ఇవ్వాల నుంచి లక్షన్నర రుణమాఫీ

ఇవ్వాల నుంచి లక్షన్నర రుణమాఫీ
  • 6 లక్షల రైతుల అకౌంట్లలో రూ.7 వేల కోట్లు 

హైదరాబాద్, వెలుగు: లక్షన్నర రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. మంగళవారం రెండో విడతగా రైతుల క్రాప్​లోన్ అకౌంట్లలో నిధులు జమ చేయనుంది. అసెంబ్లీ ఆవరణలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు బటన్ నొక్కి రుణమాఫీకి నిధులను విడుదల చేయనున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర లోపు రుణం ఉన్న ఆరు లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.7వేల కోట్ల నిధులను జమచేయనున్నారు. ఈ నిధుల విడుదల కోసం ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


రుణమాఫీ 2024లో మొదటి విడతగా రూ.లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.32 లక్షల కుటుంబాలకు రూ.6014 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సాంకేతిక సమస్యలతో 17,877 ఖాతాల్లో రూ.84.94 కోట్లు జమ కాలేదు. వ్యవసాయశాఖకు మొదటి దశ రుణమాఫీపై దాదాపు 1 లక్ష 20 వేల ఫిర్యాదులు వచ్చాయి. ఆధార్, బ్యాంక్ ఖాతాలో ఒకే విధంగా పేరు లేకపోవడం వంటి ఫిర్యాదులు వచ్చాయి. 

వీటన్నింటినీ పరిష్కరించనున్నారు. బ్యాంక్ అకౌంట్ 1 నుంచి 9 నంబర్ తో స్టార్ట్ అవుతుందనీ అయితే 0 నుంచి స్టార్ట్ అయ్యే అకౌంట్లకు రుణమాఫీ కాలేదు అని ఫిర్యాదులు వచ్చాయని వ్యవసాయ కార్యదర్శి రఘునందన్​రావు వెల్లడించారు. ఆర్​బీఐ సూచించిన వివరాల ప్రకారం ఈ రైతుల అకౌంట్​లలో ఉన్న టెక్నికల్​ సమస్యలను పరిష్కరించడానికి కొంత టైమ్ పడుతుందని వీటిని సరిచేసి, ఆర్​బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా రైతుల అకౌంట్​లలో జమ చేస్తారు.