మే నెలాఖరులోగా స్కూళ్లకు పుస్తకాలు.. సర్కారీ స్టూడెంట్ల కోసం1.41 కోట్ల పుస్తకాలు

మే నెలాఖరులోగా స్కూళ్లకు పుస్తకాలు.. సర్కారీ స్టూడెంట్ల కోసం1.41 కోట్ల పుస్తకాలు
  • సర్కారీ స్టూడెంట్ల కోసం1.41 కోట్ల పుస్తకాలు
  • జిల్లాలకు పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ షురూ
  • ఇప్పటికే 25 శాతం బుక్స్ జిల్లాలకు చేరిక
  • వచ్చే నెల 10 నాటికి మొత్తం పుస్తకాలు చేరేలా చర్యలు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో సర్కారు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు.. స్కూళ్ల రీఓపెన్ రోజే పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి  అనుగుణంగా ప్రింటింగ్ ప్రక్రియను స్పీడప్ చేసింది. మే  నెలాఖరులోగా అన్ని స్కూల్ పాయింట్లకు అవసరమైన పుస్తకాలను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప్రింట్ అయిన పుస్తకాలను దశలవారీగా జిల్లా కేంద్రాల్లోని గోదాములకు సరఫరా చేసే పనులు మొదయ్యాయి.

రాష్ట్రంలో సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకులాలు.. తదితర ప్రభుత్వ విద్యాసంస్థల్లో మొత్తం 24.43 లక్షల మంది చదువుతున్నారు. వాటిలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివే  విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలను సరఫరా చేస్తున్నది. సర్కారు ఆదేశాలతో వచ్చే విద్యాసంవత్సరం 2025–26 ప్రారంభం నాటికే బడుల్లో పుస్తకాలు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

విద్యార్థులందరికీ సుమారు 1.41 కోట్ల పుస్తకాలు అవసరం. ఇప్పటికే ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.  మే నెలాఖరులోగా పుస్తకాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

జిల్లాలకు 34 లక్షల పుస్తకాలు

జిల్లాల ఇండెంట్లకు అనుగుణంగా  పుస్తకాలను పంపిణీ చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఏటా మే మొదటి వారంలో జిల్లాలకు పుస్తకాలను పంపించేవారు. కానీ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంబంచారు. మొత్తం 1.41 కోట్ల పుస్తకాలకు గానూ, ఇప్పటికే 34.36  లక్షల పుస్తకాలు జిల్లాలకు చేరాయి. అక్కడి నుంచి స్కూల్ పాయింట్లకు చేరాల్సి ఉంది. ముందుగా దూరప్రాంతాల్లోని జిల్లాలకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, నారాయణపేట, నిజామాబాద్ తదితర సుమారు 10 జిల్లాలకు 30శాతానికిపైగా పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరాయి.  

మే 10లోగా అన్ని జిల్లా కేంద్రాలకు పుస్తకాలు చేర్చేలా ప్లాన్ రెడీ చేశారు. మే 30 నాటికి రాష్ట్రంలోని ప్రతి స్కూల్ పాయింట్ కు అన్ని పుస్తకాలు చేర్చాలని డిసైడ్ అయ్యారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పాయింట్లకు చేరిన తర్వాత అక్కడి నుంచి మండల పాయింట్లకు అటు నుంచి స్కూల్ పాయింట్లకు పుస్తకాలను చేరవేయనున్నారు. మండలం, జిల్లా విద్యార్థుల ఇండెంట్లకు అనుగుణంగా పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. కాగా, జూన్ మొదటి వారంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నది. ఈ క్రమంలోనే విద్యార్థులకు పుస్తకాలు అందించేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. ప్రజాప్రతినిధుల చేత పిల్లలకు పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేస్తోంది.