ఐటీఐలలో అడ్వాన్స్​ టెక్నాలజీ..హనుమకొండలో సెంటర్ల ఏర్పాటు

  • రూ.9 కోట్లతో ప్రారంభమైన వర్క్స్
  • పనుల పూర్తికి నవంబర్ డెడ్ లైన్
  • ఈ ఏడాదే అడ్మిషన్లు..!

హనుమకొండ, వెలుగు : మారుతున్న కాలంతో పాటు ప్రస్తుత ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా యువతలో స్కిల్స్ డెవలప్​ చేసేందుకు ప్రభుత్వం ఐటీఐల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)ను ఏర్పాటు చేస్తోంది. ఐటీఐలకు అనుబంధంగా కొత్త కోర్సులను తీసుకువచ్చి యువతకు ట్రైనింగ్​ ఇవ్వడంతోపాటు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలు నిర్మించనుండగా, హనుమకొండ ఐటీఐ ప్రాంగణాల్లో వాటికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. నవంబర్ వరకల్లా పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకోగా, వర్క్స్​ పూర్తయితే ఈ ఏడాది నుంచే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి అడుగులు పడనున్నాయి.

ఏటీసీలకు ప్రత్యేక బిల్డింగులు..

గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీఐలను నిర్లక్ష్యం చేసింది. కొత్త కోర్సులు, ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ల అప్​ గ్రేడ్లను గాలికొదిలేసింది. అరకొర వసతులతో ఐటీఐలు నిర్వీర్యమై విద్యార్థులు కూడా నైపుణ్యాభివృద్ధికి దూరమయ్యారు. కనీస రిపేర్లు లేక శిథిల భవనాలతో ఇబ్బందులు పడ్డారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలను అప్​గ్రేడ్ చేసి, యువత, నిరుద్యోగుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఐటీఐ అడ్వాన్స్డ్​ టెక్నాలజీ వర్క్ షాప్​లను నిర్మిస్తుండగా, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టేట్​ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్ పనులు చేపడుతోంది.

ఈ మేరకు ఐటీఐ ప్రాంగణాల్లో ఏటీసీ వర్క్ షాప్​లకు ప్రత్యేకంగా బిల్డింగులు నిర్మిస్తున్నారు. వరంగల్–ములుగు రోడ్డులోని ఐటీఐ ప్రాంగణంలో వరంగల్, హనుమకొండ ఏటీసీలను ఏర్పాటు చేస్తుండగా, ఒక్కో సెంటర్ నిర్మాణానికి రూ.4.5 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. రెండు సెంటర్ల పనులు రూ.9 కోట్లతో చేపట్టగా,  దాదాపు 13,780 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. 

ఆరు కొత్త ట్రేడ్లలో అడ్మిషన్లు..

ఇప్పటికే ఏటీసీల నిర్మాణ పనులు ప్రారంభమవగా, నవంబర్ కల్లా కన్ స్ట్రక్షన్ వర్క్స్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మేరకు పునాది పనులు స్టార్ట్ చేశారు. వర్షాలతో ఇబ్బందులు తలెత్తుతుండగా, సాధ్యమైనంత తొందర్లో పనులు కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఈ పనులు పూర్తై, మౌలిక వసతులు సమకూరితే.. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు స్టార్ట్ చేసి, కోర్సులు రన్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. యువతలో స్కిల్స్ డెవలప్ చేసి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు ఏటీసీల్లో ఆరు కొత్త ట్రేడ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

అందులో వన్​ ఇయర్ ట్రేడ్లు మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్టిజన్​ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ ఉండగా, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ మెకానికల్, అడ్వాన్స్డ్ సీఎన్​సీ మెషీనింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రిక్ వెహికిల్​ మెకానిక్ అనే రెండు సంవత్సరాల ట్రేడ్లు ఉన్నాయి. ఒక్కో ట్రేడ్ లో 40 సీట్ల వరకు కేటాయించగా, ఇప్పటికే ఐటీఐల ప్రిన్సిపల్స్, ఇతర స్టాఫ్​కు శిక్షణ​ ఇచ్చారు. అనుకున్న సమయంలోనే పనులు పూర్తయితే విద్యార్థులకు ఆయా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.

ట్రైనింగ్​కూడా పూర్తయ్యింది..

ప్రభుత్వం ఏటీసీలను ఏర్పాటు చేసి యువతలో నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే బిల్డింగ్ నిర్మాణ పనులు స్టార్ట్​  అయ్యాయి. ఆరు కొత్త ట్రేడ్లపై స్టాఫ్​కు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వరంగల్, హనుమకొండ ఐటీఐలకు సంబంధించిన 19 మంది ఖమ్మం జిల్లాలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నం. పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతాం.

- జుమ్లానాయక్, వరంగల్ ఐటీఐ ప్రిన్సిపల్​