టెండర్లు పిలవకుండానే చేప పిల్లల పంపిణీ

టెండర్లు పిలవకుండానే చేప పిల్లల పంపిణీ
  • ఆలస్యమవుతున్న చేప పిల్లల పంపిణీ 
  • ఇంకా టెండర్లు పిలవని సర్కారు
  • ఏటా జులైలోనే పంపిణీ పూర్తి  
  • ఆలస్యమైతే నష్టపోతామన్న మత్స్యకారులు


పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ సర్కార్ చేప పిల్లల పంపిణీని పట్టించుకోవడం లేదు. గతేడాది టెండర్లు పిలువకుండా నామ మాత్రంగా చేప పిల్లలు పంపిణీ చేసింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు మొదలై నెల గడుస్తున్నా ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలవలేదు. గతేడాది సర్కార్​ ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయకపోవడంతో మత్స్యకారులు ప్రైవేటుగా కొని చెరువుల్లో వేశారు. లేట్ గా వేయడంతో చేపలు సరైన సమయానికి చేతికి రాకపోగా, చాలా వరకు చనిపోయాయి. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. సర్కార్ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి అవసరమైన చేప పిల్లలను వెంటనే పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

ప్రశ్నార్థకమైన ఉచిత పంపిణీ..

పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, పార్వతి బ్యాచేజ్​1,013 చెరువులు, వీటిపై 133 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చెందిన 9,003 కుటుంబాల, 38 మహిళా సొసైటీలపై 1,279 కుటుంబాలు, 7 మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సంఘాల ద్వారా 360 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో చేపలు పెంచుకొని జీవించే వారికి ప్రభుత్వం లైసెన్సులు జారీ చేస్తోంది. చెరువులు, కుంటలను లీజుకు తీసుకొని చేపలు పెంచుకు బతికే వారికి ఉచితంగా సర్కార్​ చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటైన నాటి నుంచి మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందిస్తోంది. ఏటా జులైలోనే చేప పిల్లల పంపిణీ పూర్తి చేసేవారు. దీనికోసం మే నుంచే ప్రభుత్వం ఏర్పాట్లు చేసేది. సప్లయ్ చేసే వారి నుంచి టెండర్లు ఆహ్వానించేది. టెండర్లు దాఖలైన వెంటనే వాటిని ఫైనల్ చేసి చేప పిల్లలు సప్లయ్ చేసేది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో పెంచేందుకు 80 నుంచి 100 ఎంఎం సైజు పిల్లలను సప్లయ్ చేసేవారు. చెరువులు, కుంటల్లో పెంచేందుకు 35 నుంచి 40 ఎంఎం సైజులో ఉండే చేప పిల్లలను పంపిణీ చేసేవారు. గతేడాది టెండర్ల ప్రక్రియలో గోల్​మాల్ జరుగుతోందన్న ఆరోపణల ఆధారంగా చేప పిల్లల పంపిణీ ప్రక్రియను సర్కార్ పక్కన పడేసింది. ఈఏడాది కూడా సమయం దాటిపోతోందని, అయినా ప్రభుత్వం నుంచి స్పందన కన్పించడంలేదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

కావాలనే ​చేస్తోందా..?

పరిస్థితులను గమనిస్తుంటే చేప పిల్లల పంపిణీని కావాలనే సర్కార్​ లేట్ చేస్తోందన్న ఆరోపణలొస్తున్నాయి. జిల్లాలో ఉన్న నీటి వనరులకు చేప పిల్లలను పెంచేందుకు కోటి 59 లక్షల చేప పిల్లలు, 29 లక్షల రొయ్య పిల్లలు అవసరమని మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారికూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. గతేడాది చేపపిల్లల ఫాంలు లేనివారు కూడా టెండర్లు వేశారని, తక్కువ సైజు పిల్లలను పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో  సర్కార్ సెప్టెంబర్ లో 35 లక్షల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేసింది. అప్పటికే మత్స్యకారులు ప్రైవేటులో చేప పిల్లలను కొని చెరువులు, కుంటల్లో పోశారు. చివరకు ఎండా కాలం రావడంతో చేపలు ఎదగకుండానే అమ్మి తీవ్రంగా నష్టపోయారు.

ప్రక్రియ కొనసాగుతోంది

చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ తొందరలోనే పూర్తవుతుంది. ఈనెల చివరి వరకు చేప పిల్లల పంపిణీ పూర్తి చేస్తాం. గతేడాది వివిధ కారణాలతో అనుకున్న సమయానికి అందించలేకపోయాం. ఈసారి అలా జరగదు.
- భాస్కర్, డీఎఫ్​ఓ, పెద్దపల్లి 

సరైన టైంలో వేస్తేనే ఎదుగుతాయి

చేప పిల్లలను సరైన టైంలో చెరువుల్లో వేస్తేనే ఎదుగుతాయి. మత్స్యకారులకు లాభాలు వస్తాయి. పోయినేడు మాదిరిగా చేయొద్దు. లేట్ అయితే బాగా నష్టపోతాము.
- సత్తయ్య, మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి