- కేబినెట్ ఆమోదమే తరువాయి
- దాదాపు 550 పోస్టుల భర్తీకి చర్యలు
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ శాఖలో కారుణ్య నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నియామకాల కింద దాదాపు 550కి పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ఆ శాఖ ఫైల్ రెడీ చేసింది. అర్హతలను బట్టి ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో నియమించనున్నారు. ఈమేరకు విభాగాల వారీగా పోస్టుల వివరాల జాబితాను రెడీ చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా అంగీకరించింది. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ ఫైల్‌కు ఆమోద ముద్ర పడితే.. ఏండ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కుటుంబాల్లో వెలుగు నిండనున్నాయి.
నియామకాల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం..
పంచాయతీ రాజ్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు, జెడ్పీ పరిధిలోని స్కూళ్లలో ఎవరైనా టీచర్లు మరణించినా, ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా.. ఆ ఉద్యోగి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. ఈ విధానం కొన్ని దశాబ్దాలుగా వస్తున్నదే. కానీ, కొన్నేండ్లుగా వివిధ కారణాలతో మృతిచెందిన జడ్పీ, మండల పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర స్థానిక సంస్థల ఉద్యోగుల వారసులకు ఇవ్వాల్సిన కారుణ్య నియామకాలు ఆగిపోయాయి.
ఈ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో చాలా మంది వయసు మీరిపోయి అనర్హులుగా మిగిలారు. అర్హులైనవారు కూడా ఏజ్బార్అయితామేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వందలమంది కారుణ్య నియామకాల కింద తమకు ఉద్యోగం కల్పించాలని కోరుతూ పంచాయతీ రాజ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ విషయంలో బాధిత కుటుంబాల్లోని సభ్యులు పలుమార్లు మంత్రి సీతక్కను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రి సీతక్క ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కారుణ్య నియామకాలకు లైన్ క్లియర్ చేశారు.
న్యాయపరమైన చిక్కులు లేకుండా..
పంచాయతీరాజ్ శాఖలో దసరా పండుగకు ముందే కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే, నేరుగా నియామకాలు చేపడితే.. న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో త్వరలో జరగబోయే కేబినెట్లో ఫైల్ ఆమోదం పొందిన తర్వాత కారుణ్య నియామకాలు చేపట్టే అవకాశముంది.