ఆంధ్రా నుంచి కోళ్లను రానివ్వొద్దు.. ప్రభుత్వ ఆదేశాలతో.. సూర్యాపేట జిల్లాలో తాజా పరిస్థితి ఇది..

ఆంధ్రా నుంచి కోళ్లను రానివ్వొద్దు.. ప్రభుత్వ ఆదేశాలతో.. సూర్యాపేట జిల్లాలో తాజా పరిస్థితి ఇది..

సూర్యాపేట జిల్లా: ఆంధ్రా నుంచి తెలంగాణకు బాయిలర్ కోళ్లను తరలించకుండా ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. బాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో ఆంధ్రా నుంచి తెలంగాణకు బాయిలర్ కోళ్లను తరలించకుండా పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 6 వ తేదీన ఆదేశాలు జారీ చేయడంతో రోజుకు ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున వెటర్నరీ సంబంధిత అధికారులు ఏపీ, తెలంగాణ బోర్డర్లో విధుల్లో ఉన్నారు.

ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభించిన సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాల్లో వైరస్తో లక్షల కోళ్లు చనిపోతున్నాయి. మరీ ముఖ్యంగా.. తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీంతో.. రెడ్ జోన్, సర్వేలెన్స్ జోన్లు ఏర్పాటు చేశారు. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో సేకరించిన శాంపిల్స్కు బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు మృత్యువాత పడ్డాయి. ఒక్కో పౌల్ట్రీ ఫాంలో రోజుకు 10 వేలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు సమాచారం.

Also Read :- ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపేస్తున్నారు..!

బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను ఇప్పటికే పూడ్చి పెట్టడం, కాల్చేయడం చేస్తున్నారు. ఇప్పటికే 75 శాతం వైరస్ సోకిన కోళ్లు, కోడిగుడ్లను కాల్చి వేసినట్లు పౌల్ట్రీ యజమానులు తెలిపారు. గడచిన ఐదారు రోజుల్లో  పౌల్ట్రీ నుంచి కోళ్లను ఏయే ప్రాంతాలకు వాహనాల ద్వారా రవాణా చేశారో ఆరా తీయాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.