గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం: అప్పట్లో ఐఎంజీ భూములే ఇవి.. ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం

గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం: అప్పట్లో ఐఎంజీ భూములే ఇవి.. ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం

హైదరాబాద్ అభివృద్ధికి కేరాఫ్గా మారిన గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ భూములకు సంబంధించి మాస్టర్ లేఔట్ డిజైన్ చేసే పనిలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) తలమునకలైంది. ఈ భూములకు వేలంపై బిడ్డింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 

డిసెంబర్ 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇదే అతి పెద్ద భూముల వేలంపాట కావడం గమనార్హం. ఈ భూములను వేలం వేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి 20 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా. హైదరాబాద్ నగరంలో అతి పెద్ద ఐటీ హబ్, రెసిడెన్షియల్ హబ్ అయిన గచ్చిబౌలిలో ఈ భూములు ఉండటం విశేషం. హైటెక్ సిటీకి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ 400 ఎకరాలు ఉన్నాయి.

పంజాగుట్ట క్రాస్ రోడ్స్కు 15 నుంచి 18 కిలోమీటర్ల దూరంలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు 22 కిలోమీటర్ల దూరంలో, శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు 33 కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉందని బిడ్ డాక్యుమెంట్లో స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి పశ్చిమాన ఈ 400 ఎకరాల భూములు ఉన్నాయి. 

హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు అతి సమీపంలో ఈ భూములు ఉన్నాయని బిడ్ డాక్యుమెంట్లో హైలైట్ చేశారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో 100కు పైగా ఐటీ, గ్లోబల్ కంపెనీలు ఉన్నాయి. సుమారు 10 లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ కంపెనీల్లో పనిచేస్తున్నారు. రాయదుర్గ్లో 470 ఎకరాల్లో అభివృద్ధి చేసిన హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ కూడా ఈ 400 ఎకరాల భూములకు దగ్గర్లోనే ఉంది.

కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూముల పుట్టుపూర్వోత్తరాలేంటంటే..
శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని 2006లో నాటి ప్రభుత్వం ఐఎంజీ అకాడమిక్స్, భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. అదే ఏడాది ఈ కేటాయింపులను నాటి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఐఎంజీ అకాడమిక్స్, భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కోర్టుకు వెళ్లాయి. 

Also Read:-ఎల్ఆర్ఎస్​స్కీం.. దరఖాస్తుదారులు స్టేటస్​ చెక్​ చేసుకోండిలా..

ఈ వివాదంపై 2006 నవంబర్ 29న అప్పటి హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో పాటు తుది తీర్పు వెలుబడే వరకు సదరు భూమి ప్రభుత్వ అధీనంలో ఉండాలని ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ భూమిపై హైకోర్టులో కేసు నడుస్తూనే ఉంది. దీంతో గచ్చిబౌలి స్టేడియానికి అనుకొని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఈ 400 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. హైకోర్టు తీర్పుతో ఈ భూమి ప్రభుత్వానికి చెందింది. చాలా ఏళ్ల తర్వాత ఈ భూముల వేలానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది.