సుడాను పట్టించుకోరా .. పాలకవర్గం లేక 16 నెలలు

 సుడాను  పట్టించుకోరా .. పాలకవర్గం లేక 16 నెలలు
  • ఆఫీసర్ల పనితీరుపై ప్రభావం..  ఖజానాకు గండి
  • ఎల్ఆర్ఎస్​ ఫీజు వసూళ్లలోనూ వెనుకంజ 

ఖమ్మం, వెలుగు:  స్తంభాద్రి అర్బన్​ డెవలప్​ మెంట్ అథారిటీ (సుడా)కి కొత్త పాలకవర్గ నియామకం వ్యవహారం ప్రభుత్వానికి పట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలు అవుతున్నా ఇంత వరకు కొత్త కమిటీని ప్రకటించలేదు. దీంతో సుడా పాలన వ్యవహారాల్లోనే కాదు, ఖజానాపైనా దీని ప్రభావం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెలాఖరు వరకు ఎల్ఆర్​ఎస్​ ఫీజు పూర్తిగా కట్టిన వారికి 25 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సుడా పరిధిలో ఉన్న దరఖాస్తుదారులకు అవగాహన కల్పించాల్సి ఉండగా, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. 

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ పరిధిలో ఎల్ఆర్ఎస్​ కు మంచి స్పందన కనిపిస్తుండగా, సుడా లిమిట్స్ లో మాత్రం దరఖాస్తుదారుల్లో ఒక్క శాతం లోపు మాత్రమే డబ్బులు కట్టారు. మొత్తం 34,045 మంది దరఖాస్తు చేసుకోగా, ఎల్ఆర్​ఎస్ నగదు చెల్లించేందుకు 7,997 దరఖాస్తులు అర్హత పొందాయి. వాటిలో ఇంత వరకు కేవలం 250 మంది వరకు మాత్రమే ఫీజులను చెల్లించారు. పాలకవర్గం ఉంటే సుడా పరిధిలోని మండలాల వారీగా మీటింగ్ లు పెడుతూ, దరఖాస్తుదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉండేది. కానీ సుడా అధికారులు కేవలం ఆఫీసులకే పరిమితం అవుతుండడంతో ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా గండిపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

సుడా స్వరూపం ఇదీ..!

2017 అక్టోబర్​ లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, వైరా మున్సిపాలిటీ​తో పాటు వైరా, పాలేరు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు మండలాల్లోని 46 గ్రామాలను కలుపుతూ 570 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో సుడాను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటుచేసిన పాలకవర్గాన్ని రద్దు చేశారు. ఆర్నెళ్ల కింద సుడా పరిధిని మరింతగా విస్తరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలను కవర్​ చేస్తూ మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలు, 17 మండలాల్లోని 279 గ్రామాలను సుడా పరిధిలోకి తీసుకువచ్చారు. 

జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలున్న కామేపల్లి, ఏన్కూరు, కారేపల్లి మండలాలను మినహాయించారు. ఇప్పుడు జిల్లాలోని మొత్తం ఐదు నియోజకవర్గాల్లో సుడా విస్తరించి ఉండడంతో చైర్మన్​ పదవితోపాటు డైరెక్టర్​ పోస్టులకు డిమాండ్​ పెరిగింది.  ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు కూడా సుడా చైర్మన్​ రేసులోకి వచ్చారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్​ పోస్టులను కోరుకుంటున్న లీడర్లు కూడా ప్రస్తుతం సుడా పీఠంపై కన్నేశారు. పదుల సంఖ్యలో నాయకులు దీనిపై ఆశలు పెట్టుకున్నా, నెలలు గడిచిపోతున్నా ఎవరికీ ఆ పదవీ భాగ్యం మాత్రం దక్కడం లేదు. 

సుడా పీఠం ఆయనకేనా?

గతంలో కంటే మరింత ఎక్కువగా సుడా పరిధిని జిల్లా వ్యాప్తంగా విస్తరించడంతో చైర్మన్​ పీఠం హాట్ సీట్ అయ్యింది. సుడా పరిధిలో జరిగే రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు, ప్రధానంగా రియల్​ ఎస్టేట్​ వెంచర్లు, లే అవుట్ల అనుమతుల విషయంలో పాలకవర్గం పాత్ర కీలకంగా ఉంటుంది. దీనితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ఉంటుంది. ప్రస్తుత జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్​, లీడర్లు సాదు రమేశ్​రెడ్డి, కమర్తపు మురళి, మానుకొండ రాధాకిషోర్, మహ్మద్​ జావెద్, మిక్కిలినేని నరేందర్, మట్టా దయానంద్ తో పాటు మరికొందరు సుడా చైర్మన్​ పీఠాన్ని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.

 డీసీసీ​ అధ్యక్షుడు దుర్గాప్రసాద్​కు పదవి ఖాయమైందని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిఫారసు మేరకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓకే చేసినట్టు చర్చ నడుస్తోంది. ముగ్గురు మంత్రుల మధ్య ఏకాభిప్రాయం వచ్చినట్టు చెబుతున్నా ఇంతవరకూ పూర్తి స్థాయి కమిటీని ప్రకటించకపోవడం వెనుక కారణం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.