రూ.62 కోట్ల వడ్లు బయట అమ్ముకున్నరు...సర్కారు ధాన్యంతో మిల్లర్ల అక్రమ దందా

రూ.62 కోట్ల వడ్లు బయట అమ్ముకున్నరు...సర్కారు ధాన్యంతో మిల్లర్ల అక్రమ దందా
  • సీఎంఆర్‌‌ బకాయిలపై ప్రభుత్వం సీరియస్ 
  • ఎనిమిది మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్
  • రెండు మిల్లులపై క్రిమినల్ కేసులు.. మిల్లర్ అరెస్ట్ 
  •  డీఫాల్ట్ లిస్టులో 39 మిల్లులు

మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వం కస్టమ్​ మిల్లింగ్​ కోసం ఇచ్చిన వడ్లను పెద్ద మొత్తంలో పక్కదారి పట్టించి కొందరు రైస్ మిల్లర్లు కోట్లకు పడగలెత్తారు. సీఎంఆర్ బకాయిలపై గవర్నమెంట్​ సీరియస్​గా ఉండడంతో సివిల్ సప్లయి అధికారులు ఇటీవల మిల్లుల లెక్కలు తీశారు.  కేవలం ఎనిమిది మందే రూ.62 కోట్లు సర్కారుకు బకాయిపడ్డట్టు తేల్చారు. జిల్లాలో  రా, బాయిల్డ్​ మిల్లులు 54 ఉండగా, వీటిలో 39 మిల్లులు డీఫాల్ట్​ లిస్టులో చేరాయి. ఈ మిల్లర్లు ఎవరెంత తిన్నారో లెక్కలు తీస్తే రూ.100 కోట్లు దాటిపోయే అవకాశం కనిపిస్తోంది. 

సర్కారు ధాన్యంతో దందా.. 

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన వడ్లను సీఎంఆర్​ కోసం రైస్​ మిల్లర్లకు అప్పగిస్తుంది. ఈ వడ్లను మిల్లింగ్​ చేసి క్వింటాలుకు 67 కిలోల బియ్యాన్ని సీఎంఆర్​ కింద ఇవ్వాల్సి ఉంటుంది. గత సర్కారు మిల్లర్ల నుంచి ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకోకుండానే రూ. కోట్ల విలువైన వడ్లను  అప్పజెప్పింది. కొందరు మిల్లర్లు ఈ వడ్లను అమ్ముకోగా, మరికొందరు వడ్లను మిల్లింగ్​ చేసి బియ్యాన్ని అమ్ముకున్నారు.

 ఇలా ఒక్కో మిల్లర్ రెండు మూడు సీజన్ల సీఎంఆర్ ఎగ్గొట్టి కోట్లు కూడబెట్టుకున్నారు. రేషన్​ బియ్యాన్ని రీసైక్లింగ్​ చేసి అరకొరగా సీఎంఆర్  డెలివరీ చేశారు. కొందరు అధికారులు మిల్లర్లతో మిలాఖత్​ అయి ‘మామూలు’గా తీసుకోవడం, ప్రభుత్వం పదేపదే గడువులు పొడిగించడం వారికి వరంగా మారింది. 2019–-20 యాసంగి నుంచి 2022–-23 యాసంగి సీజన్లకు సంబంధించి 9 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్ ఉంది. దీంతో అధికారులు 39 మిల్లులను డీఫాల్ట్ లిస్టులో చేర్చారు. 

క్రిమినల్​ కేసులు... మిల్లర్​ అరెస్ట్​

డీఫాల్ట్​ లిస్టులో ఉన్న 39 మిల్లుల్లో మొండి బకాయిదారులైన 17 మిల్లులపై రెవెన్యూ రికవరీ (ఆర్​ఆర్​) యాక్ట్​ ప్రయోగించి ఆస్తులు జప్తు చేయాలని సివిల్​ సప్లయిస్​ అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా ఇటీవల ఎనిమిది మిల్లులపై ఆర్​ఆర్​ యాక్ట్​ ప్రయోగించారు. మాతేశ్వరి ఆగ్రో ఇండస్ర్టీస్​ (లక్ష్మీపూర్​), దుర్గా ఇండస్ర్టీస్​ (నర్సింగాపూర్​)పై ఆర్​ఆర్​ యాక్ట్​తో పాటు క్రిమినల్​ కేసులు నమోదు చేశారు. వీటి యజమాని దర్శనాల రమేశ్​ను బెల్లంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు మిల్లులు రూ.17 కోట్ల విలువైన సీఎంఆర్ బకాయి పడ్డట్టు అధికారులు తెలిపారు.

మిగతా మిల్లులపై కూడా క్రిమినల్​ కేసులు పెడుతామని సివిల్​ సప్లయిస్​ అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా బకాయిలు ఉన్న మిల్లుల వివరాలకొస్తే అన్నపూర్ణ ఆగ్రో మోడ్రన్​ రైస్​ మిల్​ (కుందారం) - రూ.3 కోట్లు, వాసవీమాత ఆగ్రో ఇండస్ర్టీస్​ (రేచిని) - రూ.4 కోట్లు, బీఎస్​వై రా రైస్​మిల్​ (ముదిగుంట) - రూ.19 కోట్లు, శ్రీవెంకటరమణ ఆగ్రో ఇండస్ర్టీస్​ (కోటపల్లి) - రూ.9 కోట్లు, శ్రీలక్ష్మీనర్సింహా మోడ్రన్​ రైస్​మిల్​ (కలమడుగు) ‌‌- రూ.3 కోట్లు, జై యోగేశ్వర ఇండస్ర్టీస్​ (కొత్తూర్​) - రూ.7 కోట్లు, మాతేశ్వరి ఆగ్రో ఇండస్ర్టీస్​ (లక్ష్మీపూర్​) - రూ.7 కోట్లు, దుర్గా ఇండస్ర్టీస్​ (నర్సింగాపూర్​) - రూ.10 కోట్లు ఉన్నాయి.  వీటిపై  రెవెన్యూ రివకరీ యాక్ట్​ ప్రయోగించారు.

జిల్లాలో సీఎంఆర్​ బకాయిల వివరాలు (మెట్రిక్​ టన్నుల్లో)

సంవత్సరం    సీజన్    పెండింగ్


2019- 20     యాసంగి    6,76.21    2021-22    వానాకాలం    3,386.48    2021-22    యాసంగి    3,019.20    2022-23    వానాకాలం    2,026.51