
- హార్టికల్చర్, సీడ్, సీడ్ సర్టిఫికేషన్, హాకా, ఆగ్రోస్,
- వేర్ హౌసింగ్‌లను విలీనం చేయాలని సర్కారు యోచన!
- కార్పొరేషన్ల కార్యకలాపాలు, ఆర్థిక పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
- రిపోర్ట్ వచ్చాక విలీనానికి చర్యలు.. ఐఏఎస్‌లకు బాధ్యతలు!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అగ్రికల్చర్ కార్పొరేషన్లనన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తున్నది. ఆయా సంస్థల కార్యకలాపాలు, ఆర్థిక పరిస్థితులు, లాభనష్టాలపై నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశం మేరకు ప్రత్యేక నివేదిక రూపొందించే పనిలో వారు నిమగ్నమయ్యారు. ఈ రిపోర్ట్‌ను పరిశీలించిన అనంతరం.. త్వరలోనే కార్పొరేషన్ల విలీనంపై సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ప్రధానంగా అగ్రికల్చర్ అనుబంధ కార్పొరేషన్లలో ఆగ్రోస్, హాకా, హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికేషన్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. తద్వారా కార్పొరేషన్ల పనితీరు మరింత మెరుగుపరచాలని భావిస్తున్నట్టు సమాచారం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీలు, మార్క్‌ఫెడ్ లు సైతం ఎరువుల సరఫరా, వ్యవసాయ పంటల కొనుగోళ్లను చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పరిధిలోని ప్యాక్స్‌లు, మార్క్‌ఫెడ్‌లను సైతం విలీనం చేస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో విలీన సంకేతాలు
అగ్రికల్చర్ కార్పొరేషన్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు కార్పొరేషన్ల విలీనం నిర్ణయానికి బలం చేకూరుస్తున్నాయి. సోమవారం సెక్రటేరియట్లో జరిగిన సమావేశంలోనూ తుమ్మల నాగేశ్వరరావు కార్పొరేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే రకమైన పనిని వివిధ కార్పొరేషన్లు చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఏ కార్పొరేషన్ సరిగ్గా పని చేయడం లేదని అన్నట్టు తెలిసింది. ఒకే కార్యకలాపాల్ని నిర్వహించే సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సి ఉంటుందని ఆయన సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు. నాటి పరిస్థితులకు తగ్గట్టుగా ఏర్పడ్డ కార్పొరేషన్లు.. మారుతున్న రైతుల, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి నిర్వహణ బాధ్యత తీసుకొంటేనే వాటి మనుగడ సాధ్యమని అభిప్రాయపడ్డారు. కార్పొరేషన్లు నిర్వహించే కార్యకలాపాలు, సంస్థల ఆర్థిక స్థితిపై నివేదిక అందిన వెంటనే వాటి బలోపేతం కానీ, విలీనానికి సంబంధించిన నిర్ణయం కానీ తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతిమంగా రైతులకు సమర్థవంతంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తుమ్మల పేర్కొన్నారు.
ఐఏఎస్‌లకు బాధ్యత అప్పగించే చాన్స్
కార్పొరేషన్లు అవినీతికి అడ్డాలుగా మారుతున్నాయనే అభిప్రాయంతో సర్కారు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ కార్పొరేషన్లన్నింటీని ప్రక్షాళన చేసి.. విలీనం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. కార్పొరేషన్ల లాభనష్టాలను పరిశీలించి.. త్వరలో ఒక నిర్ణయానికి రానున్నట్టు సమాచారం. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించడమే సరైన పరిష్కారమని సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది.
కార్పొరేషన్లపై సర్కారు అసంతృప్తి
వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్ల పనితీరుపై సర్కారు అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొన్ని కార్పొరేషన్లతో ప్రభుత్వానికి ఏమాత్రం లాభం లేదనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది. వ్యవసాయ శాఖ పరిధిలో ఇన్ని కార్పొరేషన్లు అవసరమా? అని మంత్రి తుమ్మల బాహాటంగానే పలుసార్లు వ్యాఖ్యానించారు. ఒకే రకమైన పనిని వివిధ కార్పొరేషన్లు చేయడం, వాటి మధ్య సమన్వయం లేకపోవడంతో అంతిమంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. కార్పొరేషన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సరిగా పని చేయడం లేదనే విమర్శలుసైతం వినిపిస్తున్నాయి. ప్రధానంగా హాకా, సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికేషన్, ఆగ్రోస్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ల పై సర్కారు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది.