్లకు రూ. 500 బోనస్ అకౌంట్లో పడింది. 46 క్వింటాళ్ల 80 కిలోల సన్న వడ్లు అమ్మిన రైతుకు తన ఖాతాలో బోనస్ రూ. 23,400 పడ్డాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చే బోనస్ వల్ల రైతుకు అదనపు ఆదాయం వస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సన్నొడ్ల దిగుబడి అంచనా 93.33 లక్షల టన్నులు..
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడంతో సన్న రకాల ధాన్యం మార్కెట్లోకి పోటెత్తుతోంది.ఈ వానాకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గతానికి భిన్నంగా దొడ్డు వడ్ల సాగు తగ్గి, సన్న వడ్ల సాగు భారీగా పెరిగింది. సన్నాలకు సర్కార్ రూ.500 బోనస్ ప్రకటించడంతో వీటి సాగు గతంతో పోలిస్తే ఏకంగా 61 శాతం పెరిగింది. పోయినేడు వానాకాలంలో వరి సాగు విస్తీర్ణంలో సన్నాల వాటా 25.05 లక్షల ఎకరాలు (38 శాతం) ఉంటే.. ఈ సారి అది 40.44 లక్షల ఎకరాలకు (61 శాతం) పెరిగింది.
ఇక పోయినేడు వానాకాలంలో 40.89 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లు సాగైతే, ఈసారి అది 26.33 లక్షల ఎకరాలకు తగ్గింది. సాగు గణనీయంగా పెరగడంతో దిగుబడిలోనూ సన్న ధాన్యం రికార్డులు సృష్టిస్తున్నది. ఈ యేడు సన్న వడ్ల దిగుబడి దాదాపు 93.33 లక్షల టన్నులు ఉంటుందని వ్యవసా య శాఖ అంచనా వేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు ఏ మిల్లు చూసినా, ఏ కొనుగోలు సెంటర్ చూసినా సన్న వడ్ల రాసులే కనిపిస్తున్నాయి. వడ్ల కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 సెంటర్లు ఏర్పాటు చేసింది సర్కార్. కనీస మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ ఇస్తోంది ప్రభుత్వం.