
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: సాగు పనులు సులువుగా చేసేందుకు ఉద్ధేశించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని (ఫామ్ మెకనైజేషన్) రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తోంది. గతంలో ఈ పథకం కింద సబ్సిడీపై రైతులకు పంటల సాగుకు ఉపయోగపడే వివిధ రకాల వ్యవసాయ పరికరాలను అందించేవారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయలేదు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అవసరాన్ని గుర్తించి ఈ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.3 కోట్లు మంజూరయ్యాయి. మూడు జిల్లాల్లో 75 మండలాలు ఉండగా మొత్తం 1,323 యూనిట్లకు ఈ మొత్తం కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలలోని సన్న చిన్న కారు మహిళా రైతులకు ఈ పరికరాలను మంజూరు చేస్తారు. ఈ మేరకు అర్హులైన రైతుల నుంచి వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
మెదక్ జిల్లాలో..
ఈ పథకం కింద మెదక్ జిల్లాకు రూ.69 లక్షలు మంజూరయ్యాయి. మొత్తం 234 యూనిట్లకు ఈ మొత్తం కేటాయించారు. ఇందులో ట్రాక్టర్లు 6, డ్రోన్ ఒకటి, రోటో వేటర్లు 20, సీడ్ కమ్ ఫర్టి లైజర్ మిషన్లు 8, డిస్క్ ఫ్లవ్ లు 39, బండ్ ఫార్మర్లు 3, పవర్ వీవర్లు 2, బుష్ కట్టర్లు 4, పవర్ టిల్లర్లు 3 కేటాయించారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లా కు మొత్తం 459 యూనిట్లు మంజూరయ్యాయి. వీటికోసం రూ.1.69 కోట్లు మంజూరయ్యాయి. చేతి పంపులు, తైవాన్ పంపులు, డ్రోన్లు, రోటవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు, గడ్డి కోత మిషన్లు, పవర్ టిల్లర్లు, ట్రాక్టర్లు, మొక్కజొన్న పట్టే యంత్రాలు, పత్తిని మూట కట్టే పరికరాలు అందిస్తుండగా వీటిలో రోటవేటర్లు, కేజీ వీల్స్, తైవాన్ పంపులు ఎక్కువగా మంజూరయ్యాయి. సిద్దిపేట వ్యవసాయ డివిజన్ కు 92 యూనిట్లకు రూ.22.14 లక్షలు, దుబ్బాక కు 82 యూనిట్లకు రూ.19.52 లక్షలు, హుస్నాబాద్ డివిజన్ కు 89 యూనిట్లకు రూ. 26.31, గజ్వేల్ కు 72 యూనిట్లకు రూ.11.51, ములుగుకు 58 యూనిట్లకు రూ.9.40 , చేర్యాల కు 66 యూనిట్లకు రూ.11.98 లక్షలు మంజూరయ్యాయి.
సంగారెడ్డి జిల్లాకు..
జిల్లాలో 28 మండలాలు ఉండగా 630 యూనిట్లకు రూ.1.31 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో బ్యాటరీ/ మ్యాన్వల్స్పేయర్లు 168, పవర్స్పేయర్లు169, డ్రోన్ ఒకటి, రోటోవేటర్లు 87, సీడ్కమ్ ఫర్టిలైజర్డ్రిల్స్ 20, కల్టివేటర్, ఎంబీ ఫ్లవ్, కేజ్వీల్, రోటోపడ్లర్లు 144, బండ్ ఫార్మర్లు 3, పవర్ వీడర్లు 10, బుష్ కటర్లు 10, పవర్ ట్రిల్లర్లు 10, ట్రాక్టర్లు 2, మెయిజ్షెల్లర్లు 2, స్ట్రాబేలర్స్3 మంజూరయ్యాయి.
సబ్సిడీ ఇలా..
ఎస్సీ, ఎస్టీ, బీసీలలో సన్న చిన్న కారు మహిళా రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఆయా పరికరాలు మంజూరు చేస్తారు. సింగిల్ యూనిట్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యూనిట్ కాస్ట్ లో 50 శాతం సబ్సిడీ ఉంటుంది. జనరల్ వారికి 40 శాతం సబ్సిడీ ఉంటుంది. ట్రాక్టర్లు, డ్రోన్లను కో ఆపరేటివ్ సొసైటీలు, ఎఫ్ పీ వోలు, ఎస్ హెచ్ జీలు, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లకు కేటాయిస్తారు. యూనిట్ వ్యయం లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉన్నవాటికి దరఖాస్తు చేసే రైతులకు ఒక ఎకరం భూమి ఉండాలి. డ్రోన్ కోసం దరఖాస్తు చేసే రైతులకు 2.5 ఎకరాల భూమి ఉండాలి.
సద్వినియోగం చేసుకోవాలి
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఆయా పరికరాల అవసరం ఉన్న మహిళా రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారికి దరఖాస్తు పెట్టుకోవాలి. వచ్చిన దరఖాస్తుల వివరాలను యాప్ లో అప్ లోడ్ చేస్తాం. గైడ్ లైన్స్ ప్రకారం ఏవో, ఏడీఏ స్థాయిలోనే అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తాం.
విన్సెంట్ వినయ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి