రాష్ట్ర బడ్జెట్​లో రైతు ఉన్నడా? : ప్రొ.చిట్టెడ్డి కృష్ణా రెడ్డి

రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి శాస్త్ర సాంకేతిక రంగాల, మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని చెప్తున్నా,  జనాభాలో ఎక్కువ శాతం ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాలను జోడించి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచే ప్రయత్నాలు చేయడం లేదు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను కట్టామంటున్న సర్కారు.. అంది వచ్చిన నీటి వనరుల ద్వారా రాబడి ఇవ్వగలిగిన పంటలను ప్రోత్సహించకపోవడం, పంట మార్పిడి విషయాలపైన అవగాహన కల్పించకపోవడం తొమ్మిదేళ్లుగా కనిపిస్తూనే ఉన్నది. రైతు ఎదుర్కొంటున్న మార్కెటింగ్ వ్యవస్థ కష్టాలకు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఈ మార్కెటింగ్ సౌకర్యాలను   అందుబాటులోకి తెచ్చే కృషి జరగడం లేదు. వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలను చిన్న, మధ్య పట్టణాలకు విస్తరించి, రైతులకు సరైన మద్దతు ధర లభించేలా కృషి చేయకపోవడం, పంటల్లో నాణ్యమైన ఉత్పత్తి రావడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయకపోవడం కొనసాగుతున్నది. దీంతో ఔత్సాహికులైన యువకులు వ్యవసాయ ఆధారిత అప్లికేషన్స్ కానీ, సాఫ్ట్ వేర్ సంబంధిత అభివృద్ధిని గానీ చేయలేకపోతున్నారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో కొత్తపుంతలు తొక్కించడానికి పట్టణాల్లో టీహబ్​లు ఎంత ప్రాముఖ్యమో, అంతకన్నా వ్యవసాయ రంగానికి సంబంధించిన ‘వ్యవసాయ హబ్​లు’ ఏర్పాటు చేసి ఆర్థికంగా, సాంకేతికంగానూ సాయం చేయడం అంతే అవసరం. అలా చేస్తే యువతరం వ్యవసాయ రంగ సమస్యలకు పరిష్కారాలను కనుక్కుంటారు. కృత్రిమ మేధ ఆధారంగా వస్తున్న సంస్థలకు ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత సంస్థలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నట్టు కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు. దానికి కొనసాగింపుగా రాష్ట్ర బడ్జెట్​లో కూడా మరిన్ని చర్యలు చేపట్టి ఉంటే రైతుల ఆదాయం పెంచడానికి అవకాశం ఉండేది. వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు రాకుండా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్న  రైతుల ఆదాయాన్ని పెంచడం నీటిమీద రాతలు, మాటలు మూటలుగానే మిగిలిపోతాయి.

హామీల ఎగవేత, రైతుకు గుండె కోత

ఏటా బడ్జెట్ సమయంలో వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న రైతన్నకు పెద్ద నిరాశే ఎదురవుతున్నది. రైతుల రుణమాఫీకి కేవలం రూ.6,375  కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 90 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామని తాజా బడ్జెట్​లో  పేర్కొంది. కానీ నాలుగేండ్ల నుంచి రుణ మాఫీ పూర్తిగాక లక్ష అప్పు తీసుకున్న రైతుల బాకీ వడ్డీతో కలిపి రూ.1,70,000 పైచిలుకు పెరిగింది. మాఫీ జరగకపోవడంతో రైతుకు అప్పు భారం తగ్గలేదు. సాధారణంగా రైతులు ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొన్నా, రుణాలను బాధ్యతగా తీర్చడానికి కృషి చేస్తుంటారు. సకాలంలో చెల్లించడం ద్వారా రైతులకు బ్యాంకుల నుంచి మళ్లీ పంట పెట్టుబడికి అప్పు పుడుతుంది. కానీ పాలకులు చేతగాని హామీలు ఇచ్చి,  రైతులను రుణగ్రస్తులను చేసి, మాఫీ చేయక డిఫాల్టర్లను చేసి వారిని బ్యాంకుల ముందు దోషులుగా నిలబెడుతున్న విధానం కొనసాగుతున్నది. రైతులను రుణ ఎగవేతదారులుగా చూపించే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తున్నట్టు కనిపిస్తుంది. బహుశా ఇలాంటి  దుర్భరమైన పరిస్థితి భారతదేశంలోని ఏ రైతుకు ఉండదేమో. ఒకవైపు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం ఇస్తున్నామని పాలకులు గొప్పగా చెప్పుకుంటుంటే, ఇస్తున్న దాంట్లో సింహభాగం రుణాలకు వడ్డీలు చెల్లించడానికి సరిపోతుందని రైతులు వాపోతున్నారు. రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం రైతు రుణ సమస్యను తీర్చకుండా రైతులను మభ్యపెడుతూ పబ్బం గడుపుతుండటం బాధాకరం.

