- జోరుగా అక్రమ రవాణా.. పట్టించుకోని ఆఫీసర్లు!
భద్రాచలం, వెలుగు : అధికారుల నిర్వాకంతో తెలంగాణ సర్కారు భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. భద్రాచలం శివారులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ఎటపాక మండలం గుండాల ర్యాంపు నుంచి నిత్యం ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. కూనవరం రోడ్డులోని టీఎస్ఎండీసీ చెక్‌పోస్టును ఎత్తేయడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రాత్రి, పగలు తేడా లేకుండా తెలంగాణకు ఆంధ్రా ఇసుకను తెచ్చి అమ్ముకుంటున్నారు. మూడు రోజుల నుంచి ఆంధ్రాలోని గుండాల ఇసుక ర్యాంపును తెరిచి గోదావరిలోకి నేరుగా జేసీబీలను తీసుకెళ్లి ట్రాక్టర్లు, టిప్పర్లలో లోడింగ్ చేస్తున్నారు.
రెచ్చిపోతున్న ఆంధ్రా ఇసుక కాంట్రాక్టర్లు!
తెలంగాణలోని ఇసుక ర్యాంపులు ఇటీవల మూతపడ్డాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక అదనపు బకెట్ల వ్యవహారంపై దృష్టి సారించి చెక్‌పెట్టడంతో కాంట్రాక్టర్లు అమ్మకాలు నిలిపేశారు. ఇదే అదనుగా ఆంధ్రా ఇసుక కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. జేసీబీలతో ఇసుక లోడ్ చేసి తెలంగాణలోకి పంపుతున్నారు. టిప్పర్ రూ.25వేలు, ట్రాక్టర్రూ.4వేలు చొప్పున ఇసుకను అమ్మి జేబులు నింపుకుంటున్నారు. ముందుగానే ఆఫీసర్లకు మామూళ్లు ముట్టజెప్పి సైలెంట్‌గా అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు.
వే బిల్లులు తప్పనిసరి.. కానీ!
పక్క రాష్ట్రాల నుంచి ఇసుక తెలంగాణలోకి రావాలంటే టీఎస్ ఎండీసీ వే బిల్లులు తప్పనిసరి. ఆంధ్రా నుంచి వచ్చే ఇసుక వాహనాలకు ఎలాంటి వే బిల్లులు లేవు. దీంతో తెలంగాణ సర్కారుకు రాయల్టీ రావడం లేదు. టన్నుకు రూ.250 తెలంగాణకు ఇంటర్ స్టేట్ రాయల్టీ వస్తుంది. కాగా ఆంధ్రా ఇసుక పాలసీలో పక్క రాష్ట్రాలకు ఇసుక అమ్ముకోకూడదనే నిబంధన ఉంది. కానీ ఈ నిబంధనను పక్కన పెట్టి తెలంగాణలోకి ఇసుకను తీసుకొస్తున్నారు. టిప్పర్లను ఆంధ్రాలోని కన్నాయిగూడెం వరకు తీసుకెళ్తున్నారు.
రోజుకు 100 టిప్పర్లు, 200 ట్రాక్టర్లు..
కన్నాయిగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారు. రోజుకు 100 టిప్పర్లు, 200 ట్రాక్టర్ల ఇసుక తెలంగాణ మీదుగా అక్రమంగా వెళ్తోంది. టీఎస్ఎండీసీ, రెవెన్యూ, పోలీసు ఆఫీసర్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా పోలీసుల ఆదేశాలతోనే ఇసుకను ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్తున్నట్లుగా కాంట్రాక్టర్లు చెప్తున్నారు. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు కూడా ఇసుకను ఆంధ్రా నుంచి అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా తరలించుకుపోతుంటే ఆఫీసర్లు మాత్రం చూసీచూడనట్లుగా ఉంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గడువు ముగుస్తోంది.. ఇసుక ర్యాంపులు తెరిచేదెప్పుడో..?
ఏజెన్సీలో పీసా చట్టం ప్రకారం గిరిజన సొసైటీలు ఇసుక తవ్వకాలు జరుపుకునేందుకు కేంద్రం నుంచి వచ్చిన పర్యావరణ అనుమతుల గడువు మే, జూన్ నెలల నాటికి ముగుస్తుంది. కానీ నేటికీ అనుమతులు తీసుకున్న సొసైటీలు ఇసుక ర్యాంపులు ఓపెన్ చేసుకునేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీల నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ నేపథ్యంలో భద్రాద్రికొత్తగూడెంలోని భద్రాచలం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో 11, ములుగులో కలిసిన నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో 7 గిరిజన ఇసుక సొసైటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జీవో నంబర్ 38, 3 పీసా చట్టం ప్రకారం సొసైటీలు ఇసుక ర్యాంపులు నిర్వహించుకునేందుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాలి.
గోదావరిలో ఇసుకను తోడాలంటే ఇవి తప్పనిసరి. లక్ష క్యూబిక్ మీటర్ల చొప్పున ఇసుకను తోడుకునేందుకు ఈ సొసైటీలు మైనింగ్, గ్రౌండ్ వాటర్ లెవల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు జాయింట్ సర్వే చేసి కలెక్టర్‌కు నివేదికలు ఇచ్చాయి. జిల్లా స్థాయి ఇసుక కమిటీలో కలెక్టర్ ఈ నివేదికల ఆధారంగా పర్మిషన్లు ఇస్తే వాటి ఆధారంగానే పర్యావరణ అనుమతి వస్తుంది. కానీ ఇప్పటి వరకు కారణం చెప్పడం లేదు. పర్మిషన్ ఇవ్వడం లేదు. ఎన్నికలకు ముందు అధికారులు ఉరుకులు.. పరుగులు పెట్టించి, ఇప్పుడేమో మౌనంగా ఉంటున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫైనల్ పర్మిషన్ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ను గ్రీవెన్స్ ల్లో సొసైటీ సభ్యులు కలిసి కోరుతున్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చే ఇసుక అక్రమ రవాణాను ఆరికట్టాలి. భద్రాచలంలో ఇసుక ర్యాంపు లేకపోవడంతో బోర్డర్లో ఉన్న ఆంధ్రా నుంచి రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక తీసుకెళ్లి బ్లాక్‌లో అమ్ముతున్నారు. జిల్లాలో ఇసుక ఉన్నా అనుమతులు లేకపోవడంతో ఇది అక్రమార్కులకు వరంగా మారింది.
ముద్దా పిచ్చయ్య, భద్రాచలం
ఇంటర్ స్టేట్ అనుమతుల్లేవు
ఆంధ్రా ర్యాంపుల నుంచి ఇసుక రవాణా చేసేందుకు ఇంటర్ స్టేట్ అనుమతుల్లేవు. అలా తీసుకొస్తే అక్రమమే. టీఎస్ఎండీసీ నిబంధనల ప్రకారం పరిశీలిస్తాం. పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం. అక్రమ రవాణాను అడ్డుకుంటాం.
శ్రీనివాస్, పీవో, టీఎస్ఎండీసీ