ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కడ్తోంది..కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు ఫిర్యాదు

  • ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలతోనే ఫిర్యాదు

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమ ప్రాజెక్టులు కడుతోందని కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు కంప్లైంట్ చేసింది. ఏపీ ఇరిగేషన్‌‌ ఈఎన్సీ నారాయణరెడ్డి సోమవారం కృష్ణాబోర్డు మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురేకు ఈ మేరకు లెటర్​ రాశారు. ఇప్పటికే కృష్ణానదిపై తెలంగాణ పలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటికితోడు కొత్తగా మరో 10 లిఫ్ట్​ ఇరిగేషన్​పథకాలను చేపట్టిందని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో ఆయా ప్రాజెక్టులు చేపట్టేందుకు జారీ చేసిన జీవోలను ఆ కంప్లైంట్​లో ప్రస్తావించారు. పులిచింతల ఫోర్‌‌ షోర్‌‌ లోని బుగ్గమందారం, అమరావరం, రేవూరు, చింతలపాలెం, ఎర్రగట్టుతండా, చౌటుపల్లి లిఫ్ట్​ పథకాలు, జూరాల నుంచి జూరాల– పాకాల వరద కాల్వ, మూసీ నదిపై సూర్యపహాడ్‌‌ లిఫ్ట్, రేలంపాడు రిజర్వాయర్‌‌పై గట్టు ఎత్తిపోతల పథకం, కోయిల్‌‌సాగర్‌‌ పై లిఫ్ట్‌‌ ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా చేపట్టిందని పేర్కొన్నారు. వీటిలో కోయిల్‌‌సాగర్‌‌, గట్టు, సూర్యపహాడ్‌‌ లిఫ్ట్‌‌లు మినహా మిగతా పథకాలు ఉమ్మడి ఏపీలోనే చేపట్టినవి కావడం గమనార్హం. జూరాల– పాకాల వరద కాల్వ నిర్మాణం ప్రతిపాదనను రాష్ట్ర సర్కారు దాదాపు విరమించుకుంది. 2015లో ఈ స్కీం చేపట్టాలనుకున్నా.. డిండి లిఫ్ట్‌‌ ప్రతిపాదన రావడంతో పక్కన పెట్టారు.

పాత కంప్లైంట్‌‌ను గుర్తు చేసిండ్రు

కృష్ణా నదిపై శ్రీశైలం డ్యాంకు ఎగువన తెలంగాణ చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, తుమ్మిళ్ల లిఫ్ట్‌‌ స్కీంలు, మిషన్‌‌ భగీరథ (కృష్ణా), కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు, ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌ ప్రాజెక్టుల విస్తరణపై గతంలోనే ఫిర్యాదు చేశామని ఏపీ ప్రభుత్వం తరపున ఈఎన్సీ తమ ఫిర్యాదు​లో పేర్కొన్నారు. వాటితోపాటు తెలంగాణ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ టెక్నికల్‌‌ అప్రైజల్‌‌, అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనుమతులు లేవన్నారు. ఈ ప్రాజెక్టుల పనులు చేపట్టకుండా తెలంగాణను ఆదేశించాలని, తగిన చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో కోరారు.

సదరన్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌కు ఎజెండా పంపండి

సదరన్‌‌ జోనల్‌‌ కౌన్సిల్‌‌ సమావేశానికి ఎజెండా పంపాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కృష్ణా బోర్డు కోరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురే సోమవారం లెటర్‌‌‌‌ రాశారు. మార్చి 4న తిరుపతిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌‌ షా అధ్యక్షతన సదరన్‌‌ జోనల్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌ నిర్వహిస్తున్నారు. సదరన్‌‌ స్టేట్‌‌ల సీఎంలు, సీనియర్‌‌ ఆఫీసర్లు మీటింగ్‌‌లో పాల్గొంటారు. కృష్ణా నది పరిధిలోని ప్రాజెక్టులు, ఇతర అంశాలకు సంబంధించిన ఎజెండా వీలైనంత త్వరగా పంపాలని లెటర్‌‌‌‌లో సూచించారు.

ఇవి కూడా చదవండి 

వామన్​రావును చంపేందుకు 10 నెలల కిందే ప్లాన్

లాయ‌ర్ కారును వెంటాడి ఢీకొట్టిన లారీ.. 500 మీటర్ల దూరం వ‌ర‌కు లాక్కెళ్లింది

మన హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్

పతంజలి కొరొనిల్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్న WHO