ఎగవేతదారులు రైతులా? ప్రభుత్వమా? 

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకంగా ప్రచారం చేసుకున్న  రైతుబంధు కూడా అన్నదాతల ఆత్మహత్యలను ఆపడంలో విఫలమవుతున్నది. తెలంగాణ రాష్ట్రం  దేశంలోనే  ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి చెపుతుండగా, సామాన్య రైతు మాత్రం కనీస అవసరాలు తీర్చుకోలేక, అధిక రుణభారాలతో ఎవుసం చేయలేక కాడి వదిలేస్తున్నాడు. ఇంతటి సమస్యాత్మకమైన అంశాన్ని పాలకులు గుర్తించకపోవడం, దీనిపై సరైన అధ్యయనం చేయకపోవడం విచారకరం. బ్యాంకుల ముందు రాష్ట్ర  రైతాంగాన్నే రుణ ఎగవేతదారులుగా ముద్ర వేయించి, వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన బ్యాంకు రుణాలకు రైతులను శాశ్వతంగా దూరం చేస్తుడటం అత్యంత దారుణమైన అంశం.  భూ రికార్డులు సరిగ్గా లేకపోవడం, సరిహద్దులను నిర్ణయించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్ల రైతుల మధ్య తీవ్ర ఘర్షణలే జరుగుతున్నాయి. సమగ్ర భూ సర్వే చేస్తామని గతంలో సీఎం ప్రకటించినప్పటికీ అందుకు కావాల్సిన నిధులను ఈ బడ్జెట్ లో కూడా కేటాయించలేదు. ధరణి పోర్టల్ తెచ్చి వ్యవసాయ భూములను డిజిటల్ రూపంలో అన్ని రికార్డులను భద్రపరుస్తామని చెప్పి, దాన్ని అనేక సమస్యలకు నిలయంగా మార్చి రైతులకు మనశ్శాంతి లేకుండా చేశారు. 

కేటాయింపులేవి ?

రైతులందరికీ నాణ్యమైన ఎరువులను,  విత్తనాలు, క్రిమిసంహారక మందులను ప్రభుత్వమే అందించి, ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచి రైతులను లాభదాయకతను పెంచుతామని ప్రకటనలు చేసినప్పటికీ, తాజా బడ్జెట్​లో ఆ దిశగా నిధుల కేటాయింపులు లేవు. పంటల మార్పిడి విషయంలో సరైన సమాచారం లేక, గిట్టుబాటు ధర రాక రైతాంగం అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నది. భూసార పరీక్షల విషయంలో, పంటల బీమా విషయంలో  బడ్జెట్​లో ప్రస్తావనే లేదు. తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం తప్ప  బడ్జెట్​కేటాయింపుల్లో రైతు అవసరాలు ఎక్కడా పెద్దగా లేవు. ఇప్పటికైనా వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మార్చడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే సంస్థలకు ప్రోత్సాహకాన్ని, వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే మౌలిక వసతులను కల్పించాలి.  రైతులో తెలంగాణను చూడటం నేర్చుకుంటే, బడ్జెట్​లో రైతు కనిపించేవాడు!

మూస ధోరణి ఎంతకాలం?

పామాయిల్ సాగుకు జరిపిన ప్రోత్సాహం  స్వాగతించదగినదే కానీ, తృణధాన్యాల అవసరం, డిమాండు ఎంతో ఎక్కువగా ఉన్న నేటి కాలంలో ప్రభుత్వం దానికి తగినంత ప్రోత్సాహకాలను ప్రకటించలేదు. ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం జోడించడం ముమ్మరంగా జరుగుతున్న ఈ సమయంలో ఆ దిశగా ఏ రకమైన కేటాయింపులు లేకపోవడంతో తెలంగాణ వ్యవసాయం మూస ధోరణిలోనే సాగుతున్నది. రైతులకు పంటల మార్పిడి, కమర్షియల్ పంటలపై అవసరమైన ప్రోత్సాహం అందించడానికి బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించలేదు. పారిశ్రామిక సేవా రంగాల్లో అవసరమైన కొత్త పరిశోధనలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఊతమిస్తున్నాయి. కానీ రైతులతో మాత్రం అదే పాత పద్ధతుల్లో వ్యవసాయం చేయిస్తున్నాయి. ఇంతటి అస్థిరమైన వాతావరణంలో సైతం ఏనాడు తెలంగాణ రైతు వెన్నుచూపకుండా, భూ తల్లిని నమ్ముకుని మట్టిలో నుంచి విలువైన సంపదను సృష్టిస్తూనే ఉన్నారు.  ఆ సంపద సృష్టి ద్వారా ప్రయోజనాలను దేశ ప్రజలందరికీ పంచుతూ,  రైతు మాత్రం ఉరికొయ్యకు వేలాడుతున్నాడు. 

- ప్రొ.చిట్టెడ్డి కృష్ణా రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